గ్రామాల పేరు మార్పుపై నిర్ణయం తీసుకోలేదు.. సిద్ధరామయ్యకు కేరళ సీఎం లేఖ

ABN , First Publish Date - 2021-07-13T18:40:10+05:30 IST

కాసరగాడ్‌ జిల్లాలోని పలు గ్రామాల పేర్లు మార్చనున్నారంటూ వస్తున్న వార్తలపై కర్ణాటక..

గ్రామాల పేరు మార్పుపై నిర్ణయం తీసుకోలేదు.. సిద్ధరామయ్యకు కేరళ సీఎం లేఖ

తిరువనంతపురం: కాసరగాడ్‌ జిల్లాలోని పలు గ్రామాల పేర్లు మార్చనున్నారంటూ వస్తున్న వార్తలపై కర్ణాటక నేతల ఆందోళనకు కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. గ్రామాల పేరు మార్పు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ మేరకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆయన లేఖ రాశారు.


''జూన్ 29న మీరు రాసిన లేఖకు ప్రత్యుత్తరమిది. కాసరగాడ్ జిల్లాలో గ్రామాల పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీకు తెలియజేయదలచుకున్నాను. ఇందుకు సంబంధించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఇరు రాష్ట్ర ప్రజల మధ్య సంబంధాలు, సామరస్యత కోరుకుంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసిన మీకు హృదయపూర్వక అభినందలు తెలయజేస్తున్నాను'' అని సిద్ధరామయ్యకు రాసిన లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు.


కాసరగాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చి, మలాయళం పేర్లు పెడుతున్నారంటూ కథనాలు రావడంతో సిద్ధరామయ్య సహా పలువురు కర్ణాటక నేతలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 29న కేరళ సీఎంకు సిద్ధరామయ్య నేరుగా లేఖ రాశారు. కన్నడ, తులు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న కాసరగాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలని అధికార యంత్రాంగం నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు ఆ లేఖలో సిద్ధారామయ్య పేర్కొన్నారు. ఇందువల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఆయా ప్రాంతాలకు పేరు తెచ్చిన పురాతన సంస్కృతి దెబ్బతింటుందని పినరయి విజయన్ దృష్టికి తెచ్చారు. గ్రామాల పేర్లు మార్చకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

Updated Date - 2021-07-13T18:40:10+05:30 IST