నివర్‌.. పోర్టు.. వెలిగొండ!

ABN , First Publish Date - 2020-11-30T05:24:46+05:30 IST

జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఉపయోగించుకుని అసెంబ్లీలో జిల్లా సమస్యలను ప్రస్తావించాల్సిన ఆవశ్యకత శాసనసభ్యులపై ఉంది.

నివర్‌.. పోర్టు.. వెలిగొండ!
శాసనసభా కార్యాలయం (ఫైల్‌)

ఇవే ప్రధాన సమస్యలు 

ఎమ్మెల్యేలు కదలాలి.. గళం విప్పాలి!

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

సమయం తక్కువైనా స్పందించాలని

కోరుతున్న ప్రజానీకం 

ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో  ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఉపయోగించుకుని అసెంబ్లీలో జిల్లా సమస్యలను ప్రస్తావించాల్సిన ఆవశ్యకత శాసనసభ్యులపై ఉంది. యావత్‌ జిల్లా ప్రజానీకం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. నివార్‌ తుఫాన్‌ వలన జరిగిన నష్టం, రైతుల కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు కృషి చేయాలని కోరుతోంది. రామాయపట్నం పోర్టు, వెలిగొండ ప్రాజెక్టుల గురించి కూడా గళం విప్పాలని కోరుతోంది. 

 రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం సమావేశాలు ఐదురోజులు జరుగుతాయి. సమావేశాల్లో పాల్గొనేందుకు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులతోపాటు ఏడుగురు శాసనసభ్యులు, ప్రతిపక్ష టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. నివర్‌ తుఫాన్‌ జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ నష్టం చేకూర్చింది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మినుము, వరి, నువ్వు, పత్తి, మిరప, పొగాకు, శనగ, కంది, వేరుశనగ తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని పంటల ఉత్పత్తులు ఏమాత్రం చేతికొచ్చే అవకాశం కనిపించటం లేదు. కొన్ని పంటల దిగుబడులు యాభై శాతానికి పైగా తగ్గే పరిస్థితి నెలకొంది. పొగాకు లాంటి పంటల సాగుని తిరిగి చేపట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో రైతులు ఆర్థికంగా భారీగా నష్టపోవటమే గాక ఆహారోత్పత్తుల దిగుబడి కూడా గణ నీయంగా తగ్గబోతోంది. ఇక రోడ్లు, ఇతర కొన్ని రంగాలకు కూడా అపారనష్టం సంభవించింది. దీనికి తోడు మరో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయన్న వాతావరణ  శాఖ హెచ్చరికతో ప్రజానీకం పూర్తిగా ఆందోళన చెందుతోంది. 

రూటుమారుతున్న పోర్టు

రామాయపట్నం పోర్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోర్టు అనుబంధ పరిశ్రమలను కందుకూరు నియోజకవర్గ ప్రాంతం నుంచి కావలి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు మార్చడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేకించి కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఈ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ  విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని వచ్చే ఆగస్టు వరకూ పొడిగించింది. దీంతో పశ్ఛిమప్రాంత ప్రజానీకంలో అలజడి నెలకొంది. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే జిల్లాలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగదన్న ఆవేదన ప్రజల్లో ఉంది.ప్రజల నుండి ఏకాభిప్రాయమే వెల్లడికావటం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఇలాంటి ప్రధాన అంశాలను ప్రస్తావించి ప్రజలకు, జిల్లా ఆర్థికాభివృద్ధికి చేదోడువాదోడుగా నిలువాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై లేకపోలేదు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా

గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి ఎమ్మెల్యే 

నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ గ్రామానికెళ్లినా రైతులు కన్నీరు పెడుతున్నారు. వారిని ఆదుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయరంగానికే ముప్పు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సాగులో ఉన్న అన్ని పంటలు దెబ్బతిన్నాయి. అసెంబ్లీలో పరిస్థితిని వివరించి ప్రభుత్వాన్ని కదిలించి రైతులకు న్యాయం జరిగేవిధంగా ప్రయత్నిస్తా.

పరిశీలించిన వాస్తవాలను ప్రస్తావిస్తా 

ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో  రైతులు ఏ స్థాయిలో దెబ్బతిన్నారో పొలాల్లోకి వెళ్లి పరిశీలించాను. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తరతమ భేదాలు లేకుండా వాస్తవానికి అనుగుణంగా నష్టపరిహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 1985వ దశకంలో చూసిన పత్తిరైతుల ఆత్మహత్యల దుస్థితి రావచ్చు. అసెంబ్లీలో ఈ అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాలను కదిలించే ప్రయత్నం చేస్తా. 

పోర్టు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా 

మహీధర్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే

రామాయపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటును కావలి నియోజకవర్గానికి మార్పు చేస్తున్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. అసెంబ్లీ సమావేశాల్లో అవకాశం రాకపోయినా ముఖ్యమంత్రిని కలిసి అయినా ఈ విషయాన్ని ప్రస్తావిస్తా. నివర్‌ తుఫాన్‌ వలన నియోజకవర్గంలోని నాలుగైదు పంటలు సాగుచేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వారికి పరిహారం అందించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 

రైతుల కష్టాన్ని వినిపిస్తా

అన్నా రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే 

గిద్దలూరు నియోజకవర్గంలో నివర్‌ తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. పప్పుశనగ, వరి, కంది, మిర్చి పంటల రైతులు అపారంగా నష్టపోయి కన్నీరుమున్నీరవుతున్నారు. నష్టపరిహారాన్ని పెంచి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా 

Updated Date - 2020-11-30T05:24:46+05:30 IST