మందకొడిగా మాంసం వ్యాపారం

ABN , First Publish Date - 2020-12-01T04:59:04+05:30 IST

కార్తీక మాసం కావడంతో మాంసాహార విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఆదివారం సైతం చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు చేపల బజార్లు కూడా కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మందకొడిగా మాంసం వ్యాపారం
చేపల మార్కెట్‌లో చేపలు

మటన్‌, చికెన్‌, చేపల వ్యాపారులు డీలా

కార్తీక మాసం కావడంతో తగ్గిన అమ్మకాలు


గోపాలపట్నం, నవంబరు 30: కార్తీక మాసం కావడంతో మాంసాహార విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఆదివారం సైతం చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు చేపల బజార్లు కూడా కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మటన్‌, చికెన్‌, చేపల విక్రయాలు ఏడాదిలో సుమారు తొమ్మిది నెలల పాటు జోరుగా జరుగుతాయి. సంక్రాంతి నుంచి దసరా పండుగల మధ్య సుమారు తొమ్మిది నెలల పాటు మాంసాహార విక్రయాలు చాలా జోరందుకుంటాయి. దసరా ఉత్సవం ముగియగానే దాదాపుగా వ్యాపారం మందకొడిగా సాగుతుంది. ఎందుకంటే కార్తీకమాసం ప్రారంభం కావడం, అది ముగియగానే మార్గశిర మాసం, పుష్యమాసాలు రావడంతో ఆ నెలల్లో చాలా మంది భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. చాలా మంది మాలధారణ చేస్తారు. ఆ నెలల్లో మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ఈ ప్రభావం మాంసం వర్తకులపై పడుతుంది. 


వెలవెలబోతున్న చేపల మార్కెట్‌ 

మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉన్న విశాఖ నగరం చేపలకు కూడా పెద్ద మార్కెట్‌గా చెప్పవచ్చు. నగరంలోనే ఫిషింగ్‌ హార్బన్‌ నుంచి లభించే టన్నుల కొద్దీ చేపలు నగరంలోని చేపల బజారుల్లో విక్రయిస్తారు. నగరంలో చెరువు చేపలకు కూడా మంచి డిమాండ్‌ ఉండడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రధాన డ్యామ్‌లు, చెరువుల నుంచి పెద్ద మొత్తంలో చెరువు చేపలు నిత్యం నగరంలోని మార్కెట్‌కు దిగుమతవుతుంటాయి. దీంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల చెరువుల్లో పెంచే చేపలు కూడా నగరంలోని మార్కెట్‌లోకే నిత్యం దిగుమతవుతాయి. అయితే ప్రస్తుతం మాంసాహారానికి అన్‌సీజన్‌ కావడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి చేపల దిగుమతి కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో నగరంలోని మాంసం మార్కెట్‌లతో పాటు చేపల బజార్లు కూడా కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. సంక్రాంతి పండుగ వరకూ ఇదే స్థితిలో వ్యాపారం ఉంటుందని వర్తకులు చెబుతున్నారు.


Updated Date - 2020-12-01T04:59:04+05:30 IST