చివరి రోజునా ఫిర్యాదుల్లేవ్‌

ABN , First Publish Date - 2021-01-21T06:02:28+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ చార్జీలు పెంచే విషయమై మూడు రోజులుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో ముగిసింది. చివరిరోజు జిల్లా నుంచి ఇద్దరు మాట్లాడాల్సి ఉండగా, వారు గైర్హాజరయ్యారు.

చివరి రోజునా ఫిర్యాదుల్లేవ్‌
ప్రజాభిప్రాయ సేకరణలో కమిషన్‌ ఎదుట నివేదక సమర్పిస్తున్న సీఎండీ

ముగిసిన ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ


తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 20: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ చార్జీలు పెంచే విషయమై మూడు రోజులుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో ముగిసింది. చివరిరోజు జిల్లా నుంచి ఇద్దరు మాట్లాడాల్సి ఉండగా, వారు గైర్హాజరయ్యారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. 15.85లక్షల వినియోగదారులకు గాను కందారపు మురళి ఒక్కరే హాజరై సమస్యలపై మాట్లాడారు. చివరిరోజు వీసీలో ఎస్‌ఈ డి.వెంకటచలపతి, ఈఈలు ఎం.కృష్ణారెడ్డి, వాసురెడ్డి, డీఈఈలు జయప్రకాష్‌, సతీష్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం 


రాష్ట్రంలోని మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు సమన్వయంతో వినియోగదారులకు అన్ని రకాల సేవలకు గుర్తింపుగా జాతీయస్థాయిలో ప్రథమస్థానం లభించిందని ఏపీ సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు తెలిపారు. విశాఖలో మూడు రోజుల నుంచి ఏపీ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. చివరిరోజుబుధవారం సీఎండీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించినందుకు ఆయన కమిషన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారిగా వీసీలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. విద్యుత్‌ సంస్థలో 843మంది ఉద్యోగులకు కొవిడ్‌ సోకగా, 14మంది మృతి చెందడం తీరనిలోటన్నారు. కొవిడ్‌ సమయంలో రెండు నెలల బిల్లులు వచ్చినప్పుడు వినియోగదారులు అపోహకు గురికాగా, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించామన్నారు. 

Updated Date - 2021-01-21T06:02:28+05:30 IST