నివర్‌ ముంచేసింది!

ABN , First Publish Date - 2020-11-28T05:48:27+05:30 IST

నివర్‌ తుఫాన్‌ జిల్లాను ముంచేసింది. అపార నష్టాన్ని మిగిల్చింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

నివర్‌ ముంచేసింది!
కురిచేడు మండలం ఆవులమంద వద్ద నీట మునిగిన వరి ఓదెలు

24 గంటల్లో 10.45సెం.మీ సగటు వర్షం

సగానికిపైగా మండలాల్లో కుంభవృష్టి

పంట పొలాలను ముంచెత్తిన వర్షపు నీరు

98,805హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా

పొంగిన వాగులు, వంకలు.. రాకపోకలకు ఆటంకం

కనపర్తి పల్లెపాలెంలో గుడిసె కూలి ఒకరు మృతి

పలుచోట్ల ఇళ్లలోకి చేరిన నీరు, శిబిరాలు ఏర్పాటు

సహాయక చర్యల్లో యంత్రాంగం, ప్రజాప్రతినిధులు

నేడు తుఫాన్‌ నష్టాలపై మంత్రుల సమీక్ష

ఒంగోలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):  నివర్‌ తుఫాన్‌ జిల్లాను ముంచేసింది. అపార నష్టాన్ని మిగిల్చింది.  బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా  కురుస్తున్న వర్షంతో అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్యేకించి రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో 10.45సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది.  దాదాపు సగానికిపైగా మండలాల్లో కుంభవృష్టి కురిసింది. జిల్లాలోని 35 మండలాల్లో 420 గ్రామాలపై నివర్‌  ప్రభావం ఉన్నట్లు  యంత్రాంగం గుర్తించింది.  1,06,026 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ ప్రకారం సగటున హెక్టారుకు రూ.30వేల వంతున చూసినా రూ.300కోట్లపైనే రైతులు నష్టపోయారు. తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల వలలు, పడవలు దెబ్బతిన్నాయి. మరోవైపు అన్నిప్రాంతాల్లోనూ వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో  రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాగులుప్పలపాడు మండలం కనపర్తి పల్లెపాలెంలో సైకం పోలయ్య (60) గుడిసె కూలి మృతి చెందగా పలుచోట్ల వేలాది ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు.

జిల్లాపై నివర్‌ తుఫాన్‌ ప్రభావం భారీగా చూపింది. బుధవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం శుక్రవారం రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో వ్యవసాయ రంగం  కుదేలైంది. ఖరీఫ్‌తో పాటు రబీ కలిపి ఇప్పటివరకు 2.50లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా లక్ష హెక్టార్లకు పైగా దెబ్బతింది. ఖరీఫ్‌లో సాగైన పత్తి, కంది, మిర్చి, వరి, మినుము వంటి పంటలు ప్రస్తుతం చాలాప్రాంతాల్లో పూత, కాయదశతోపాటు కొన్నిచోట్ల కోతకు వచ్చాయి. అలాంటి వాటికి ఈ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. రబీలో వేసిన పొగాకు, వరి కూడా దెబ్బతింది. కొన్నిచోట్ల కోసిన వరి ఓదెలు నీళ్లలో తేలుతున్నాయి. రూ.300కోట్లపైనే రైతులకు నష్టం వాటిల్లినట్లు అంచనా. 


పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

కుంభవృష్టితో వాగులు, వంకలు పొంగాయి. పాలేరు, మన్నేరు, ముసి, గుండ్లకమ్మ వంటి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు అవరోధం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. చాలాచోట్ల గాలుల తీవ్రతకు చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లు దెబ్బతినడంతోపాటు,  స్తంభాలు కూడా నెలకొరిగాయి. ఇక ఒంగోలు, కందుకూరు, సింగరాయకొండ, కనిగిరి, పామూరు, కంభం, పొదిలి వంటి పట్టణాలతోపాటు తీర ప్రాంతంలోని పలు మండలాల్లో అనేక పేదల కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి వేలాది కుటుంబాల వారు ఇక్కట్లు పడ్డారు. కందుకూరు మండలం పాలూరుకు చెందిన దార్ల మురళి మాచవరం వంతెన వద్ద మన్నేరులోకి దూకగా పోలీసులు రక్షించారు. 


5,690మందికి పునరావాసం

జిల్లావ్యాప్తంగా 54 పునరావాస కేంద్రాల్లో 1,285 కుటుంబాలకు చెందిన 5,690మందికి ఆశ్రయం కల్పించారు. మరోవైపు తుఫాన్‌ సహాయక చర్యల్లో కలెక్టర్‌ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా పనిచేస్తున్నారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శుక్రవారం కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో కలిసి రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించడంతో పాటు ఆప్రాంతంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. చీరాల నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లను అక్కడి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. కనిగిరి నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాలను అక్కడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి స్వయంగా పరిశీలించి రైతులను ఓదార్చారు. 

  

మరో రెండు రోజులు వర్షం!

 మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సంకేతాలు వాతావరణశాఖ నుంచి అందుతుండటంతో నష్టాలు మరింత అధికంగా ఉంటాయన్న ఆందోళన అన్ని వర్గాల వారిలోనూ కనిపిస్తోంది. కాగా జిల్లాలో తుఫాన్‌  నష్టాలపై శనివారం రాష్ట్రమంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 


విద్యార్థులకు నేడు సెలవు

ఒంగోలు విద్య, నవంబరు 27: జిల్లాలోని అన్ని యాజ మాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ శనివారం(28వతేదీ) సెల వు ప్రకటించినట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్న ట్లు చెప్పారు. ఉపాధ్యాయులు మాత్రం హాజరై  సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని డీఈవో కోరారు.









Updated Date - 2020-11-28T05:48:27+05:30 IST