కొవిడ్‌పై కార్యాచరణే లేదు!

ABN , First Publish Date - 2021-05-11T07:50:09+05:30 IST

తెలంగాణలో మరొకసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత మార్చి 15 తరువాత ఎన్నికలు, జాతరల కారణంగా, ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి...

కొవిడ్‌పై కార్యాచరణే లేదు!

తెలంగాణలో మరొకసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత మార్చి 15 తరువాత ఎన్నికలు, జాతరల కారణంగా, ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి కొవిడ్‌తో వచ్చిన ప్రయాణికుల వలన క్రమంగా కరోనా సోకిన వారి సంఖ్య పెరిగింది. ఏప్రిల్ మొదట్లో నిర్వహించిన పరీక్షల్లో రోజుకు 1000 పాజిటివ్ కేసులు తేలితే ఆఖరు వారంలో ఆ సంఖ్య 8 నుంచి 9వేలకు చేరింది. 


కొవిడ్ ఇంతవరకు మనుషులకు తెలిసిన ఇతర వ్యాధుల వంటిది కాదు. సహస్రాబ్దాల మానవ చరిత్రలో అంటువ్యాధులు చాలా ప్రజ్వరిల్లాయి. అందులో స్పానిష్ ఫ్లూ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. 1919లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అప్పటికి వైద్యం బాగా అభివృద్ధి చెంద లేదు. వంద సంవత్సరాల తరువాత ఇప్పుడు వైద్య రంగంలో అధునాతన పరిజ్ఞానం ఇతోధికంగా పెంపొందింది. ప్రస్తుత పరిస్థితిలో కొవిడ్ వంటి అంటువ్యాధులను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యం కాదా అన్నది ప్రశ్న. ఉన్న వనరులను సరిగ్గా సమాయత్తం చేసుకుని, ప్రజాస్వామిక దృక్పథంతో ఉపయోగించుకోగలిగితే ఈ మహమ్మారిని రూపుమాపగలం. అయితే అది ఏ మేరకు సాధ్యమవుతుంది? ఒక వేళ సమష్టి కృషి ముందుకు సాగకపోతే అందుకు అవరోధాలేమిటి అన్నది తేలాలి. 


లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత కరోనా మరోసారి విజృంభిస్తుందని భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ముందే హెచ్చరించింది. పూర్తిగా రాజకీయ ప్రయోజనాల పైన దృష్టి పెట్టిన పాలకులు ఆ సూచనలను బేఖాతరు చేశారు. జాగ్రత్త పడి ఉంటే ప్రస్తుత సంక్షోభం తలెత్తేది కాదు. పర్యవసానంగా, పరిమితంగా ఉన్న వైద్య సౌకర్యాల మీద విపరీతమైన భారం పడింది. కరోనాను ఎదుర్కొనడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ త్రిముఖ వ్యూహాన్ని సూచించింది. అందులో భాగంగా మొట్టమొదట కరోనా వ్యాప్తిని నివారించాలి. ఇందుకు తగిన కార్యాచరణను ప్రకటించాలి. కరోనా సోకిన వారిని పరీక్షలు చేసి గుర్తించి వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. కొవిడ్ వ్యాధి ఉన్న వారికి సరైన వైద్యం అందించాలి. ప్రత్యేకించి బలహీన వర్గాలకు కావలసిన వైద్యం అందించాలి. ఇవికాక కరోనా కారణంగా తలెత్తే సామాజిక ఆర్థిక సమస్యల నుంచి ప్రజలను ఆదుకోవాలి. 


కరోనాను నిర్మూలించగల పాలనాదక్షతను ప్రదర్శించ వలసిన సమయంలో పాలకులు కరోనాపై విజయాన్ని సాధించామన్న ధీమాతో కరోనా నివారణ చర్యల అమలు విషయంలో అలసత్వం ప్రదర్శించారు. ఇటు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించడం మరచి పోయారు. ఇప్పటికైనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించకపోతే కరోనా మరింతగా ప్రబలి ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తుందని గుర్తించాలి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ కూడా ఇటీవల తన నివేదికలో వివరించింది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. కరోనా వంటి మహమ్మారుల నియంత్రణకు భారతదేశంలో రెండు చట్టాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి బ్రిటిష్ పాలకులు తెచ్చిన ‘అంటువ్యాధుల నివారణ చట్టం’. ఈ చట్టం ప్రకారం అంటువ్యాధుల నివారణకు ప్రభుత్వం కావలసిన చర్యలు తీసుకోవలసిందిగా ఎవరినైనా ఆదేశించవచ్చు. ప్రభుత్వానికి ఈ శాసనం నిరంకుశ అధికారాలను ఇస్తున్నది. మన రాజ్యాంగం ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలను ఆమోదించదు. 2005 సంవత్సరం వరకు, మన సమున్నత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడానికి ఎటువంటి చట్టం లేదు. ఆ ఏడాది పార్లమెంటు ‘ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టాన్ని’ ఆమోదించింది. 


