నిబంధనలను ఉల్లంఘిస్తే మంత్రులనైనా వదిలేది లేదు : కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2022-01-19T20:43:36+05:30 IST

కోవిడ్-19 వ్యాప్తి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినవారిపై కేసులు

నిబంధనలను ఉల్లంఘిస్తే మంత్రులనైనా వదిలేది లేదు : కర్ణాటక సీఎం

బెంగళూరు : కోవిడ్-19 వ్యాప్తి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మయ్ ఆదేశించారు. ఆయన ఇటీవలే కోవిడ్-19కు గురై, చికిత్స పొందారు. తాజా పరీక్షల్లో కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ కావడంతో ఆయన తిరిగి విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. 


బసవరాజ్ బొమ్మయ్ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు విలేకర్లు మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాప్తి నిరోధక నిబంధనలను బీజేపీ నేతలు ఉల్లంఘిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ, కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘించేవారు ఎవరైనప్పటికీ, వారు ఎమ్మెల్యేలు, మంత్రులు అయినప్పటికీ, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌కి ఓ లేఖ రాశారు. కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విలేకర్లు ప్రశ్నించినపుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదని, తామే స్వయంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


ఇదిలావుండగా, కోవిడ్ ఆంక్షలను సడలించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. కఠినమైన ఆంక్షలు అక్కర్లేదని చాలా మంది చెప్తున్నారన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పరిస్థితిని అదుపు చేయవచ్చునని అంటున్నారని తెలిపారు. సాంకేతిక సలహా కమిటీని సంప్రదించి, పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సహా చాలా మంది బీజేపీ నేతలు ఈ ఆంక్షలను ఉపసంహరించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-01-19T20:43:36+05:30 IST