టీఆర్ఎస్‌తో పొత్తు లేదు: ఒవైసీ

ABN , First Publish Date - 2020-11-22T20:40:14+05:30 IST

ప్రజల మద్దతు ఎంఐఎం పార్టీకి ఉందని, గతంలో 44 జీహెచ్ఎంసీ స్థానాలకు గెలుచుకున్న తమ పార్టీ ఈసారి ..

టీఆర్ఎస్‌తో పొత్తు లేదు: ఒవైసీ

హైదరాబాద్: ప్రజల మద్దతు ఎంఐఎం పార్టీకి ఉందని, గతంలో 44 జీహెచ్ఎంసీ స్థానాలకు గెలుచుకున్న తమ పార్టీ ఈసారి 52 స్థానాలను కైవసం చేసుకుంటుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని తెలిపారు. ఆయా డివిజన్లలో ఎంఐఎం పార్టీ చేసిన అభివృద్ధి పనులే తమ అభ్యర్థులను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో ఒవైసీ ఆదివారంనాడు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ హిందుత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని, బీజేపీ చేస్తున్న రాజకీయం సరైంది కాదని అన్నారు.


కేంద్రం వరద సాయం ఏదీ..?

వరదబాధిత హైదరాబాద్‌కు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని ఒవైసీ ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మతం రంగు పులుముతోందన్నారు. 'రాష్ట్రం కోసం ఎంఐఎం అహరహం పనిచేస్తోంది. బీజేపీ నేతలను రాత్రి నిద్రలో లేపి నాలుగు పేర్లు చెప్పమంటే... ఒవైసీ, ఆ తర్వాత దేశద్రోహి, ఉగ్రవాదం, చివరగా పాకిస్థాన్..అంటారు. తెలంగాణకు చేసిన ఆర్థిక సాయం ఏమిటో బీజేపీ చెప్పాలి. ముఖ్యంగా 2019 తర్వాత హైదరాబాద్‌కు చేసిందేమిటి?' అని ఒవైసీ నిలదీశారు.


వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్‌కు మోదీ ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం ఏమిటో చెప్పాలని ఒవైసీ ప్రశ్నించారు. కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపించడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మతం రంగు పులుముతున్నారని, బీజేపీ ఇక్కడ  చేసిందేమీ లేదన్న విషయం ప్రజలకు బాగా తెలుసునని ఒవైసీ అన్నారు.


లవ్ జీహాద్‌పై...

'లవ్ జీహాద్'కు వ్యతిరేకంగా చట్టం తెచ్చే అంశంపై అడిగినప్పుడు, ఇది రాజ్యాంగంలోని 14, 21 అధికరణలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఒవైసీ సమాధానమిచ్చారు. ముందు వాళ్లు రాజ్యాంగం చదవాలని సూచించారు. ఇలాంటి విద్వేష పూరిత ప్రచారం ఎప్పటికీ పనిచేయదన్నారు. నిరుద్యోగంతో కూరుకుపోయిన యువతను తప్పుదారి పట్టిచేందుకు బీజేపీ ఈ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.


టీఎంసీతో కలిసి బెంగాల్‌లో పోటీపై...

పశ్చిమబెంగాల్‌లో 2021లో జరుగనున్న ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారా అని అడిగినప్పుడు, ఎన్నికల్లో పోటీపై అక్కడి ఎంఐఎం పార్టీ విభాగంతో తాను మాట్లాడతానని, ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తామని చెప్పారు. సమావేశానంతరమే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని ఒవైసీ తెలిపారు.

Updated Date - 2020-11-22T20:40:14+05:30 IST