ఈ చట్టంలోని సెక్షన్ 2(d) ప్రకారం ప్రకృతి వైపరీత్యాల వల్ల గానీ, మానవ చర్యలు, నిర్లక్ష్యం మూలంగా గానీ కోలుకోలేని రీతిలో ప్రాణనష్టం, ఆస్తి వినాశనం, పర్యావరణ విధ్వంసం వంటి దుర్ఘటనలు సంభవించడాన్ని విపత్తు అంటారు. కోర్టులు ఈ నిర్వచనం ప్రకారం కొవిడ్-19ని విపత్తు గానే చూస్తున్నాయి. చట్టం ప్రకారం విపత్తు నుంచి ప్రజలను రక్షించడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి నేతృత్వంలో ‘జాతీయ విపత్తు అథారిటీ’ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో విపత్తుల నివారణకు ప్రణాళిక తయారుచేసి అమలు చేయాలి. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా విపత్తు అథారిటీ ఏర్పాటు చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పించింది. ఈ కమిటీ రాష్ట్రస్థాయిలో విపత్తును అధిగమిం చడానికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేస్తుంది. వాస్తవమేమిటంటే కరోనా కట్టడి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే చర్చ విపత్తు అథారిటీలో జరుగనే లేదు. కరోనా నియంత్రణకు ఉన్నత న్యాయస్థానాలు తరచుగా ఇస్తున్న ఆదేశాలు మాత్రమే అమలవుతున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కొవిడ్ నిర్మూలనకు ఎలాంటి కార్యాచరణ జరగనే లేదు. 


కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే కొవిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ సకాలంలో పరీక్షలు జరపాలి. పరీక్షలు నిర్వహించకుండా వదిలేస్తే కరోనా ఇంకా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందువల్ల రాష్ట్ర హైకోర్టు కరోనా పరీక్షల సంఖ్యను కూడా ఎంత వీలయితే అంత పెంచమని ఆదేశించింది. ఈ విషయంలో ఆర్థిక వనరుల లేమిని సాకుగా చూపి తప్పుకోవడానికి వీలులేదు. అయితే గత పక్షం రోజులుగా పరీక్షలు సగానికి తగ్గిపోయాయి. కిట్స్ లేవన్న కారణంగా చాలా కేంద్రాలలో పరీక్షకు వచ్చిన వారిని వెనుకకు పంపిస్తున్నారు. వాస్తవాలను దాచకుండా పరీక్షా ఫలితాలను వెల్లడించాలి. అప్పుడే కొవిడ్ నిర్మూలనకు వాస్తవిక ప్రణాళికను ప్రభుత్వం రూపొందిం చగలుగుతుంది. సమాజం తన కర్తవ్యాలను గుర్తించి వాటిని ఆచరించగలుగుతుంది. 


