Hyderabad : నిద్రపోతున్న నిఘా.. నో సైరన్.. నో పెట్రోలింగ్!

ABN , First Publish Date - 2021-07-30T19:57:55+05:30 IST

నగర శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు..

Hyderabad : నిద్రపోతున్న నిఘా.. నో సైరన్.. నో పెట్రోలింగ్!

  • వినిపించని సైరన్‌, కనిపించని పెట్రోలింగ్‌
  • శివారు ప్రాంతాల్లో రెచ్చిపోతున్న దొంగలు
  • వారం రోజుల్లో 9 దొంగతనాలు
  • వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

హైదరాబాద్‌ సిటీ : నగర శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే రాచకొండ పరిధిలోని కీసరలో చోరీలకు పాల్పడింది చెడ్డీగ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. అది జరిగిన రెండు రోజుల్లోనే జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3 దొంగతనాలు, ఆ తర్వాత 3 రోజుల వ్యవధిలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ శివారులో 3 అపార్ట్‌మెంట్లలో చోరీలు జరిగాయి. ఇలా రోజువిడిచి రోజు దొంగలు రెచ్చిపోతున్నా, ఇళ్లను గుల్ల చేస్తున్నా, వారిని పట్టుకోవడంలో క్రైమ్‌ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా శివారు ప్రాంతాల్లోని పలు కాలనీల్లో రాత్రి పూట పోలీస్‌ సైరన్‌ వినిపించడంలేదు. పెట్రోలింగ్‌ వాహనాలు మచ్చుకైనా కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అక్కడక్కడ పెట్రోలింగ్‌ వాహనాలు కనిపించినా పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. రాత్రి పదికాగానే ఏదో ఒక కాలనీని ఎంచుకొని రోడ్డుపక్కన వాహనం ఆపుకొని ఉంటున్నారు. వీలైతే ఒక కునుకు తీస్తున్నారు. ఆ తర్వాత మెయిన్‌రోడ్డులో తిరుగుతూ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఏదో ఒక టీస్టాల్‌ వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ టీ తాగి తెల్లవారగానే డ్యూటీ ముగించుకొని వెళ్లిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి గస్తీ నిర్వహించే పెట్రోలింగ్‌ పోలీసులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పోలీస్‌ నిఘా నిద్రపోతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


వరుస దొంగతనాలు...

జూలై-7: జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయిబాబానగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. శంకర్‌ కుమార్‌ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

జూలై-9: నాగారంలో వేర్వేరు కాలనీల్లోని 3 ఇళ్లలోకి చెడ్డీగ్యాంగ్‌ చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 18 తులాల బంగారం దోచుకెళ్లారు. 

జూలై-10: జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జమ్మిగడ్డ కాలనీలో పోనూజు నవీన్‌ ఇంటి తాళాలు పగులగొట్టిన దొంగలు 4 తులాల బంగారం, 75వేల నగదు ఎత్తుకెళ్లారు. 

జూలై-11: దమ్మాయిగూడలోని సాయిబాబానగర్‌లో బసుదేవ్‌సాహు ఇంట్లోకి చొరబడ్డ దొంగలు రూ.30వేల నగదు, 4తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 

జూలై-13: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో ఒక్క రాత్రిలోనే 3 అపార్టుమెంట్లలోకి చొరబడి మూడు ఇళ్లలో చోరీలు చేశారు. మొత్తం 8తులాల బంగారం, 1.60లక్షల నగదు దోచుకెళ్లారు.

జూలై-13: పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని సుచిత్రా సెంటర్‌లో ఉన్న ఓ ఏటీఎం దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. మరుసటిరోజు గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలుచోట్ల చోరీలు జరిగాయి.


రంగంలోకి దిగిన స్పెషల్‌ పోలీసులు..

రెండు కమిషనరేట్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతుండటంతో సీపీలు మహేష్‌ భగవత్‌, వి.సి. సజ్జనార్‌లు స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల ముఠాల కోసం గాలిస్తున్నారు. ఐటీ సెల్‌ అధికారులతో కలిసి కొన్ని టీమ్‌లు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్నది అంతర్రాష్ట్ర ముఠాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పదుల సంఖ్యలో దొంగల ముఠాల ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు. దాంతో కొంతకాలంగా నగరంలో దొంగల బెడద తగ్గింది. కానీ, ఇటీవల పలు అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. నగరంపై మంచి పట్టున్న దొంగలే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అతిత్వరలోనే దొంగల ముఠాలను పట్టుకుంటామని స్పెషల్‌ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2021-07-30T19:57:55+05:30 IST