చౌక’ సరుకులు వద్దులే!

ABN , First Publish Date - 2021-01-11T08:31:09+05:30 IST

పేదలకిచ్చే రేషన్‌ సరుకులను.. ధరలు పెంచి అమ్ముతుండడంతో అసలుకే మోసం వస్తోంది.

చౌక’ సరుకులు వద్దులే!

  • ధరల పెంపుతో కార్డుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • కందిపప్పు వద్దంటున్న పేదలు.. ఈ నెల సగం అమ్మకాలూ డౌటే
  • శనగలూ అమ్మాలని డీలర్లపై ఒత్తిడి.. తొలిసారి రేషన్‌ సరుకులకు చుక్కెదురు


అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పేదలకిచ్చే రేషన్‌ సరుకులను.. ధరలు పెంచి అమ్ముతుండడంతో అసలుకే మోసం వస్తోంది.  వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రాయితీ కోత విధానంతో రాష్ట్రంలో తొలిసారి రేషన్‌ సరుకులు మాకొద్దు అనే విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో బహిరంగ మార్కెట్‌ ధరలపై 50శాతంగా ఉన్న రేషన్‌ సరుకుల రాయితీని వైసీపీ ప్రభుత్వం 25శాతానికి కుదించింది. కిలో రూ.40కి విక్రయించే కందిపప్పును రూ.67కి పెంచింది. పంచదారను రూ.20 నుంచి రూ.34కు పెంచింది. శనగల ధరలను కూడా భారీగా పెంచింది. దీంతో బహిరంగ మార్కెట్‌కు, రేషన్‌కు పెద్దగా తేడా లేకుండా పోయింది. పైగా రేషన్‌లో ఇచ్చే కందిపప్పు నాసిరకంగా ఉండటంతో.. కార్డుదారులు బయట కొనుక్కోవడం మేలు అనే ఆలోచనకు వస్తున్నారు. దీంతో గతంలో దాదాపు 


90శాతం కార్డులకు అమ్ముడయ్యే కందిపప్పు పంపిణీ గత నెల 50శాతం వద్దే ఆగిపోయింది. కానీ.. ఈ నెలలో ఇప్పటివరకూ 86 లక్షల కార్డులు రేషన్‌ తీసుకుంటే అందులో 48లక్షల కార్డుదారులు మాత్రమే కందిపప్పు తీసుకున్నారు.


తగ్గిన కందిపప్పు ధరలు

గతంలో రేషన్‌ సరుకులపై సుమారు 50శాతం రాయితీ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం రాయితీని 25శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గత నెలలో కందిపప్పు ధర కిలో రూ.67గా నిర్ణయించింది. అయితే గత కొద్ది రోజులుగా కందిపప్పు ధరలు తగ్గాయి. రిటైల్‌గా రూ.90కి, హోల్‌సేల్‌గా రూ.80కే బహిరంగ మార్కెట్‌లో దొరుకుతోంది. అయితే రేషన్‌లో ఇచ్చే కందిపప్పు నాణ్యత బహిరంగ మార్కెట్‌ స్థాయిలో ఉండటం లేదు. 


పంచదార ఎక్కడైనా ఒక్కటే

బహిరంగ మార్కెట్‌లో పంచదార ధర రూ.40కి మించి లేదు. అందులో 25శాతం రాయితీ అంటే కిలో రూ.30గా ధర నిర్ణయించాలి. కానీ రూ.34గా నిర్ణయించారు. దీనికి బయటకు తేడా కేవలం రూ.3 కావడంతో దానిపై కూడా ఆసక్తి లేకుండా పోయింది.డిసెంబరు నెలలో 1.44 కోట్ల కార్డులకు గాను కోటి కారుదారులే పంచదార తీసుకున్నారు. ఇక, సాధారణంగానే ఉచితంగా ఇస్తున్నారని తీసుకోవడం తప్ప శనగలకు రాష్ట్రంలో పెద్దగా డిమాండ్‌ ఉండదు.ఇప్పుడు వాటినే కిలో రూ.42కు అమ్మాలని ఒత్తిడి చేయడం తీవ్ర ఇబ్బందిగా మారిందని డీలర్లు వాపోతున్నారు.

ఎందుకీ పరిస్థితి?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపంపిణీ వల్ల పడే భారాన్ని తగ్గించుకునే ప్రక్రియ మొదలు పెట్టింది. ఒకేసారి 17లక్షల కార్డులు తొలగించాలని నిర్ణయించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెనక్కితగ్గి.. సరుకుల రాయితీని తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఒకేసారి కందిపప్పుపై 27, పంచదారపై 14 పెంచింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా అక్షరాలా రూ.600 కోట్లు ఆదా కానున్నాయి. మరోవైపు ఇటీవల 8లక్షల కార్డులను కూడా తొలగించడంతో ఆదా మరింత పెరుగుతోంది.


వద్దన్నా డీలర్లకు స్టాకు

గత నెల నుంచి పెరిగిన ధరలతో అమ్మకాలను పరిశీలించిన రేషన్‌ డీలర్లు జనవరి కోటాకు చాలా తక్కువ మొత్తంలోనే కందిపప్పు ఇండెంట్‌ పెట్టారు. రాష్ట్రంలో 1.44 కోట్ల కార్డులుంటే 70లక్షల కిలోలకే ఇండెంట్‌ పెట్టారంటే ప్రజల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతుందో అర్థంచేసుకోవచ్చు. అయితే అవి కూడా పేదలు తీసుకోవడం లేదని డీలర్లు గగ్గోలు పెడుతుంటే, కొన్నిచోట్ల అధికారులు వారు పెట్టిన ఇండెంట్‌కు మించి కందిపప్పు పంపుతున్నారు. ఎలాగైనా వాటిని అమ్మి నగదు జమ చేయాలని టార్గెట్లు పెడుతున్నారు. దీంతో కందిపప్పు తీసుకుంటేనే బియ్యం ఇస్తామంటూ కొన్నిచోట్ల డీలర్లు అనధికారికంగా కార్డుదారులకు షరతులు విధిస్తున్నారు. ఈ తరహాలోనే అనధికారిక నిబంధన పెట్టిన డీలరు వ్యవహారం ఇటీవల వెలుగులోకి రావడంతో అతన్ని విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది.

Updated Date - 2021-01-11T08:31:09+05:30 IST