ఖాళీ చేసేదే లేదు!

ABN , First Publish Date - 2021-10-19T04:43:21+05:30 IST

‘‘మాకు రావాల్సిన పరిహారం పూర్తిస్థాయిలో ఇస్తేనే ఇళ్లను ఖాళీ చేసి వెళ్తాం. బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే చావనైనా చస్తాం.. కానీ ఇళ్లను మాత్రం ఖాళీ చేయబోం.’’ అని సంగారెడ్డి జిల్లా గుడితండావాసులు కరాఖండిగా చెబుతున్నారు.

ఖాళీ చేసేదే లేదు!
గుడితండా సమీపంలో కొనసాగుతున్న అకోలా-నాందేడ్‌ 161 జాతీయ రహదారి పనులు

పరిహారం ఇచ్చాకే ఇళ్లను వదిలివెళ్తాం  

కరాఖండిగా చెబుతున్న గుడితండావాసులు

అధికారులు మాటమార్చారని ఆవేదన

దిక్కుతోచని స్థితిలో తండాలోని 27 కుటుంబాలు

ఇప్పటికే మనస్తాపంతో నలుగురి మృతి

అధికారుల తీరుపై గుడితండావాసుల ఆగ్రహం 

కొనసాగుతున్న అకోలా-నాందేడ్‌ 161 జాతీయ రహదారి పనులు 


‘‘మాకు రావాల్సిన పరిహారం పూర్తిస్థాయిలో ఇస్తేనే ఇళ్లను ఖాళీ చేసి వెళ్తాం. బలవంతంగా  ఖాళీ చేయించాలని చూస్తే చావనైనా చస్తాం.. కానీ ఇళ్లను మాత్రం  ఖాళీ చేయబోం.’’ అని సంగారెడ్డి జిల్లా గుడితండావాసులు కరాఖండిగా చెబుతున్నారు. అధికారులు వారి ఇళ్లను ఖాళీ చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు.


సంగారెడ్డిరూరల్‌, అక్టోబరు 18:  సంగారెడ్డి మండలం గుడితండా గ్రామం మీదుగా అకోలా-నాందేడ్‌ 161 జాతీయ రహదారి పనులను ఏప్రిల్‌లో ప్రారంభించారు. జాతీయ రహదారి విస్తరణలో తండాకు చెందిన 27 కుటుంబాలు ఇళ్లు, భూములు కోల్పోతున్నాయి. రహదారి విస్తరణలో తమ ఇళ్లు, భూములు కోల్పోతున్నామని తీవ్ర మనస్తాపానికి గురైన తండావాసులు నెనావత్‌ గోప్యానాయక్‌, శంకర్‌నాయక్‌, మిట్యానాయక్‌, సావిత్రిబాయి మృతిచెందారు. బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇళ్లు కోల్పోతున్న వారికి రూ.70వేల నుంచి రూ.3.50లక్షలు, వ్యవసాయ భూమికి రూ.13లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ధరను నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు తండావాసులతో సమావేశమైనపుడు ఇళ్లు నిర్మించుకునేందుకు ఎంత ఖర్చు అయిందో అంత మొత్తం చెల్లిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారని, ఇప్పుడు తమను మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.  ఇళ్లకు రూ.9లక్షలు, వ్యవసాయ భూములకు రూ.25లక్షలు చెల్లించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుంటే.. ఇప్పుడు ఆ భూములను తీసుకుని తమ నోట్లో మట్టి కొట్టొద్దని తండావాసులు వేడుకుంటున్నారు. అప్పులు చేసి రూ.లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇళ్లకు అరకొర పరిహారం చెల్లించి, ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బెదిరింపులకు భయపడేది లేదని వారు తేల్చిచెబుతున్నారు. పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని లేదంటే ఇళ్లను కట్టివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు  

అకోలా-నాందేడ్‌ 161 జాతీయ రహదారి పనులను గుడితండా మీదుగా నిర్మిస్తున్నా.. అధికారులు తండాలోని ఇళ్ల జోలికి వెళ్లడం లేదు. ఇళ్ల వరకు మాత్రమే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. తండావాసులు ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రమే చెల్లించి స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అధికారులు తండావాసులను ఎలాగైనా ఇళ్లు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో రెట్టింపు పరిహారం చెల్లిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. తాము చెప్పిన విధంగా పరిహారం చెల్లించాలని, లేదంటే ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తండావాసులు మొండికేస్తారని అధికారులు ఊహించలేదు. మరి తండావాసుల డిమాండ్లను నెరవేరుస్తారా? జాతీయ రహదారి పనులను మధ్యలోనే ఆపేస్తారా అన్నది వేచిచూడాలి. 


చదువుకోలేదని మోసగిస్తారా?

- సుజాత, గుడితండా

పూర్తిస్థాయి పరిహారం ఇస్తామని మొదట చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు. మేం చదువుకోలేదని మా య మాటలు చెప్పి మోసగిస్తారా? భూములపైనే ఆధారపడి బతుకుతున్నాం. మొత్తం పరిహారం చెల్లిస్తేనే ఇళ్లను ఖాళీ చేస్తాం. ఇళ్లను ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నరు.. చావనైనా చస్తాం కానీ ఖాళీ చేయం.


తండావాసులకు న్యాయం చేయాలి..

- తెగావత్‌ లక్ష్మీబాయి, గుడితండా సర్పంచ్‌

జాతీయ రహదారి మాఊరి మీదు గా రావడం మాకూ ఆనందమే. విస్తరణలో భాగంగా తమ ఇళ్లను కోల్పోతున్నామని మనస్తాపంతో ఇప్పటికే నలుగురు చనిపోయారు. నిర్వాసితులకు ప్రభుత్వం అధికారులు మానవతాదృక్ఫథంతో ఆలోచించి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి తండా వాసులకు న్యాయం చేయాలి



Updated Date - 2021-10-19T04:43:21+05:30 IST