పోతిరెడ్డిపాడు వద్ద కాంక్రీటు పనుల్లేవు

ABN , First Publish Date - 2021-07-28T08:41:29+05:30 IST

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల ప్రకారం.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఉత్తరం వైపున ఎలాంటి..

పోతిరెడ్డిపాడు వద్ద కాంక్రీటు పనుల్లేవు

సీమ పథకంలో కొత్త ఆయకట్టు లేదు

కాలువ సామర్థ్యమూ పెరగదు

శ్రీశైలంలో 854 అడుగుల మట్టం ఉంటేనే నీరు తీసుకోవలసిన దుస్థితి

800 అడుగుల నుంచి తీసుకునేందుకే కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన

ట్రైబ్యునల్‌ కేటాయింపులకు లోబడే చేపట్టాం

మీ ఆదేశాలు ఉల్లంఘించలేదు

గవినోళ్ల పిటిషన్‌ను కొట్టేయండి

భారీ జరిమానా విధించండి

ఎన్‌జీటీలో రాష్ట్రప్రభుత్వ కౌంటర్‌


అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల ప్రకారం.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఉత్తరం వైపున ఎలాంటి కాంక్రీట్‌ పనులూ చేపట్టడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపులకు లోబడే.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటిమట్టం నుంచి నీరు తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని తేల్చిచెబుతూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఎన్‌జీటీ ముందు కౌంటర్‌ దాఖలు చేశారు.  శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ ద్వారా చెన్నైకి తాగునీరు, తెలుగుగంగ, గాలేరు-నగరికి నీటిని తరలించేందుకు కొత్త స్కీం ఉద్దేశమని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్నందున ఇప్పుడు మళ్లీ కొత్తగా తీసుకోవలసిన అవసరం లేదని సాంకేతిక కమిటీ స్పష్టం చేసిందన్నారు. పథకంలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎన్‌జీటీకి సమర్పించామని.. వాటికి అనుగుణంగా తగు ఆదేశాలివ్వాలని కోరారు.  తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేసి.. పిటిషనర్‌కు భారీ జరిమానా విధించాలని అఫిడవిట్‌లో విజ్ఞప్తి చేశారు.

కౌంటర్‌లోని ముఖ్యాంశాలు..

8 కృష్ణా ట్రైబ్యునల్‌-1 కేటాయింపులు ఉన్నప్పటికీ.. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 854 అడుగుల వద్ద ఉంటే తప్ప నీటిని తీసుకోలేని దుస్థితి మాకు ఎదురవుతోంది. కేటాయించిన నీటిని వాడుకునేందుకే 800 అడుగుల వద్ద నుంచి తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించాం. 

8 నిరుడు జూలై 14న టెండర్లను పిలిచేందుకు ఎన్‌జీటీ అనుమతించింది. తక్కువ ధరకు బిడ్‌ వేసిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.

8 నిరుడు అక్టోబరు 29న ఇచ్చిన ఆదేశాల్లో ట్రైబ్యునల్‌ పలు సూచనలు చేసింది. బిడ్దర్‌ సమగ్ర సర్వే చేయాలని, ముచ్చుమర్రి వద్ద భూసేకరణను నివారించడంలో భాగంగా మరే ఇతర ప్రాంతంలోనైనా పథకాన్ని చేపట్టాలని సూచించింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ఎడమ వైపు సీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బిడ్డర్‌ నివేదికను సాంకేతిక కమిటీ ఆమోదించింది. ఆ తర్వాతే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద పథకం నిర్మాణానికి పరిశీలనలు చేయాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను రాష్ట్రప్రభుత్వం కోరింది. గత ఏడాది డిసెంబరు 4న అది తన నివేదికను సమర్పించింది. నాగార్జున సాగర్‌-శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోని ఎకో జోన్‌ పరిధిలోనికి ఈ పథకం రాదని అందులో వెల్లడించింది. పథకంలో చేసిన మార్పులూ.. జియోలాజికల్‌ సర్వే నివేదికను ఎన్‌జీటీ ముందుంచుతున్నాం.

8 చేసిన మార్పుల ప్రకారం కొత్త ఆయకట్టేమీ లేదు. ప్రస్తుత కాలువ సామర్థ్యమూ పెరగదు. పథకంలో మార్పులూ చేర్పులకు సంబంధించిన డీపీఆర్‌ను ఈ ఏడాది జూన్‌ 30న కేంద్ర జల సంఘానికీ.. జూలై 1న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అందజేశాం. పర్యావరణ అనుమతులు కోరుతూ కేంద్రానికి జూన్‌ 9న వినతి పత్రాన్ని అందించాం. జూన్‌ 17, జూలై 7న సమావేశమైన జలశక్తి శాఖ నిపుణుల కమిటీ కోరిన మార్పులతో నివేదిక అందజేశాం. అవి పరిశీలనలో ఉన్నాయి.

Updated Date - 2021-07-28T08:41:29+05:30 IST