మోదీపై ప్రజల విశ్వాసంలో మార్పేమీ లేదు!

ABN , First Publish Date - 2021-05-06T06:02:55+05:30 IST

ఈరోజు ఏ పత్రికలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా భారతీయ జనతాపార్టీకి ప్రజల నుంచి ఆదరణ కరువైందని, ప్రధాని మోదీ సత్తా తరిగిపోయిందనీ...

మోదీపై ప్రజల విశ్వాసంలో మార్పేమీ లేదు!

ఈరోజు ఏ పత్రికలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా భారతీయ జనతాపార్టీకి ప్రజల నుంచి ఆదరణ కరువైందని, ప్రధాని మోదీ సత్తా తరిగిపోయిందనీ, ఇందుకు ఇటీవల ఐదు చోట్ల జరిగిన ఎన్నికలే నిదర్శనమనీ ప్రచారం జరుగుతున్నది. నిజంగానే ఈ ఎన్నికలు బీజేపీ, మోదీ ప్రతిష్ట తగ్గిందనటానికి తార్కాణమా అన్నది పరిశీలిద్దాం. 


ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‍లో జరిగిన ఎన్నికలమీదకే అందరి దృష్టీ మళ్ళింది. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, అఖిల భారత జాతీయ కాంగ్రెస్, ఇంకా వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను సాధించి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన వామపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వారి డెబ్బై మూడు స్థానాలను కోల్పోయి అట్టడుగు స్థానానికి పడిపోయాయి. యాభై ఏళ్ళకు పైగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు ఒక్క సీటు కూడా పొందలేక మరుగున పడిపోయాయి. బీజేపీ గత లోక్‌సభ ఎన్నికలలో 42 పార్లమెంటు స్థానాల్లో 18 పార్లమెంటు స్థానాలను పొంది పుంజుకున్నది. 2016 ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాల నుంచి 77 స్థానాలను సాధించింది. అలాగే 72 పైగా స్థానాల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. అలా ఒకవైపు వామపక్ష, కాంగ్రెస్ పార్టీలను మట్టి కరిపించటమేగాక, అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించింది. నేటి ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారానికి ఎంతో చేరువకు వచ్చిందన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఓడించడమే గాక, 72 స్థానాల్లో 1000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది. ఇది కూడా ఎలా జరిగిందంటే- వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు తాము గెలవలేము అనుకున్న స్థానాల్లో బీజేపీ వస్తే ఇక ఆ రాష్ట్రంలో పప్పులు ఉడకవు అని భావించి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు తమ ఓట్లు బదిలీ చేయటం వల్లన. అలా అని బీజేపీపై ప్రజల్లో ఆదరణ కానీ, ప్రధానమంత్రి మోదీపై విశ్వాసం కానీ బెంగాల్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 38.1 శాతం ఓట్లతో బెంగాల్ ప్రజల ఆదరణను పొందింది అన్న విషయం అందరూ గమనించాలి. 


మరొక రాష్ట్రం అస్సాం అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే ఇక్కడ బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడమే గాక తన ఓటు శాతాన్ని, సీట్లనూ కూడా పెంచుకుంది. సర్బానంద సొనోవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. అంతేగాక, ప్రధానిగా నరేంద్ర మోదీ అస్సాంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించటంలో ఎంతో చొరవ చూపారు. శాంతియుతమైన పాలన అందించడంలో విజయవంతమయ్యారు. అందుకే ప్రజలు తిరిగి మళ్లీ పట్టం కట్టారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీలను తీసుకు వచ్చినప్పుడు అక్కడ ప్రజల హక్కుల అణచివేత జరుగుతోందని కృత్రిమ ఉద్యమాలను చేసిన కాంగ్రెస్, వామపక్షాలకు అక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు. తిరిగి ఎన్డీఏ కూటమికే అధికారం కట్టబెట్టడం ద్వారా ఈ కుట్రపూరితమైన వాదనల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.


పుదుచ్చేరిలో అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరి ప్రజలు బీజేపీకి ఆరు స్థానాల్లో పట్టం కట్టారు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత మరొక ప్రాంతంలో అధికారాన్ని బీజేపీకి ఇచ్చారు. ఆ విధంగా మోదీపై తమ విశ్వాసాన్ని చాటారు. పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా బీజేపీ అధికారంలోకి రాగలిగింది అంటే అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనాదక్షత పైనా, సుపరిపాలన పైనా నమ్మకమే కారణమని చెప్పాలి.


పక్క రాష్ట్రమైన తమిళనాడులో 2016లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేని బీజేపీ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు గణనీయమైన ఓటు బ్యాంకును సాధించటంలో సఫలీకృతమైంది. బలమైన ప్రాంతీయతత్వం కలిగిన తమిళనాడు వంటి రాష్ట్రంలో కూడా బీజేపీ నాలుగు సీట్లను సాధించింది. సినీ రాజకీయాలకు మారుపేరైన ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడు కమల్ హాసన్‌ను బీజేపీ అభ్యర్థి మట్టి కరిపించారు. ఇక్కడ బీజేపీ దక్కించుకున్న నాలుగు సీట్లూ భవిష్యత్తులో ఆ పార్టీ సాధించబోయే అధికారానికి సూచన.


