No kissing zone: మా కాలనీలో ముద్దులు పెట్టుకోవద్దు ప్లీజ్

ABN , First Publish Date - 2021-08-02T13:18:18+05:30 IST

ముంబై హౌసింగ్ సొసైటీవాసుల వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతంలో జంటలు ఇకపై బహిరంగంగా ముద్దులు పెట్టుకోకూడదంటూ...

No kissing zone: మా కాలనీలో ముద్దులు పెట్టుకోవద్దు ప్లీజ్

ముంబై హౌసింగ్ సొసైటీవాసుల వినూత్న నిర్ణయం

ముంబై (మహారాష్ట్ర):ముంబై హౌసింగ్ సొసైటీవాసుల వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతంలో జంటలు ఇకపై బహిరంగంగా ముద్దులు పెట్టుకోకూడదంటూ ‘నో కిస్సింగ్ జోన్’ పేరిట సొసైటీ వాసులు బోర్డులు పెట్టారు. ముంబైలోని బోరివలి ప్రాంతంలోని సత్యం శివమ్ సుందరం సొసైటీ నివాసితులు తమ కాలనీలో ‘నో కిస్సింగ్ జోన్’ అని బోర్డు పెట్టడంతో ఆ సొసైటీ వార్తల్లోకెక్కింది.కొవిడ్ లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ప్రతీరోజూ సాయంత్రం 5 గంటల నుంచి జంటలు బైకులు, కార్లలో వచ్చి కాలనీలో సన్నిహితంగా ఉంటూ ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన సత్యం శివమ్ సుందరం సొసైటీ నివాసితులు తమ కాలనీని ‘నో కిస్సింగ్ జోన్’గా ప్రకటించి బోర్డులు ఏర్పాటు చేశారు.


‘‘మేం ముద్దులకు వ్యతిరేకం కాదు, కానీ మా కాలనీని మాత్రం కిస్సింగ్ జోన్ గా మార్చనివ్వం, ప్రారంభంలో మేం జంటలకు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవద్దు అని వివరించాం, కాని వారు వినలేదు, అందుకే మేం ‘నో కిస్సింగ్ జోన్’ గా ప్రకటించాం’’ అని కాలనీవాసులు ముక్తకంఠంతో చెప్పారు. ప్రారంభంలో తమ కాలనీలో జంటల వీడియోలను తీసి స్థానిక కార్పొరేటరుకు చూపించామని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడంతో తాము నో కిస్సింగ్ జోన్ గా ప్రకటించామని కాలనీవాసి కైలాసరావు దేశ్‌ముఖ్ చెప్పారు. 


తాము కిటికీల నుంచి బయటకు చూస్తే కాలనీ వీధుల్లో రోజూ జరిగే రొమాన్స్ చూసి విసిగిపోయామని, అందుకనే సొసైటీ ఛైర్మన్, సెక్రటరీలతో మాట్లాడి రోడ్డుపై నో కిస్సింగ్ జోన్ అంటూ పెయింటింగ్ చేయించామని కాలనీవాసులు చెప్పారు.ముంబై నగరంలో ‘నో పార్కింగ్‘, ‘ఉమ్మివేయ వద్దు‘, 'ధూమపానం చేయవద్దు’ లేదా ‘డ్రింకింగ్ జోన్’ అనేది సర్వసాధారణమని, అయితే ‘నో కిస్సింగ్ జోన్’ బోర్డు పెట్టడం తమకు కొత్త అని బోరివలిలోని సత్యం శివమ్ సుందరం సొసైటీ నివాసితులు వివరించారు.

Updated Date - 2021-08-02T13:18:18+05:30 IST