రైతుబీమా అక్రమాలపై చర్యలేవీ

ABN , First Publish Date - 2021-10-18T03:39:55+05:30 IST

రైతుబీమా అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో 36 మంది పేరిట అర్హత లేకపోయినా కుటుంబ సభ్యులు అక్రమమార్గంలో రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము కాజేసిన ఉదంతంపై జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘రైతుబీమా పక్కదారి’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

రైతుబీమా అక్రమాలపై చర్యలేవీ

36 మందికి బీమా చెల్లింపులపై కలెక్టర్‌ ఆరా 

నామినీల వివరాలు సేకరిస్తున్న అధికారులు

ఏఈఓలే సూత్రధారులుగా ప్రాథమిక అంచనా

మంచిర్యాల, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): రైతుబీమా అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో 36 మంది పేరిట అర్హత లేకపోయినా కుటుంబ సభ్యులు అక్రమమార్గంలో రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము కాజేసిన ఉదంతంపై జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘రైతుబీమా పక్కదారి’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అక్రమంగా బీమా డబ్బులు చెల్లింపులపై కలెక్టర్‌ భారతిహోళికేరి వ్యవసాయ శాఖ జిల్లా అధికారులను విచారించి కిందిస్థాయి ఉద్యోగుల పాత్రపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. అక్రమంగా బీమా డబ్బులు పొందిన కుటుంబాల నామినీల వివరాలు సేకరించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.  

అధికారులే సూత్రధారులు

రైతుబీమాలో అక్రమాలకు ప్రధాన సూత్రధారులు అధికారులేనని భావించిన కలెక్టర్‌ వారిపై చర్యలకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. రైతు బీమాలో చేరేందుకు అర్హత ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకో వలసిన ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ అధికారులపై ఉంటుంది.  రైతు అర్హతలతోపాటు ఆధార్‌కార్డు పరిశీలించిన తరువాత దరఖాస్తు ఫారాన్ని అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి ప్రాథమికంగా ధ్రువీకరిస్తూ ఉన్న తాధికారులకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంపై మండల వ్యవ సాయశాఖ అధికారి పరిశీలన అనంతరం ఎనిమిది చోట్ల సంతకాలు చేయాలి. అనంతరం దరఖాస్తును జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి రైతుబీమా పథకానికి దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు ఫారం మూడు దశలు దాటితేగానీ సంబంధిత రైతుకు బీమా వర్తించదు. రైతుబీమాకు దరఖాస్తు చేయాలంటే ముందుగా అధికారులు పలు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. 

 రూ. 1. 8 కోట్లకు  టోకరా

దండేపల్లి మండలం కొర్వి చెల్మకు చెందిన గోపతి రాజయ్య, ముత్యం పేటకు చెందిన బత్తుల రాజలింగయ్య పేరిట కుటుంబ సభ్యులు బోగస్‌ ఆధార్‌కార్డులతో చెరో రూ.5 లక్షలు రైతుబీమా సొమ్ము కాజేయగా ’ఆంధ్రజ్యోతి’ వెలుగు లోకి తెచ్చింది. ఇదిలా ఉండగా ఆసరా పింఛన్లు తీసుకొని, రైతుబీమాలోనూ రూ.5 లక్షల చొప్పున లబ్ధిపొందిన మరో 34 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో ఏ పథకానికి ఎందరు అర్హులనే విషయం అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. రెండు పథకాలైన ఆసరా పింఛన్లు, రైతుబీమాలో లబ్ధిపొందిన వారి సంఖ్య మండలాల వారీగా ఇలా ఉంది. నెన్నెల-3, జైపూర్‌-4, లక్షెట్టిపేట-4, చెన్నూర్‌-6, మందమర్రి-3, దండేపల్లి-3, మంచిర్యాల-1, కాసిపేట-1, బెల్లంపల్లి-3, భీమిని-2, కన్నెపల్లి-2, వేమనపల్లి-2 చొప్పున అక్రమంగా లబ్ధి పొందారు. 36 మంది కారణంగా రూ.కోటి 80 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. దండేపల్లి మండలంలోని ఇద్దరు లబ్ధిదారుల నుంచి బీమా సొమ్ము రికవరీకి ఆదేశించిన మాదిరిగానే మిగతా మండలాల్లోనూ సొమ్ము రికవరీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసరా లబ్ధిదారులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నారా?

రైతుబీమాలో పొందుపరిచిన ఆధార్‌ నెంబర్‌, నామినీకి కూడా ఉపయోగించారా?

ధరణి, రైతుబీమాలోని ఆధార్‌ నెంబర్‌ ఒకటేనా?

రైతుబీమా దరఖాస్తు సమయంలో రైతు జీవించే ఉన్నాడా...? 

అనే అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన వ్యవసాయశాఖ అధికారులు అవేమీ పట్టించుకోకుండానే జిల్లా వ్యాప్తంగా 36 మంది పేరిట అక్రమంగా రైతుబీమా అమలు చేసినట్లు తెలుస్తోంది. 

కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు

- జిల్లా వ్యవసాయశాఖ అధికారి వినోద్‌కుమార్‌

జిల్లా వ్యాప్తంగా రైతుబీమా పఽథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై  దర్యాప్తు జరుపుతున్నాం. కలెక్టర్‌ సైతం సీరియస్‌గా ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి సంబంధిత రిపోర్టును కలెక్టర్‌కు నివేదిస్తాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  

Updated Date - 2021-10-18T03:39:55+05:30 IST