తరుముకొస్తున్న నివర్‌

ABN , First Publish Date - 2020-11-26T05:59:04+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు మొదలయ్యాయి.

తరుముకొస్తున్న నివర్‌
జమ్మలమడుగు మండలం ధర్మాపురంలో వర్షం భయానికి తక్కువ ధరకే వరిధాన్యం అమ్మేస్తున్న రైతులు

 జిల్లా అంతటా తుంపర్లు

నేడు అతిభారీ వర్షాలు పడే సూచన


 జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టరు

 భయందోళనలో అన్నదాతలు 

 కుందూ, పెన్నా తీరంలో రెడ్‌ అలర్ట్‌


నివర్‌ తుఫాన్‌ తరుముకొస్తోంది. జిల్లా అంతటా తుంపర్లు, చిరు జల్లులు కురుస్తున్నాయి. రాజంపేట డివిజన్‌ పరిధిలో బుధవారం రాత్రి తేలికపాటి, భారీ వర్షాలు కురిశాయి. నేడు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. పెన్నా, కుందూ తీరంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సోమశిలతో పాటు వివిధ జలాశయాల్లో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యశాఖ అధికారులు జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. పంటలు చేతికొచ్చేవేళ నివర్‌ తుఫాన్‌ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.


(కడక-ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం ముసురు కమ్ముకుంది. మధ్యాహ్నం 2 గంటల తరువాత పలు మండలాల్లో జల్లులతో మొదలై సుమారుపాటి వర్షంగా మారింది. చిట్వేలిలో 11.4, ఓబులవారిపల్లెలో 12.2, రైల్వేకోడూరు మండలంలో 28.0, పెనగలూరులో 18.2 మి.మీల వర్షపాతం నమోదయింది. కడప నగరంతో పాటు చిన్నమండెం, సంబేపల్లె, టి.సుండుపల్లి, వీరబల్లి, నందలూరు, చిట్వేలి, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, నందలూరు, చెన్నూరు మండలాల్లో జల్లులు కురిశాయి. రాత్రి 8 గంటలకు వర్షం తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు జిల్లాలో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


చేపల వేటకు వెళ్లవద్దు

సోమశిల బ్యాక్‌ వాటర్‌, బ్రహ్మంసాగర్‌, అన్నమయ్య, వెలిగల్లు, గండికోట జలాశయాల్లో  సుమారుగా 350-400 కుటుంబాలు చేపల వేట సాగిస్తున్నాయి. రెండు రోజులు తుఫాన్‌ బీభత్సం సృష్టించే అవకాశం ఉండడంతో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యశాఖ డీడీ నాగరాజు హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు జాలర్లకు అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.


సహాయ కేంద్రాలు

కుందూ, పెన్నా తీరంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కుందూ నది ఉప్పొంగే అవకాశం ఉండడంతో పెద్దముడియం మండలంలో ఎన్‌.కొత్తపల్లి, తాలూరు, ఉప్పలూరు, రాజుపాలెం మండలంలో టంగటూరు, ప్రొద్దుటూరు పట్టణంలో ఆరు సహాయక కేంద్రాలను గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే.. మండలాల రైతులకు ఏ అవసరం వచ్చినా అందుకునేందుకు వ్యవసాయ అధికారులను జేడీ మురళీకృష్ణ సన్నద్ధం చేశారు. 


కంట్రోల్‌ రూంలు

బుధవారం అర్ధరాత్రి నుంచి బలమైన ఈదురు గాలులు, భారీ, అతిభారీ వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్‌ హరికిరణ్‌  ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నెంబర్లకు ఏ క్షణంలో కాల్‌ చేసి వివరాలు తెలిపినా తక్షణమే సహాయ చర్యలు అందజేస్తామని తెలిపారు.

 కలెక్టరేట్‌ కార్యాలయం కంట్రోల్‌ రూం నెంబరు: 08562-245259

 కడప సబ్‌ కలెక్టరు కార్యాలయం నెంబర్లు: 08562-295990, 93814 96364, 99899 72600

 రాజంపేట సబ్‌ కలెక్టరు కార్యాలయం: 08565-240066, 93816 81866

జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 08560 271088, 96766 08282


నేడు పాఠశాలలకు సెలవు : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), నవంబరు 25: నివర్‌ తుఫాను కారణంగా గురువారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలకు 26వ తేది సెలవు ప్రకటించామని వివరించారు. జిల్లాలో బలమైన ఈదురుగాలులు, అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

కడప (క్రైం), నవంబరు 25: నివర్‌ తుఫాను జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సూచించారు. నివర్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో మూడు ప్రత్యేక టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతి పోలీసు సబ్‌ డివిజన్‌లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేశామన్నారు. బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్‌ సామగ్రి, లై్‌ఫ్‌ జాకెట్లు, టార్చ్‌లైట్లు, తాళ్లు అందజేశామన్నారు. తుఫాను వల్ల దెబ్బతినే బ్రిడ్జిలు, వాగులు, వంకలపై ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు.


తుఫానులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్పీడీసీఎల్‌ 

కడప(సిటీ), నవంబరు 25: నివర్‌ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, రైతులు సహా వినియోగదారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీరు ఎన్‌.శ్రీనివాసులు పేర్కొన్నారు. నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్‌ స్తంభాలను ఏ పరిస్థితుల్లోనూ తాకకూడదని, రైతులు మోటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలులు పెద్దగా వీచే సమయంలో విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగల కింద నిలబడవద్దని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడితే సంబంధిత లైన్‌మెన్‌ లేదా సబ్‌స్టేషన్‌ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, సొంతంగా ఎటువంటి మరమ్మతు పనులు చేపట్టకూదన్నారు. తుఫాను నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సమాచారం రాగానే అందుబాటులో ఉంటారని సూచించారు.




 

Updated Date - 2020-11-26T05:59:04+05:30 IST