పిల్లలు, గర్భిణీ తల్లుల పూర్తి ఆరోగ్యంతోనే దేశ ప్రగతి: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-08-30T22:53:30+05:30 IST

పిల్లలు, గర్భిణీ తల్లులు పూర్తి ఆరోగ్యంతో ఉండేంత వరకూ ఏ దేశం కూడా ప్రగతి..

పిల్లలు, గర్భిణీ తల్లుల పూర్తి ఆరోగ్యంతోనే దేశ ప్రగతి: అమిత్‌షా

అహ్మదాబాద్: పిల్లలు, గర్భిణీ తల్లులు పూర్తి ఆరోగ్యంతో ఉండేంత వరకూ ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార లోపం లేకుండా చూసేందుకు ఉద్దేశించిన 'లడ్డూ వితరణ్ యోజన'ను తన పార్లమెంటరీ నియోజకవర్గమైన గాంధీనగర్‌లో అమిత్‌షా సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ నగర్ ఎంపీగా నియోజకవర్గం తల్లీపిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. ఇవాల్టి నుంచి గాంధీనగర్‌లోని 7,000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు ప్రతి నెలా 15 పోషకాహార లడ్డూలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవ్వడం జరుగుతుందని, దాంతో పిల్లలు పుట్టేంతవరకూ వారికి తగిన పోషక విలువలు అందుతాయని అన్నారు. ఇందువల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశంలోని పిల్లలు, గర్భిణీ తల్లులు ఎవరూ పోషకాహార లోపంతో ఉండరాదని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. మోదీ ఇచ్చిన నినాదం ఈరోజు ఒక ప్రజాఉద్యమంగా మారిందని అన్నారు. బలహీన, పేద, వెనుకబడిన, మహిళల సాధికారత, బాలల హక్కులు అనేవి ప్రజాస్వామ్యంలో చాలా కీలకమని అమిత్‌షా పేర్కొన్నారు.

Updated Date - 2021-08-30T22:53:30+05:30 IST