పరీక్షలలో పాజిటివ్ అని తేలితే ఆసుపత్రిలో చేరడం ఇప్పుడు కష్టంగా మారింది. కొందరికి పరీక్షల కోసం తిరిగి రిపోర్టు వచ్చేసరికి రోగం ముదిరిపోయి ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఏర్పడుతోంది. మన రాష్ట్రంలో అవసరమైన మేరకు వైద్యసదుపాయాలు కూడా లేవు. అవి కూడా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. లోతట్టు ఆదివాసి గూడేలు, తండాల, మారుమూల గ్రామాల ప్రజలు ఈ సౌకర్యాలను పొందడం కష్టమే. ఉదాహరణకు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాకు గాను, ఒక్క ఆసిఫాబాదు మున్సిపాలిటీ పరిధిలో తప్ప బయట ఎక్కడా కొవిడ్ చికిత్సకు వసతి లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్‌లలో మాత్రమే చికిత్సా సౌకర్యాలున్నాయి. జగిత్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలో మాత్రమే వైద్యం లభిస్తుంది. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అందువల్ల రోగులు విధిలేక ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి లక్షల రూపాయలు ఫీజులు చెల్లించుకుం టున్నారు. ముఖ్యంగా గ్రామాలలో, పేద వర్గాలలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. అందువల్ల అంటువ్యాధుల తాకిడి ఈ వర్గాల మీద చాలా తీవ్రంగా ఉంటోంది. వారికి సకాలంలో వైద్యం అందించలేకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని పరిష్కరించగల పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థ మన రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం వైద్యంపై తక్కువగా ఖర్చు చేస్తున్నది. 2015–-20 మధ్య కాలంలో రాష్ట్రాలు సగటున తమ బడ్జెట్‌లో 5.3 శాతం వైద్యం కోసం ఖర్చు చేస్తే మన రాష్ట్రం బడ్జెట్‌లో 4.4 శాతం మాత్రమే వైద్యానికి కేటాయించింది. కొవిడ్–-19 ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు. దానికి తోడు వైద్య సౌకర్యాలు చాలడం లేదు. సత్వరమే వైద్యం అందించలేకపోతే ప్రాణాలు పోతాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు రంగానిది పైచేయి అయింది. 


ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని ఈ పరిస్థితుల నేపథ్యంలో చూడాలి. బాగా బలహీనమైన ప్రజారోగ్య వ్యవస్థ ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల తరఫున జోక్యం చేసుకునే వెసులుబాటు ఉండదు. మరొక వైపు ప్రజలు ప్రధానంగా ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. కొవిడ్ సంక్షోభాన్ని ముందే అంచనా వేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సమస్య రాకపోవును. ఎకాఎకిన ముంచుకొని రావడంతో పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు కొరవడ్డాయి. పాజిటివ్ అని తేలిన తరువాత ఏదైనా ఆసుపత్రికి వెళదామన్నా సౌకర్యాలు చాలడం లేదు. ఇది ప్రైవేటు ఆసుపత్రులకు అందివచ్చిన వరంగా మారింది. అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నారు. అయినా కొందరి ప్రాణాలు పోతూనే ఉన్నాయి. మరొక వైపు బతికిన వాళ్ళు కుడా ఆర్థికంగా కుంగి పోతున్నారు. 


ప్రభుత్వం ‘విపత్తుల నిర్వహణ చట్టం’ ప్రకారం కానీ, ‘అంటు వ్యాధుల నివారణ’ చట్టం ప్రకారం కానీ  చర్యలు తీసుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రులను అజమాయిషీ లోకి తీసుకుని వైద్యవ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించవచ్చు. చాలా రాష్ట్రాలు ఈ పనే చేస్తున్నాయి. కానీ మన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. దీనికి కారణం లేకపోలేదు. అధికారంలో ఉన్న చాలామంది నాయకులకు ప్రైవేటు వైద్యవ్యవస్థతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ నియంత్రణ సాధ్యం కాదు. అందుకే వరుసగా సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వైద్యసంస్థలు లాభాలు ఆర్జించుకుంటున్నాయి. ప్రజలు అన్ని విధాల నష్టపోతున్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా కొవిడ్ అందరినీ ఒకే రకంగా ఇబ్బంది పెడుతున్నదని అనుకున్నాం. పేద ప్రజలే భారీమూల్యం చెల్లిస్తున్నారు. ఒకవైపు ఆప్తులు, ఆత్మీయులు పోయి, మరొకవైపు బతుకుదెరువు దెబ్బతిని, వైద్యం దొరకక, అప్పుల పాలై పేదల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠపరచడమే. ఈ లోగా కరోనా పరీక్షలను పెంచి చికిత్స అవసరమైన అందరికీ ప్రభుత్వమే ఉచితవైద్యం అందించాలి. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రణలోకి తీసుకుని తీరాలి. 


ఎం. కోదండరాం

(తెలంగాణ జన సమితి అధ్యక్షుడు)

Updated Date - 2021-05-11T07:50:09+05:30 IST