నో లాక్‌డౌన్‌.. అది చివరి అస్త్రం కావాలి: మోదీ

ABN , First Publish Date - 2021-04-21T09:00:50+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంపై తుఫానులా విరుచుకుపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. తొలి వేవ్‌ నుంచి కోలుకుంటున్న తరుణంలోనే ప్రమాదకరమైన సెకండ్‌ వేవ్‌ ఉప్పెనలా వచ్చి పడిందని చెప్పారు. మహమ్మారిపై పోరులో స్వీయ క్రమశిక్షణ అత్యవసరమని,

నో లాక్‌డౌన్‌.. అది చివరి అస్త్రం కావాలి: మోదీ

  • -దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడుకోవాలి
  • -ప్రజారోగ్యంతో పాటు.. ఆర్థిక వ్యవస్థ
  •  ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి
  • -వలస కార్మికులూ ఆందోళన వద్దు
  • -తుఫానులా సెకండ్‌ వేవ్‌ 
  • -స్వీయ క్రమశిక్షణతోనే గెలుపు
  • -అనవసరంగా బయటకు రావద్దు
  • -జాతినుద్దేశించి మోదీ ప్రసంగం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంపై తుఫానులా విరుచుకుపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. తొలి వేవ్‌ నుంచి కోలుకుంటున్న తరుణంలోనే ప్రమాదకరమైన సెకండ్‌ వేవ్‌ ఉప్పెనలా వచ్చి పడిందని చెప్పారు. మహమ్మారిపై పోరులో స్వీయ క్రమశిక్షణ అత్యవసరమని, ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ప్రధాని ప్రసంగంలో దేశంలో తక్షణమే లాక్‌డౌన్‌ ఏమీ ఉండదని, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని స్పష్టం చేశారు. ‘‘మనం లాక్‌డౌన్‌ లేకుండా చూసుకోవాలి. సమష్టిగా పనిచేస్తే కట్టడి ప్రాంతాలు, లాక్‌డౌన్‌ అవసరమే రాదు. లాక్‌డౌన్‌ను కేవలం చివరి అస్త్రంగానే వాడుకోవాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మన దృష్టంతా సూక్ష్మ కట్టడి ప్రాంతాలపైనే ఉండాలి. దేశ ప్రజల ఆరోగ్యంతో పాటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్నీ కాపాడాలి’’ అని మోదీ అన్నారు. ప్రభుత్వాల ప్రయత్నాలన్నీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకేనని చెప్పారు. అదేసమయంలో ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధిపై సాధ్యమైనంత తక్కువ ప్రభావం ఉండేలా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. వలస కార్మికులు ఎక్కడి వారక్కడే ఉండాలని, వారి జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పౌరులు, ముఖ్యంగా యువత ముందడుగు వేయాలని కోరారు. అప్పుడు లాక్‌డౌన్‌ అన్న ప్రశ్నే ఉత్పన్నమవదని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తమ ప్రభుత్వం చేపడుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘‘ఇవ్వాళ నవరాత్రి చివరి రోజు. రేపు రామ నవమి. పురుషోత్తముడైన రాముడు క్రమశిక్షణతో ఉండాలని మనకి సందేశం ఇచ్చాడు. ఇక రంజాన్‌ మాసంలో ఏడో రోజు వచ్చింది. ఈ పండగ కూడా మనకు సహనం, క్రమశిక్షణ గురించే చెబుతుంది. కొవిడ్‌పై పోరుకు కూడా ఓర్పు, క్రమశిక్షణే అవసరం’’ అని మోదీ పేర్కొన్నారు.


గడిచిన కొన్ని రోజులుగా వైర్‌సతో ప్రాణాలొదిలిన వారి కుటుంబ సభ్యుల బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. మనముందున్నది పెను సవాలేనని.. దీన్ని సంకల్పం, ధైర్యం, సన్నద్ధతతో అధిగమించాలని మోదీ సూచించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడిందన్నారు. దీన్ని తట్టుకొని, ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆస్పత్రులు ఆక్సిజన్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆక్సిజన్‌ అందజేయాలంటూ కేజ్రీ సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోదీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీలు ఆక్సిజన్‌ను అందించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాల్లో కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, పారిశ్రామిక ఆక్సిజన్‌ను వైద్యానికి వినియోగించడం, ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇలా అన్ని చర్యలూ చేపడుతున్నట్లు వివరించారు. ప్రధాని సందేశాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. కొవిడ్‌పై పోరులో వలస కార్మికులు సహా అన్ని వర్గాల వారికి స్పష్టమైన హామీ ఇచ్చారని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కొనియాడాయి. 


ఉత్పత్తి పెంచండి.. అండగా ఉంటాం

దేశంలో సాధ్యమైనంత తక్కువ సమయంలో అందరికీ టీకాలు వేయాలని, అందుకోసం వీలైనంత ఎక్కువగా టీకాలను ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ తయారీదారులను కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న టీకా తయారీదారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచే విషయంలో ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర అన్నారు. 


ఉత్త మాటలే.. ఏం లేదు: కాంగ్రెస్‌ 

ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కరోనాపై పోరాటాన్ని ప్రజలకే వదిలేశారని ఆరోపించింది. ఆయన ప్రసంగంలో ఉత్త మాటలు తప్ప ఏమీ లేదని ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో విషయం ఏమీ లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకు సలహాలివ్వడమే తప్ప ప్రధానిగా ఆయన తన బాధ్యతలను విస్మరించారని.. దేశాన్ని కాపాడే బాధ్యత స్వచ్ఛంద సంస్థలు, యువతదేనని చెప్పారని మండిపడ్డారు. 


ప్రజలకు మళ్లీ భరోసా ఇచ్చారు: బీజేపీ

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న వేళ జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపిందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పారు. కరోనాపై పోరులో క్రమశిక్షణే ముఖ్యమని, లాక్‌డౌన్‌ అన్నది చివరి ఆయుధమేనని చెప్పడం ద్వారా దేశ ప్రజలకు మళ్లీ భరోసా కల్పించారని కొనియాడారు. క్రమశిక్షణ, ఓర్పు అవసరమని స్పష్టం చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యంతోనే  సమస్యను అధిగమించగలమని ప్రధాని స్పష్టం చేశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుతామని మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారని మరో నేత గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. ప్రజలంతా స్వీయ క్రమశిక్షణ పాటించాలని, వైర్‌సపై సమష్టిగా పోరాడాలని మోదీ స్పష్టం చేశారని బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-04-21T09:00:50+05:30 IST