భూములున్నా... హక్కులేదన్నా!

ABN , First Publish Date - 2021-04-20T04:49:30+05:30 IST

జిల్లాలో అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1,57,105 ఎకరాలు నోషనల్‌ ఖాతాలోకి వెళ్లాయి. కొంతమంది రైతులు మ్యుటేషన్‌ పెడుతున్నా.. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. వన్‌-బీ, కానీ అడంగళ్‌ కానీ వెబ్‌ల్యాండ్‌లో కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు.

భూములున్నా... హక్కులేదన్నా!
నోషనల్‌ ఖాతాలోకి వెళ్లిన భూములు

జిల్లాలో నోషనల్‌ ఖాతాలోకి 1,57,105 ఎకరాలు
రైతు భరోసా, బీమాకు దూరమవుతున్న రైతులు
సమస్య పరిష్కరించని రెవెన్యూ అధికారులు
(మెళియాపుట్టి)

- టెక్కలి మండలం నర్సింగపల్లికి చెందిన మద్దిల అమాష.. అదే గ్రామ రెవెన్యూ పరిధిలో 80 సెంట్లు భూమి కొనుగోలు చేశారు. రిజిస్ర్టేషన్‌ సైతం చేయించారు. అధికారులు పాస్‌బుక్‌ ఇచ్చారు కానీ, భూమిపై హక్కు మాత్రం ఆ రైతుకు లేదు. దీంతో ప్రభుత్వ పథకాలు, రుణాలకు దూరమవుతున్నారు.
- జగన్నాథపురానికి చెందిన జి.పగడాలమ్మ.. నర్సింగపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 35.1బి లో 30 సెంట్లు, 35-1సి లో 43 సెంట్లు 20 ఏళ్ల కిందట కొనుగోలు చేశారు. ఈ భూములు ఐదేళ్ల కిందట నోషనల్‌ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో ఆమెకు రైతుభరోసా దక్కడం లేదు. బీమాతో పాటు బ్యాంకుల నుంచి రుణం కూడా అందడం లేదు.
..ఇలా జిల్లాలో అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1,57,105 ఎకరాలు నోషనల్‌ ఖాతాలోకి వెళ్లాయి. కొంతమంది రైతులు మ్యుటేషన్‌ పెడుతున్నా.. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. వన్‌-బీ, కానీ అడంగళ్‌ కానీ వెబ్‌ల్యాండ్‌లో కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పంటల బీమా కోసం వ్యవసాయ అధికారులు రైతుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్నారు. ఈ రైతుల్లో కొంతమంది భూములు నోషనల్‌ ఖాతాలోకి వెళ్లడంతో.. వాటి వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించడం లేదు. దీంతో భూములు ఉన్నా.. చాలామంది రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. ఏటా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా.. రెవెన్యూ అధికారులు తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. భూమిపై యాజమాన్య హక్కులను రెవెన్యూ అధికారులు పరిశీలించి రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తారు. రైతువారీగా ఖాతా తెరిచి... ఆ గ్రామంలో ఆయనకు ఉన్న భూములున్నీ కలిపి సర్వే నెంబర్ల వారీగా నమోదు చేస్తారు. ఏవైనా భూములు విక్రయిస్తే.. వాటికి సంబంధించిన సర్వే నెంబర్లను తొలగిస్తారు. భూములు కొనుగోలు చేసిన వారికి శాశ్వత ఖాతా నెంబర్‌ ఏర్పాటు చేసి.. పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తారు. వీటిని సరిచేయాలని వీఆర్వోల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూముల విలువను బట్టి.. డబ్బులు చెల్లిస్తే కానీ, రెవెన్యూ అధికారులు ‘మ్యుటేషన్‌’ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

 నోషనల్‌ ఖాతాలోకి ఇలా..  


ప్రభుత్వ భూములకు పాస్‌ పుస్తకాలు ఉండవు. వీటిని అధికారులు నోషనల్‌ ఖాతాలో నమోదు చేస్తారు. డొంకలు, పోరంబోకు, చెరువులు, రైల్వే భూములు, ప్రభుత్వ విద్యా సంస్థలు, కాలిబాటలు, రహదారులు, శ్మశానాలు, బందెర రోడ్లు ఇలా ప్రభుత్వ భూములన్నీ వర్గీకరణల వారీగా రికార్డుల్లో పొందుపరుస్తారు. రైతుల పేరిట హక్కుపత్రాలు లేని పట్టా భూములు, వివాదాల్లో ఉన్న స్థలాలను నోషనల్‌ ఖాతాలో తాత్కాలికంగా నమోదు చేస్తారు. రైతులు ఆ భూములు తమవి అని తగిన ఆధారాలు చూపిస్తే.. రెవెన్యూ అధికారులు సర్వే చేసి వాటిని పరిశీలించి యాజమాన్య హక్కులు కల్పిస్తారు. దీంతో పాటు శాశ్వత పట్టా సంఖ్య కేటాయించి.. నోషనల్‌ ఖాతా నుంచి వాటిని తొలగిస్తారు.

 సర్వే చేసి హక్కులు కల్పిస్తాం

నోషనల్‌ ఖాతాలోకి వెళ్లిన భూములను పరిశీలిస్తున్నాం. అన్ని పత్రాలూ సమర్పించిన రైతుల వివరాలను సేకరిస్తున్నాం. వారి భూములకు సంబంధించి మ్యుటేషన్‌ చేయాలని సిబ్బందికి ఆదేశించాం. సచివాలయ సర్వేయర్లు ద్వారా సర్వే చేసి.. రైతుల వద్ద  ఉన్న పత్రాలు పరిశీలిస్తాం. నోషనల్‌ ఖాతా నుంచి ఆ భూములను తొలగించి రైతులకు హక్కులు కల్పిస్తాం. రైతులు ఎవరైనా ఇబ్బందులు పడితే.. మ్యుటేషన్‌ చేసుకోవాలి.
- జి.అప్పలసూర్యనారాయణ, తహసీల్దార్‌, మెళియాపుట్టి 

Updated Date - 2021-04-20T04:49:30+05:30 IST