కేరళ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా పొందకపోయినా ఐదు స్థానాల్లో రెండో స్థానంలో ఉండగలిగింది. అక్కడి ఎల్డీఎఫ్, యుడీఎఫ్ పార్టీలను బీజేపీ భయపెట్టగలిగింది. వారిని ఓటుబ్యాంకుని పంచుకునే విధంగా చేసింది. కేరళ రాష్ట్రాన్ని గమనించినట్లయితే అక్కడ ఐదేళ్లకు ఒకసారి అధికారం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల మధ్య మారుతూ వస్తోంది. గత లోక్ సభకు ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 20 లోక్‌సభ స్థానాలకు గాను 19 స్థానాలను సాధించి ఒక్క స్థానాన్ని మాత్రమే ఎల్డీఎఫ్‌కు మిగిల్చింది. మరలా అదే జరగబోతోంది అన్న విధంగా జరిగిన ఈ ఎన్నికల్లో, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న యూడీఎఫ్ కూటమి ఓడిపోయి, ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామాన్ని నిశితంగా చూడాలి. బీజేపీని రాష్ట్రంలో అడుగిడనీయకూడదన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ నడిపిస్తున్న యూడీఎఫ్ కూటమి బీజేపీ గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థులకు ఓట్లు దక్కే విధంగా వ్యూహం పన్ని తన నాశనాన్ని తనే ఖాయం చేసుకుంది. ఇక్కడి ఎన్నికల్లో బీజేపీ పది శాతం పైన ఓటు బ్యాంకుతో ఒక్క స్థానం కూడా గెలవలేనప్పటికీ ప్రజల్లో ఆదరాభిమానాలను పొదింది అనడంలో సందేహం లేదు. 


ముఖ్యంగా కేరళలో పని చేస్తున్న బీజేపీ కార్యకర్తల పైన, స్వయంసేవకుల పైన, ఏబీవీపీ విద్యార్థులు పైన అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ దాడులు చేసి, హత్యలు కూడా చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ, ఈ రోజు కేరళ రాష్ట్రంలో బీజేపీ తనకున్న ఒక స్థానాన్నీ కోల్పోయినప్పటికీ, 10 శాతానికి పైగా ఓట్లు సాధించి, పార్టీ కార్యకర్తలలో ధైర్యం నింపింది. 


ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ గుండాలు బీజేపీ కార్యకర్తలపైనా, ముఖ్య నాయకులపైనా దాడి చేయడాన్ని ఏఒక్క ప్రతిపక్ష పార్టీగానీ, ఉదారవాదులుగానీ, ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకునే విద్యావంతులుగానీ ఖండించిన దాఖలాలు లేవు. వీరందరికీ మోదీ గారిని విమర్శించడం తప్ప మరొక ధ్యాస ఉండదు అనేది దీనితో స్పష్టమవుతోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి గానీ, ప్రధానమంత్రి మోదీ ప్రతిష్టకు గానీ జరిగిన నష్టమంటూ నిజానికి ఏమీ లేదని కూడా తెలుస్తుంది. 


ఈ రోజు ప్రపంచ దేశాలలో గమనించినట్లయితే భారత ప్రభుత్వం కరోనా నియంత్రించడంలో తీసుకున్న చర్యల వల్లనే జన సాంద్రతతో పోల్చుకుంటే ఇక్కడ ప్రపంచంలోనే అతితక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. వైద్యపరంగానూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన అమెరికా, ఇటలీ, యూరప్ దేశాలలో తక్కువ జన సాంద్రత కలిగి ఉండి కూడా కరోనా మొదటి దశలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు సంభవించాయి. ఆయా దేశాలకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో కావలసిన మందులను సరఫరా చేసి ఆపత్కాలంలో ఆదుకుంది. అలాగే కరోనా టీకాలను భారతదేశంలో ప్రజలందరికీ ఇస్తూనే అవసరమైన వివిధ పేద దేశాలకు కూడా సరఫరా చేస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న చర్యల వల్లే భారతదేశం ఎంతో కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగింది. ఇది మరిచిన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిర్లక్ష్యంగా విమర్శిస్తున్నాయి, విష ప్రచారాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగం కేంద్ర జాబితాలోనిది కాదు. ఉమ్మడి జాబితాకు సంబంధించినదీ కాదు. అది రాష్ట్ర జాబితాకు సంబంధించింది. ప్రజలను నియంత్రించవలసిన బాధ్యత, రాష్ట్ర ప్రజలకు సరైన వైద్య సదుపాయాలను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.


కరోనా రెండవ దశ భారతదేశంపై చూపుతున్న ప్రభావాన్ని గమనించి నేడు ప్రపంచ దేశాలు మనకు అన్ని రకాల సదుపాయాలనూ కల్పించటానికి సిద్ధంగా ఉన్నామని మద్దతు పలుకుతూ, సాయానికి ముందుకు వస్తున్నాయంటే, అందుకు ముఖ్య కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారికి ఉన్న నమ్మకం గౌరవమే. ఈ నిజాన్ని సగర్వంగా చాటి చెప్పుకోవాల్సిన సందర్భమిది.

ఎన్. రామచందర్ రావు

భారతీయ జనతాపార్టీ

Updated Date - 2021-05-06T06:02:55+05:30 IST