అత్యంత సాదాసీదాగా.. ఒలంపిక్స్ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-07-23T09:45:25+05:30 IST

ఒలింపిక్స్‌ ప్రారంభం అంటే ఓ సంరంభం.. వేలాదిమంది అభిమానులతో కిక్కిరిసే ప్రధాన స్టేడియం.. ఎల్లలు దాటివచ్చిన ఫ్యాన్స్‌ తమ దేశ ఆటగాళ్లను చూడగానే పెద్దపెట్టున చేసే హర్షధ్వానాలతో మోతమోగే సందర్భం.. భారీగా తరలివచ్చే దేశాధినేతలు.. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల హోరు...

అత్యంత సాదాసీదాగా.. ఒలంపిక్స్ ప్రారంభోత్సవం

  • వేడుకలను ప్రారంభించనున్న జపాన్‌ చక్రవర్తి 
  • సాయంత్రం 4.30 నుంచి (భారత కాలమానం ప్రకారం) 
  • సోనీ,  దూరదర్శన్‌, డీడీ స్పోర్ట్స్‌లో 

ఒలింపిక్స్‌ ప్రారంభం అంటే ఓ సంరంభం.. వేలాదిమంది అభిమానులతో కిక్కిరిసే ప్రధాన స్టేడియం.. ఎల్లలు దాటివచ్చిన ఫ్యాన్స్‌ తమ దేశ ఆటగాళ్లను చూడగానే పెద్దపెట్టున చేసే హర్షధ్వానాలతో మోతమోగే సందర్భం.. భారీగా తరలివచ్చే దేశాధినేతలు.. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల హోరు.. లేజర్‌ కాంతుల ధగధగలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మాటలలో వర్ణించలేని అనుభూతి. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నం. కరోనా వైరస్‌ ఆందోళనల నడుమ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం అత్యంత సాధారణంగా జరగబోతోంది. టోక్యోలో కొవిడ్‌ విజృంభణతో ఇప్పటికే నాలుగో దశ ఎమర్జెన్సీ అమలులో ఉంది. తొలుత 10వేలమంది ప్రముఖులను ప్రారంభోత్సవానికి అనుమతించాలనుకున్నారు. కానీ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఖాళీ స్టేడియంలోనే ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో 60వేల మంది సామర్థ్యం కలిగిన అత్యాధునిక నేషనల్‌ స్టేడియంలో వేయిమంది అతిథులతోనే కార్యక్రమం జరగనుంది. వీఐపీల్లో జపాన్‌ చక్రవర్తి నరుహిటో ముఖ్యుడు. అమెరికా అధ్యక్షుడి సతీమణి, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ విదేశీ అతిథుల్లో ప్రముఖులు. 


కార్యక్రమం ఇలా..

పదహారు నెలల కిందట పలు అవాంతరాల నడుమ మొదలైన ఒలింపిక్‌ జ్యోతి స్టేడియంలో ప్రవేశం, అనంతరం జ్యోతిని వెలిగించడం ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం. నాలుగు గంటలపాటు సాగే ప్రారంభోత్సవంలో జపాన్‌ జాతీయ గీతాలాపన, అతిథుల ప్రసంగం, అథ్లెట్ల పరేడ్‌, పావురాల ఎగురవేత, ఒలింపిక్స్‌ పతాక, గీతావిష్కరణ, క్రీడాకారుల ప్రమాణం ఉంటాయి.వెంటనే జపాన్‌ చక్రవర్తి నరుహిటో ఒలింపిక్స్‌ ప్రారంభమైనట్టు లాంఛనంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.


భారత్‌ నుంచి కొందరే..

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, శనివారంనాటి పోటీల కారణంగా మెజార్టీ భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నారు. 20 మంది అథ్లెట్లు, ఏడుగురు అధికారులే ఆరంభ వేడుకల్లో పాల్గొంటారు. షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, హాకీ ఆటగాళ్లు వేడుకల్లో భాగం కావడంలేదు. హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌  పతాకధారిగా వ్యవహరిస్తాడు. టీటీ స్టార్లు శరత్‌ కమల్‌, మనికా బాత్రా, ఫెన్సర్‌ భవానీ, జిమ్నాస్ట్‌ ప్రణతి, స్విమ్మర్‌ సాజన్‌ ప్రకాశ్‌, పతాకధారి మేరీకోమ్‌ సహా 8 మంది బాక్సర్లు, సెయిలర్లు కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి అనురాగ్‌ విషెస్‌ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఎంపీలు భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. 


సుశీల్‌ టీవీ చూడొచ్చు..

హత్య కేసులో తీహార్‌ జైలులో ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ టీవీ చూసేందుకు అధికారులు అనుమతిచ్చారు. జైలు కామన్‌ వార్డ్‌లో సుశీల్‌ టీవీ చూడొచ్చని అధికారులు తెలిపారు. ఒలింపిక్స్‌ తిలకించేందుకు టీవీ సౌకర్యం కల్పించాలని తన లాయర్‌ ద్వారా సుశీల్‌ కోర్టుకు విన్నవించాడు.

Updated Date - 2021-07-23T09:45:25+05:30 IST