Apr 10 2021 @ 16:07PM

'వకీల్ సాబ్' థియేటర్‌లో వేముల పల్లవి..!

'వకీల్ సాబ్' సినిమా ఈ శుక్రవారం ( ఏప్రిల్ 9 ) ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో విడుదలయిన అన్నీ చోట్లా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 'వకీల్ సాబ్' రిలీజ్ ఏప్రిల్ 9న అని దర్శక, నిర్మాతలు ప్రకటించినప్పటి నుంచే ప్రతీ ఒక్కరిలో ఆరాటం పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు 'వకీల్ సాబ్' థియేటర్స్‌లో హంగామా చేద్దామా అంటూ కళ్ళు కాయలు చాచేలా ఎదురు చూశారు. ఇక సినిమా రిలీజ్‌కి ఒక రోజు ముందు యూఎస్‌లో ప్రీమియర్స్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే రెండు తెలుగు రాష్ట్రలలో కొన్ని చోట్ల స్పెషల్ షోస్ వేశారు. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతీ ఒక్కరిలో వకీల్ సాబ్ మొదటి రోజు మొదటి ఆట చూడాలని పోటీ పడ్డారు.

ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలు, హీరోయిన్స్ సహా పలువురు 'వకీల్ సాబ్' సినిమాని చూడటం.. పవర్ స్టార్‌తో పాటు దర్శక, నిర్మాతలను, నటీ నటులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన మెగా ఫ్యామిలీతో కలిసి 'వకీల్ సాబ్' సినిమాని జీఎంబీ సినిమాస్‌లో చూడటం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్‌ని ప్రశంసించడం జరిగింది. అయితే తాజాగా హీరోయిన్ నివేతా థామస్ కూడా 'వకీల్ సాబ్' సినిమాని చూసేందుకు థియేటర్‌కి వచ్చింది. ఇటీవల తనకి కరోనా పాజిటివ్ అంటూ ప్రస్తుతం నేను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

అంతేకాదు తనతో కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఆ తర్వాత 'వకీల్ సాబ్' రిలీజ్‌కు ముందు రోజు అందరూ మాస్కులు వేసుకొని థియేటర్‌కు రావాలని కోరుతూ మరో పోస్ట్ పెట్టింది. అయితే ఇన్నీ జాగ్రత్తలు చెప్పిన నివేతా థామస్ థియేటర్‌కి ఎలా వచ్చిందని కొంతమంది చర్చించుకుంటున్నారట. తనకి కరోనా నెగిటివ్ వచ్చిందా లేదా అన్నది ఎక్కడా వెల్లడించలేదు. దాంతో నివేతా ఇలా చెయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా నివేతా థామస్ 'వకీల్ సాబ్' సినిమాలో వేముల పల్లవి పాత్రలో కనిపించి మెగాస్టార్ సహా పలువు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.