నీటి ట్యాంకులపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-16T07:19:43+05:30 IST

జిల్లావ్యాప్తంగా వివిధ పథకాల కింద గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత నీటి పథకాలపై పర్యవేక్షణ కొరవడింది.

నీటి ట్యాంకులపై నిర్లక్ష్యం

మొక్కుబడిగా క్లోరినేషన్‌

కొరవడిన ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షణ 

పరీక్షలకు సైతం రాంరాం

ప్రమాదంలో ప్రజారోగ్యం

ఒంగోలు (జడ్పీ), జూన్‌ 15 : జిల్లావ్యాప్తంగా వివిధ పథకాల కింద గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత నీటి పథకాలపై పర్యవేక్షణ కొరవడింది. క్లోరినేషన్‌, ట్యాంకుల శుభ్రత విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. విధిగా నిర్వహించాల్సిన నీటి పరీక్షలను సైతం మొక్కుబడి ముగించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కరోనా వేళ పారిశుధ్యం, శుభ్రతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఒకవైపు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. 


జిల్లాలో 2,876 మంచినీటి పథకాలు

జిల్లావ్యాప్తంగా గ్రామీణుల మంచినీటి అవసరాలు తీర్చడానికి 2,876 రక్షిత పథకాలు ఉన్నాయి. అందులో పీడబ్ల్యూఎస్‌ కింద 1,008 ఎంపీడబ్ల్యూఎస్‌ కింద 843, డైరెక్ట్‌ పంపింగ్‌ స్కీమ్స్‌ కింద 1025 నడుస్తున్నాయి. 24,579 చేతిపంపులకు గాను 22,455 పంపులు ప్రజలకు నీరందిస్తున్నాయి. సమగ్ర రక్షిత మంచినీటి పథకం కింద మరో 49 ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు.


తూతూమంత్రంగా నీటి పరీక్షలు 

 ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది తమ పరిధిలోని గ్రామాల్లో ప్రతినెలా నీటి నమూనాలు సేకరించి రసాయన, బ్యాక్టీరియా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. నెలకు 250 నమూనాల వరకు ఆయా కేంద్రాల్లో పరీక్షించాల్సి ఉన్నా తూతూమంత్రంగా చేసి మమ అనిపిస్తున్నారు. రక్షిత పథకాల కింద ఉన్న ట్యాంకులను సైతం ప్రతినెలా శుభ్రపరచాల్సి ఉంటుంది. ఏ తేదీన ఏ గ్రామంలో ఈ డ్రైవ్‌ను నిర్వహించారో విధిగా  రికార్డుల్లో నమోదుచేయాలి. స్థానికుల చేత సంతకం కూడా పెట్టించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పక్కాగా అమలు జరగడం లేదన్న విమర్శలు వినిపిసున్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు ఉంటుండటంతో చాలా గ్రామాల్లో ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. 


Updated Date - 2021-06-16T07:19:43+05:30 IST