మరణాలకు ఆక్సిజన్ కొరత కారణమనే సమాచారం లేదు : కేంద్రం

ABN , First Publish Date - 2021-07-20T23:14:33+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత

మరణాలకు ఆక్సిజన్ కొరత కారణమనే సమాచారం లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. అయితే మొదటి ప్రభంజనం కన్నా రెండో ప్రభంజనం సమయంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ మునుపెన్నడూ లేనంత పెరిగిందని పేర్కొంది. మొదటి ప్రభంజనం సమయంలో 3,095 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉండేదని, ఇది రెండో ప్రభంజనంలో 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపింది. దీంతో తానే  స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రాలన్నిటికీ సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ జరిగేవిధంగా చూసినట్లు వివరించింది. 


కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో భారీ సంఖ్యలో కోవిడ్ రోగులు మెడికల్ ఆక్సిజన్ కొరత కారణంగా రోడ్లపైనా, ఆసుపత్రుల్లోనూ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. వైద్య, ఆరోగ్యం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశమని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయన్నారు. మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసులు, మరణాల వివరాలతో కూడిన నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదన్నారు. 


2021 ఏప్రిల్, మే నెలల్లో రెండో ప్రభంజనం తీవ్రత దృష్ట్యా కోవిడ్-19 రోగులకు క్లినికల్ కేర్ సక్రమంగా అందేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందన్నారు. మెడికల్ ఆక్సిజన్, ఇతర పరికరాలను అందజేయడం ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. కోవిడ్ మొదటి ప్రభంజనంలో 3,095 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ ఉండేదని, రెండో ప్రభంజనంలో ఈ డిమాండ్ మునుపెన్నడూ లేనివిధంగా 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ జరిగేలా చూసిందన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించి, సంబంధిత మంత్రిత్వ శాఖలు, మాన్యుఫ్యాక్చరర్లు/సప్లయర్లు వంటి ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులు చురుగ్గా, పారదర్శకంగా జరిపినట్లు తెలిపారు. 


Updated Date - 2021-07-20T23:14:33+05:30 IST