ఎయిర్‌పోర్టు మూసివేతకు నో

ABN , First Publish Date - 2020-11-22T06:05:41+05:30 IST

విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేయాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌పై ఉన్నత స్థాయి వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఎయిర్‌పోర్టు మూసివేతకు నో

ఏడాది క్రితమే చెప్పిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా

అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ

ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి కొత్త విమానాశ్రయం

150 కి.మీ. దూరంలో ఉండాలి!

నిర్వహణకు తగిన ఆదాయం వస్తుందనుకుంటే మాత్రం ముందుకువెళ్లవచ్చు

అప్పుడు ఇష్టమైతే రెండూ ఆపరేట్‌

చేసుకోవచ్చు...లేదా ట్రాఫిక్‌ విభజించుకోవచ్చు



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేయాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌పై ఉన్నత స్థాయి వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం ఇంకా మొదలుకాకముందే...ఇక్కడ విమానాశ్రయాన్ని మూసివేయాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రికి లేఖ ఇవ్వడాన్ని అన్ని వర్గాలూ తప్పుబడుతున్నాయి. విమానాశ్రయాల ఏర్పాటులో నిబంధనలు తెలుసుకొని మాట్లాడండి...అంటున్న ఆయన తెలుసుకోవలసినవి చాలా వున్నాయని ఆ రంగానికి చెందిన పలువురు చెబుతున్నారు.


ఏడాది క్రితమే నో చెప్పిన ఏఏఐ 

భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం పనిచేయడం ప్రారంభించాక...విశాఖపట్నంలో విమానాశ్రయం మూసేయాలని 2019లో కూడా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిని నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాంటి ఆలోచనే తమకు లేదని తెలియజేసింది. పార్లమెంటులో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పౌర విమానయాన శాఖ విశాఖపట్నంలో విమానాశ్రయం కొనసాగుతుందని స్పష్టంచేసింది.


కొత్తది 150 కి.మీ.దూరంలో ఉండాలి

రాష్ట్రంలో ఎక్కడైనా గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కొత్తగా ఏర్పాటుచేయాలనుకుంటే...ప్రస్తుతం వున్న విమానాశ్రయానికి 150 కి.మీ. దూరంలో ఉండాలి. అది కూడా ప్రస్తుత విమానాశ్రయం ప్రయాణికుల అవసరాలు తీర్చలేని పరిస్థితిలో వున్నప్పుడు మాత్రమే అనుమతిస్తారు. అయితే కొత్తగా ఎక్కడైతే ప్రతిపాదిస్తున్నారో...ఆ ప్రాంతంలో విమానాశ్రయం నిర్వహణకు తగిన ఆదాయం వస్తుందనుకునే పక్షంలో ముందుకువెళ్లవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో ప్రస్తుతం వున్న విమానాశ్రయాన్ని మూసేసి కొత్త విమానాశ్రయం ఒక్కటే ఆపరేట్‌ చేయాలి. లేదంటే రెండూ నిర్వహించుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ విధంగా ముందుకు వెళతారనేది కొత్త విమానాశ్రయం నిర్మాణానికి పిలిచే టెండర్లలో స్పష్టంగా ప్రకటించాలి. 

రెండు విమానాశ్రయాలు నిర్వహించాలనుకుంటే...ప్రాంతాల వారీగా ట్రాఫిక్‌ విభజన చాలా స్పష్టంగా ఉండాలి. 


దూరం తగ్గిస్తూ ప్రతిపాదనలు

విమానాశ్రయాల సంఖ్య పెంచాలని, ఎక్కడికక్కడ ఏర్పాటుచేయాలనే ఆలోచనతో కేంద్రం నిబంధనలు మార్చాలని నిర్ణయించింది. రెండు విమానాశ్రయాల మధ్య దూరం 150 కి.మీ. నుంచి 50 కి.మీ.కు తగ్గించాలని ప్రతిపాదిస్తోంది. ఇది అమలులోకి వస్తే..భోగాపురంలో నిరభ్యంతరంగా ఏర్పాటుచేసుకోవచ్చు. అదే సమయంలో విశాఖ విమానాశ్రయం ముందు ఏర్పా టైంది కాబట్టి దానిని మూసేయాలని కోరే హక్కు లేదు. ఇది పరస్పర అంగీకారంతో జరగాలి. కొత్త విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామ్యం కోసం ఏఏఐ ముందుకు వస్తే...రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో ఏఏఐ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదనే వాదన వినిపిస్తోంది. 


ఎంచుకునే అవకాశం ప్రయాణికులదే

విశాఖపట్నంలో ఈ విమానాశ్రయం, భోగాపురంలో కొత్త విమానాశ్రయం రెండూ నడుపుకునే వెసులుబాటు ఉంది. ఒకటి దేశీయ విమానాల కోసం, రెండోది అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించుకోవచ్చు. లేదంటే రెండూ అన్నిరకాల విమానాలు ఆపరేట్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు వారికి నచ్చిన విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తారు. 


లాభనష్టాలు ఉన్నాయి

విశాఖపట్నం విమానాశ్రయం నగరం మధ్యలో ఉంది. కేవలం పది నిమిషాల వ్యవధిలో నగరంలోకి వచ్చేయవచ్చు. అదనపు ప్రయాణ భారం ఉండదు. అయితే నేవీ ఆధ్వర్యంలో వుండడం వల్ల విమాన సంస్థలు కోరిన సమయంలో స్లాటు లభించడం లేదు. దానివల్ల ఇతర నగరాలకు కనెక్టివిటీ త్వరగా అందడం లేదు. ప్రతి అంశంపై పోరాడితే తప్ప ఫలితం ఉండడం లేదు.

భోగాపురం విమానాశ్రయం నగరానికి 50 కి.మీ. దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే...మరో నగరానికి విమాన ప్రయాణ సమయం ఎంత పడుతుందో...దానికీ అంతే పడుతుంది. ప్రైవేటు ఆపరేటర్‌ నిర్వహించే విమానాశ్రయం కావడంతో యూజర్‌ చార్జీలు భారీగా ఉంటాయి. రానుపోను టాక్సీలకు అదనంగా చెల్లించుకోవాలి. ఆర్థికంగా ప్రయాణికులకు భారం.

Updated Date - 2020-11-22T06:05:41+05:30 IST