హెడ్‌లేని చదువులు

ABN , First Publish Date - 2022-01-24T17:13:27+05:30 IST

పర్యవేక్షణ లేని బోధనలో పస ఉంటుందా? పాఠం విద్యార్థి బుర్రకెక్కదు! ఫలితంగా అభ్యసనం అంతా గందరగోళంగా సాగుతుంది. అందుకే.. తరగతి గదిలో ఉపాధ్యాయుడి బోధనను ప్రధానోప్యాయుడు పర్యవేక్షిస్తారు. స్కూల్లో బోధనాతీరును ఎంఈవోలు చూస్తారు.

హెడ్‌లేని చదువులు

ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు లేరు

బోధనపై పర్యవేక్షణ చేసేదెవరు? 

ఇంగ్లిషు మీడియం సక్సెస్‌ అవుతుందా?

స్కూళ్లలో 45% హెచ్‌ఎం పోస్టుల ఖాళీ

528 ఎంఈవో పోస్టుల్లో 520 ఖాళీగానే

డీఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులూ అంతే


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పర్యవేక్షణ లేని బోధనలో పస ఉంటుందా? పాఠం విద్యార్థి బుర్రకెక్కదు! ఫలితంగా అభ్యసనం అంతా గందరగోళంగా సాగుతుంది. అందుకే.. తరగతి గదిలో ఉపాధ్యాయుడి బోధనను ప్రధానోప్యాయుడు పర్యవేక్షిస్తారు. స్కూల్లో బోధనాతీరును ఎంఈవోలు చూస్తారు. మరి.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో బోధనాతీరుపై పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉండాలి? బోధన ఎలా సాగుతోంది.. పాఠాలు విద్యార్థులకు అర్థమవుతున్నాయా? అని పరిశీలించే అధికారులు ఉంటేనే కదా ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అర్థం.. అభ్యసనానికి సార్థకత! అయితే ఈ పర్యవేక్షణ  బాధ్యతను నిర్వర్తించేందుకు స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు లేరు. మండలాల పరిఽధిలో విద్యాధికారులూ (ఎంఈవో) లేరు. లక్షకు పైగా ఉపాధ్యాయులు, 26 లక్షలకు పైగా విద్యార్థులతో భారీ స్థాయిలో నడుస్తున్న విద్యాశాఖ బండి.. హెడ్‌మాస్టర్లు, ఎంఈవోలు అనే చక్రాలు సరిగా లేక పడుతూ లేస్తూ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఎంలు, ఎంఈవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీన్ని సవ్యంగా అమలు చేయడానికి వీలుగా అధికార వ్యవస్థ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెడితేనే ఇంగ్లిషు మీడియం నిర్ణయం విజయవంతమవుతుందనే వాదన ఉంది. 

 

528 పోస్టుల్లో 20 మందే.. 

రాష్ట్రంలో మొత్తం 4,379 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 2,423 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 1,956 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ రకంగా సుమారు 45 శాతం హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఈవో పోస్టుల్లో 95 శాతం పైగా ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 591 మండలాలుంటే 528 ఎంఈవో పోస్టులు ఉన్నాయి. ఇందులో 20 మంది అధికారులు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. మిగిలిన 508 పోస్టుల్లో ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. ఒక మండలానికి ఒక ఇన్‌చార్జ్‌ ఎంఈవో ఉన్న మండలాలు 85 మాత్రమే ఉన్నాయి. 8 మంది 5 మండలాల చొప్పున, 24 మంది నాలుగు మండలాల చొప్పున.. 59మంది 3 మండలాల చొప్పున, 87 మంది 2 మండలాల చొప్పున ఇన్‌చార్జిలుగా పర్యవేక్షిస్తున్నారు. ఒక అధికారైతే ఏడు మండలాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో జిల్లా విద్యాధికారుల (డీఈవో) పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, అదే స్థాయిలో డీఈవోలు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 7మందే  రెగ్యులర్‌ డీఈవోలుగా పనిచేస్తున్నారు. జిల్లాల సంఖ్య ఆధారంగా డీఈవో పోస్టులను ఇంకా మంజూరు చేయలేదు. రెగ్యులర్‌ డీఈవో పోస్టులు 12మాత్రమే ఉన్నాయి.


ఇందులో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 26జిల్లాల్లో డీఈవోలు లేక, ఆ బాధ్యతలను ఇంచార్జిలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డిప్యూటీ డీఈవో పోస్టులు 66 ఉండగా, ఆరుగురే పనిచేస్తున్నారు. 60 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రంలో 10డైట్‌ ప్రిన్సిపాల్స్‌ పోస్టులు ఉండగా 6 ఖాళీగా ఉన్నాయి. 70సీనియర్‌ లెక్చరర్‌ పోస్టులు ఉండగా, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అవుట్‌ పోర్సింగ్‌  సిబ్బంది, ఇన్‌చార్జిలతో నడిపిస్తున్నారు. తెలుగు మీడియం లెక్చరర్ల పోస్టులు 166ఉండగా, 152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉర్దూ మీడియం లెక్చరర్ల పోస్టులు 40 ఉండగా,  37  ఖాళీగా ఉన్నాయి.  

Updated Date - 2022-01-24T17:13:27+05:30 IST