ఆసరా కాదు... టోకరా!

ABN , First Publish Date - 2021-10-15T04:27:09+05:30 IST

ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్నది ‘ఆసరా’ కాదని, జగనన్న టోకరా పథకమని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. గురువారం ఆమదాలవలసలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘డ్వాక్రా మహిళల్లో చాలా మందికి ఆసరా పథకం వర్తింపజేయడం లేదని ఆరోపించారు.

ఆసరా కాదు... టోకరా!
మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- మహిళలకు సక్రమంగా అందని పథకం

- శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు రవికుమార్‌

ఆమదాలవలస, అక్టోబరు 14: ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్నది ‘ఆసరా’ కాదని, జగనన్న టోకరా పథకమని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. గురువారం ఆమదాలవలసలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘డ్వాక్రా మహిళల్లో చాలా మందికి ఆసరా పథకం వర్తింపజేయడం లేదు. జిల్లాలో 98.46 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉండగా.. ఆసరా పథకం కింద రూ.6,800 కోట్లు అందజేస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. కానీ, రూ.6,300 కోట్లు మంజూరు చేసి.. మొదటి ఏడాది 12లక్షల మంది మహిళలకు పథకం అందించలేదు. రెండో ఏడాది కూడా 76 లక్షల మంది మహిళలకు మాత్రమే పరిమితం చేశారు. టీడీపీ హయాంలో మహిళా సంఘాల సభ్యుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చుచేశాం. ఎన్నికల హామీలకు రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోంది. విద్యార్థులందరికీ అమ్మఒడి వర్తింపజేస్తామని చెప్పి.. కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. టీడీపీ హయాంలో  104 సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రస్తుత ప్రభుత్వం 34 పఽథకాలు మాత్రమే అమలు చేస్తోంది. రెండింటికి మధ్య సబ్సిడీ రూ.12 వేల కోట్ల వ్యత్యాసం ఉంది. రాష్ట్రం  ఏర్పడిన తర్వాత 2019 వరకు 2లక్షల 50 వేల కోట్లు అప్పుచేస్తే.. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఈ రెండున్నరేళ్లలో  2 లక్షల 45వేల కోట్లు అప్పు చేసింది. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ తమ్మినేని సీతారాం రాజ్యాంగం, రాష్ట్ర ఆదాయ వ్యయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో  నిర్మించిన పాఠశాల భవనాల ప్రహరీలకు రంగులు, ముగ్గులు వేసి సంక్షేమం, అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి మాటున ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇసుక దోపిడీ చేస్తున్నారు. పాఠశాలలకు ఎన్నికైన తల్లిదండ్రుల కమిటీల పనులు, ఆదాయ వ్యయాలపై ఆడిట్‌ చేయాలి’ అని రవికుమార్‌ కోరారు. సమావేశంలో బుడుమూరు గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T04:27:09+05:30 IST