బిల్లు ఇవ్వరు.. అప్పు తీరదు..!

ABN , First Publish Date - 2021-06-23T05:46:52+05:30 IST

జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశు పోషణ. పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పాడి పశువుల పోషణపై ఆధారపడిన రైతులు అధికంగా ఉన్నారు.

బిల్లు ఇవ్వరు.. అప్పు తీరదు..!
చాపాడు మండలం చెంచువారిపల్లెలో రైతు నిర్మించుకున్న షెడ్డు

గత ప్రభుత్వంలో గోకులం పథకం అమలు

పాడి రైతులకు చేయుతగా 90 శాతం సబ్సిడీ

అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్న రైతులు

జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆపేసిన బిల్లులు

జిల్లాలో రూ.22.60 కోట్లకుపైగా బకాయి

సీఎం మనసు కరగదా..? రెండేళ్లుగా ఎదురు చూపులు


పాడి రైతుల అభ్యున్నతి కోసమే అముల్‌ సంస్థను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అదే పాడి రైతుల చేయూత కోసం గత ప్రభుత్వం నిర్మించిన గోకులం షెడ్ల బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు. రెండేళ్లు గడిచింది. పైసా విడుదల చేయలేదు. సీఎం జగన్‌ మనసు మారదా..! బిల్లులు మంజూరు చేయరా..! అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు. షెడ్డు నిర్మాణం కోసం చేసిన అప్పు వడ్డీలు పెరుగుతున్నాయి. జిల్లాలో రూ.22.60 కోట్లు చెల్లించాలి. స్పందనలో మొరపెట్టుకున్నా స్పందన కరువు. ఆ వివరాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశు పోషణ. పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పాడి పశువుల పోషణపై ఆధారపడిన రైతులు అధికంగా ఉన్నారు. పాడి పశువుల వసతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వం ‘మినీ గోకులం పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి గోకులం షెడ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించింది. రెండు పశువులు ఉంటే రూ.లక్ష, నాలుగు పాడి పశువులకు రూ.1.50 లక్షలు, ఆరు పశువులకు రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. 90 శాతం సబ్సిడీ ప్రభుత్వం భరిస్తే.. 10 శాతం రైతు వాటా ముందుగా డీడీ రూపంలో పశు సంవర్థక శాఖకు చెల్లించారు. జిల్లాలో రెండు పశువుల 195 షెడ్లకు రూ.1.95 కోట్లు, నాలుగు పశువుల కోసం 841 షెడ్లకు రూ.12.92 కోట్లు, ఆరు పశువులు కలిగిన రైతులకు 2,114 షెడ్లకు రూ.39.02 కోట్లు కలిపి మూడు కేటగిరీల్లో 3150 గోకులం షెడ్ల నిర్మాణాలకు రూ.53.89 కోట్లు గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. 


అప్పుల్లో పాడి రైతులు

పల్లెసీమల్లో ఇంటి ఆవరణలోనే పశువుల పాకలు ఉంటున్నాయి. స్థలం ఉన్నా.. షెడ్డు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేక చెట్ల కింద, ఆరుబయటనే పాడి పశువులను కట్టేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పాడి రైతులకు చేయూతగా శాశ్వత రేకుల షెడ్డు నిర్మాణం కోసం మినీ గోకులం పథకం అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూనిట్‌ విలువలో కేవలం 10 శాతం రైతుల వాటా డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం 90 శాతం రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. దీంతో జిల్లాలో పలువురు రైతులు ముందుకు వచ్చారు. 3150 షెడ్లకు రూ.53.89 కోట్లు మంజూరు చేసింది. షెడ్డు నిర్మించుకున్నాకే 90 శాతం సబ్సిడీ అమౌంట్‌ వస్తుంది. దీంతో రైతులు అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టారు. పనులు పూర్తయిన షెడ్లకు రూ.20.27 కోట్లు ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీవో) బిల్లులు గతంలోనే ప్రభుత్వానికి పంపారు. మరో రూ.15 కోట్లకు పైగా విలువైన పనులకు ఎం-బుక్స్‌ రికార్డు చేయలేదని సమాచారం. కొందరు నిర్మాణ దశలోనే ఆపేశారు. షెడ్లు నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు అందక అప్పుల్లో కూరుకుపోతున్నామని పలువురు రైతులు స్పందనలో ఫిర్యాదులు చేశారు. డ్వామా, పశు సంవర్థక అధికారులు రికార్డులు పరిశీలించి రూ.22.60 కోట్లు చెల్లించాల్సి ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టరు హరికిరణ్‌కు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయినా.. నిధులు మాత్రం మంజూరు కాలేదు.. రైతుల అప్పులు తీరలేదు. అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 


అప్పు చేసి షెడ్డు నిర్మాంచాను 

- ఆళ్లగడ్డ దానం, చెంచుపల్లి గ్రామం, చాపాడు మండలం

నాకు ఆరు పాడి గేదెలు ఉన్నాయి. ప్రధాన జీవనాధారం పాడి పశువుల పోషణ. ఆరు పశువులకు గోకులం షెడ్డు నిర్మించుకుంటే రూ.1.80 లక్షలు వస్తుందని అన్నారు. నూటికి రూ.2 ప్రకారం రూ.2 లక్షలు వడ్డీకి అప్పు చేసి షెడ్డు నిర్మించుకున్నాను. గత ప్రభుత్వంలోనే రూ.22 వేలు మాత్రమే బిల్లు ఇచ్చారు. రెండున్నరేళ్లు దాటినా మిగిలిన డబ్బులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అప్పులు పెరగడంతో జీవనాధారమైన మూడు పాడి గేదెలను అమ్మినా అప్పు తీరలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గోకులం షెడ్డు నిర్మాణం బిల్లులు మంజూరు చేస్తే అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతాను. 


రూ.36 వేలు వడ్డీ అయ్యింది 

- సందా నరే్‌షకుమార్‌రెడ్డి, పాడి రైతు, తుడుమలదిన్నె గ్రామం, ఖాజీపేట మండలం

మాకు నాలుగు పాడి పశువులు ఉన్నాయి. వ్యవసాయం చేస్తూ పాడి ప్రత్యామ్నాయ జీవనాధారం. మినీ గోకులం పథకం కింత ప్రభుత్వం షెడ్డు నిర్మాణానికి 90 శాతం సబ్బిడీతో ఆర్థికసాయం చేస్తామంటే 10 శాతం రైతు వాటా రూ.15 వేలు డీడీ చెల్లించాను. మరో రూ.లక్ష అప్పు చేసి షెడ్డు నిర్మించుకున్నాను. పునాదులకు కేవలం రూ.8 వేలు మాత్రమే బిల్లులు ఇచ్చారు. షెడ్డు పూర్తి చేసినా ఒక్క పైసా ఇవ్వలేదు. చేసిన అప్పుకు వడ్డీ రూ.36 వేలు అయ్యింది. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. ఆ అప్పు కట్టడానికి జీవనాధారమైన పాడి పశువులు అమ్మాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. 


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం 

- సత్యప్రకాష్‌, జేడీ, పశు సంవర్థక శాఖ, కడప

జిల్లాలో 3150 గోకులం షెడ్లు మంజూరు చేశాం. ఇంకా రూ.22.60 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. స్పందనలో పలువురు రైతులు బిల్లుల కోసం ఫిర్యాదులు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు నివేదిక పంపించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే రైతుల ఖాతాల్లో బిల్లుల అమౌంట్‌ జమ చేస్తాం.


 



Updated Date - 2021-06-23T05:46:52+05:30 IST