వృద్ధికి అడ్డులేదిక!

ABN , First Publish Date - 2021-03-26T05:57:20+05:30 IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ, మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాల్లేనందున ప్రస్తుత పునరుజ్జీవం నిరాటంకంగా కొనసాగనుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.

వృద్ధికి అడ్డులేదిక!

మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించే అవకాశాల్లేవ్‌: దాస్‌  

ముంబై: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ, మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాల్లేనందున ప్రస్తుత పునరుజ్జీవం నిరాటంకంగా కొనసాగనుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. కాబట్టి, వృద్ధి అంచనాలను తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 10.5 శాతానికి ఎగబాకవచ్చని ఆర్‌బీఐ అంచనా. దేశంలో కరోనా రెండో విడత వ్యాప్తి భయాలు పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టైమ్స్‌ నెట్‌వర్క్స్‌ నిర్వహిస్తున్న ‘ఇండియా ఎకనామిక్‌ కాంక్లేవ్‌’లో శక్తికాంత దాస్‌  ప్రస్తావించిన మరిన్ని విషయాలు.. 

ఆర్‌బీఐ, బాండ్‌ మార్కెట్‌ మధ్య పేచీ ఏం లేదు. కానీ, బాండ్ల వడ్డీ రేట్లు ఒక్కసారిగా పెరగడం కాకుండా, కాలక్రమ పరిణామాన్ని మాత్రమే ఆర్‌బీఐ కోరుకుంటోంది.  

ఫారెక్స్‌ మార్కెట్లో తీవ్ర ఊగిసలాటలు మంచిదికాదు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు భవిష్యత్‌లో ఉద్దీపన చర్యలను ఉపసంహరించుకున్నప్పుడు ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తట్టుకునేందుకే విదేశీ మారక నిల్వలను పెంచుకుంటున్నాం. ప్రస్తు తం ఆర్‌బీఐ వద్ద 18 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలున్నాయి. ఈ నిల్వల సమీకరణకు నిర్దిష్ట స్థాయిని నిర్దేశించుకోలేదు. రూపాయి స్థిరత్వమే అంతిమ లక్ష్యం. 

ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు సంబంధిం చి ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ మధ్య బడ్జెట్‌కు ముందు నుంచే చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. 

విదేశాలకూ ఆర్‌టీజీఎస్‌ సేవల విస్తరణ!? :  పెద్ద మొత్తంలో సొమ్మును బదిలీ చేసేందుకు ఉపయోగించే ఆర్‌టీజీఎస్‌ వ్యవస్థ మల్టీ కరెన్సీ సామర్థ్యం కలి గి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ అన్నారు. ఆర్‌టీజీఎస్‌ సేవలను విదేశాలకూ విస్తరించేందుకు అవకాశాలున్నాయన్నారు. 

కలవర ‘క్రిప్టో’ : ఆర్‌బీఐ త్వరలో ప్రవేశపెట్టనున్న డిజిటల్‌ కరెన్సీకి, మార్కెట్లో ట్రేడయ్యే బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు సంబంధం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల విషయంలో ప్రభుత్వంతో తమకెలాంటి అభిప్రాయబేధాల్లేవని, వాటిపై తమకున్న ఆందోళనల్ని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయితే, వాటిని నిషేధించాలా..? వద్దా..? అనే నిర్ణయం మాత్రం సర్కారుదేనన్నారు. ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ, ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యమని దాస్‌ పేర్కొన్నారు. 

ఇన్వెస్టర్లకు సింగిల్‌ విండో వ్యవస్థ 

పెట్టుబడిదారుల కోసం సింగిల్‌ విండో క్లియరెన్స్‌ వ్యవస్థను ఏప్రిల్‌ 15 నాటికి ఏర్పాటు చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర తెలిపారు. ఈ సింగిల్‌ విండో సిస్టమ్‌ ద్వారా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని అనుమతుల వ్యవస్థలను అనుసంధానించనున్నారు. 

సెప్టెంబరు చివరినాటికి బీపీసీఎల్‌ విక్రయం : బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ పురోగతిలో ఉందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. సెప్టెంబరు చివరినాటికి కంపెనీలో ప్రభుత్వానికున్న 52.98 శాతం వాటా విక్రయం పూర్తికావచ్చన్నారు. 

4-5 నెలల్లో నాబ్‌ఫిడ్‌ ప్రారంభం : మౌలిక ప్రాజెక్టుల ఫండింగ్‌ కోసం ఏర్పాటు చేస్తున్న నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (నాబ్‌ఫిడ్‌) కార్యకలాపాలు వచ్చే 4-5 నెలల్లో ప్రారంభం కావచ్చని ఆర్థిక సేవల కార్యదర్శి దెబాషిష్‌ పాండా తెలిపారు.  

Updated Date - 2021-03-26T05:57:20+05:30 IST