తాగుడు మానేయమన్నందుకే చంపేశారు

ABN , First Publish Date - 2021-12-07T07:04:04+05:30 IST

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు పంచాయతీ కోలమూరు గ్రామ పరిధిలోని బొమ్మన కాలనీలో ఒక పురోహితుడిని హత్య చేసి శరీర భాగాలను దహనం చేసిన ఘటనను రాజానగరం పోలీసులు ఛేదించారు.

తాగుడు మానేయమన్నందుకే చంపేశారు
వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ రవికుమార్‌

కోలమూరు  పురోహితుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన రాజమహేంద్రవరం ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 6: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు పంచాయతీ కోలమూరు గ్రామ పరిధిలోని బొమ్మన కాలనీలో ఒక పురోహితుడిని హత్య చేసి శరీర భాగాలను దహనం చేసిన ఘటనను రాజానగరం పోలీసులు ఛేదించారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ వెల్లడించారు. మృతుడు కంచిభట్ల నాగసాయి, వెలివెంటి సాయిపవన్‌, నెరుగొందల నాగేంద్ర కోలమూరు బొమ్మన కాలనీలో ఒక ఇల్లు అద్దెకు  తీసుకుని సుమారు నాలుగు నెలలుగా అక్కడ ఉంటూ వారి కులవృత్తి అయిన పౌరహిత్యం చేసుకుంటున్నారు. సాయిపవన్‌, నాగేంద్ర మద్యానికి బానిసై తరుచూ తాగి వస్తుండడంతో నాగసాయి వారిని మందలించాడు. ఈ విధంగా రెండు, మూడుసార్లు జరగడంతో నాగసాయిపై కక్ష పెట్టుకున్న ఈ ఇద్దరూ అతడిని గతనెల 24వ తేదీ అర్ధరాత్రి చాకులతో పొడిచి ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. ఎవరూ గుర్తు పట్టకుండా నాగసాయి మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 3న మళ్లీ వచ్చి ఆ మృతదేహం సరిగా కాలకపోవడంతో మరలా పెట్రోలు పోసి కాల్చుతుండగా చుట్టుపక్కల వారికి వాసన వచ్చి అనుమానం రావడంతో వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ లతామాధురి పర్యవేక్షణలో రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డాగ్‌ స్క్వాడ్‌, ఇతర పరిజ్ఞానంతో 36 గంటల్లో కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన  సీఐతో పాటు ఎస్‌ఐ వై.సుధాకర్‌, ఎండీ జుబేర్‌, ఏఎస్‌ఐ వై.శ్రీని వాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌     ఎన్వీ రెడ్డి, కానిస్టేబుళ్లు సూరిబాబు, సీహెచ్‌ నాగేంద్ర, డీఎన్‌ఎస్‌ ప్రసాద్‌లను   ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 



Updated Date - 2021-12-07T07:04:04+05:30 IST