కాలం మారినా..కాడెడ్ల సాగు!

ABN , First Publish Date - 2021-08-08T05:01:30+05:30 IST

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వచ్చాయి. యాంత్రీకరణ పెరిగింది. ట్రాక్టర్లతో సేద్యం విస్తృతమైంది.

కాలం మారినా..కాడెడ్ల సాగు!
ఎడ్ల అరకతో విత్తనాలను వెదబెడుతున్న ఎస్సీ రైతులు

యాంత్రీకరణలోనూ ఎడ్లతోనే సేద్యం 

వల్లాపల్లి ఎస్సీకాలనీలో 50 జతలు

వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న పలు కుటుంబాలు

డీజిల్‌ ధరల ప్రభావంతో పెరిగిన ట్రాక్టర్ల బాడుగ

అరకలతో దున్నకంపై రైతుల ఆసక్తి

ఖర్చు తగ్గడంతోపాటు, సాలు బాగుండటమే కారణం

బల్లికురవ, ఆగస్టు 7 : వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వచ్చాయి. యాంత్రీకరణ పెరిగింది. ట్రాక్టర్లతో సేద్యం విస్తృతమైంది. దీంతో కాడెడ్ల వ్యవసాయం దాదాపు కనుమరుగైంది. పొలాల్లోని నాగేటి సాళ్లలో గణగణమని మోగే గంటలు మూగబోయాయి. కానీ బల్లికురవ మండలం వల్లాపల్లిలో మాత్రం ఇప్పటికీ ఎడ్లతోనే సేద్యం చేస్తున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలు కుటుంబాల వారు ఎడ్లపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటితో వ్యవసాయ సీజన్‌లో తమ పొలాల్లో పనులు చేసుకోవడంతోపాటు, ఇతర రైతులకు కూడా బాడుగపై అరక తోలుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఎడ్ల బండ్లతో గనిసిగడ్ల వ్యాపారం చేస్తున్నారు. ఇలా ఏటా జత ఎడ్లపై రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. ఇటీవల డీజిల్‌ ధరలు పెరగడం, ట్రాక్టర్‌ బాడుగలు కూడా అధికంగా ఉండటంతో రైతులు కూడా సంప్రదాయమైన అరక సేద్యంపై ఆసక్తి చూపుతున్నారని ఎడ్ల యజమానులు చెప్తున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఎడ్లతోనే వ్యవ సాయం చేశారని, దాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. 


కాలనీలో 50 ఎడ్ల జతలు 

బల్లికురవ మండలం వల్లాపల్లి ఎస్సీకాలనీ అంటే గుర్తుకు వచ్చేది ఎద్దుల జతలే. అక్కడ దాదాపు సగం మంది వరకూ ఎడ్లతోనే వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ గ్రామంలో 50 వరకు ఎడ్ల జతలు ఉన్నాయి. ఎస్సీ రైతులు తమకు ఉన్న పొలంలో సేద్యపు పనులు చేసుకొంటూ మిగిలిన సమయంలో పరిసర గ్రామాల్లోని రైతుల పొలాల్లో పనులు చేస్తుంటారు. 

 

పెరిగిన ట్రాక్టర్‌ బాడుగ

డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్ల యజమానులు బాడుగలు కూడా పెంచేశారు. గతంలో ఎకరాకు ఒక సాలు గొర్రు తోలితే రూ.600 తీసుకోగా, ఇప్పుడు రూ.700 వసూలు చేస్తున్నారు. ఎకరాకు రెండు, మూడు సాళ్లు తోలాల్సి ఉంది. అదే ఎడ్ల సేద్యానికి మాత్రం గొర్రు కానీ, గుంటక కానీ తోలేందుకు ఎకరాకు రూ.500 తీసుకుంటున్నారు. ఎడ్లతో దున్నిన సాలు కూడా బాగుంటుంది. దీంతో రైతులు ఇటీవల అరకతో సేద్యపు పనులు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.


గ్రాసానికి సమస్య లేదు

తాము ఎన్నో ఏళ్ల నుంచి ఎడ్లను నమ్ముకొన్నామని అవే ఇప్పుడు కూడు పెడుతున్నాయని ఎస్సీ రైతులు అంటున్నారు. రోజూ మిర్చి, పత్తి, పంటలలో పనులు ఉంటుంటాయని పొరుగు గ్రామాల నుంచి కూడా రైతులు తమ వద్దకు వస్తుంటారని వారు తెలిపారు. తమ ఎడ్లకు పశుగ్రాసం కొరత లేదని గ్రామంలో వరి పంట బాగా పండుతుందని అందుకే తాము ఎడ్లను వదులుకొనేందుకు ఇష్టంగా లేమని వారు అంటున్నారు. పది దశాబ్దాల నుంచి మా గ్రామంలో ఎడ్ల వ్యవసాయం జరుగుతుందని వారు తెలిపారు.


వ్యవసాయ పనులు లేని సమయంలో గనిసిగడ్ల వ్యాపారం

వల్లాపల్లి ఎస్సీ రైతులు తమ గ్రామంలో వ్యవసాయ పనులు ముగియగాను ఊరికే ఉండకుండా ఎడ్ల బండ్లను తీసుకొని పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలో గనిసిగడ్ల వ్యాపారం చేస్తుంటారు. మూడు మాసాలపాటు వారు కుటుంబంతోపాటు వలస వెళుతుంటారు. ఏడాదిలో మూ డు నెలలు మాత్రమే వారు ఖాళీగా ఉంటారు. మిగిలిన సమయాల్లో ఎడ్లతోనే వారు పూర్తి జీవనం చేస్తున్నారు. సక్రమంగా పనులు చేస్తే ఏడాదికి ఒక్క ఎడ్ల జతతో సు మారు రూ.లక్ష వరకు సంపాదిస్తామని వారు తెలిపారు.















Updated Date - 2021-08-08T05:01:30+05:30 IST