Lockdown ఆలోచనే లేదు: Cm

ABN , First Publish Date - 2021-11-30T17:53:41+05:30 IST

ప్రపంచంలోని పలుదేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. తుమకూరు సిద్దగంగ మఠంలో కా

Lockdown ఆలోచనే లేదు: Cm

- ఒమైక్రాన్‌ వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు

- విద్యాసంస్థలు యథాతథం : మంత్రి బీసీ నాగేష్‌  

- రాజధానిలో జోరుగా కరోనా వైద్యపరీక్షలు 

- ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దు: మంత్రుల వినతి 


బెంగళూరు: ప్రపంచంలోని పలుదేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. తుమకూరు సిద్దగంగ మఠంలో కార్తీక సోమవారం లక్ష బిల్వార్చన పూజల్లో ఆయన పాల్గొన్నారు. మఠాధిపతి శివకుమారస్వామిజీ సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒమైక్రాన్‌ వైరస్‌ రాష్ట్రంలో ఎవరికీ సోకలేదన్నారు. ఆఫ్రికన్‌ దేశాల నుంచి వచ్చినవారిపై నిఘా కొనసాగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు ఉండవని ప్రత్యేకించి లాక్‌డౌన్‌ ప్రస్తావన లేదన్నారు. మొదటి, రెండో విడతల్లో కేసులు పెరిగాక అదుపు తప్పిన సందర్భంలో లాక్‌డౌన్‌ కొనసాగిందని ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఒమైక్రాన్‌ ప్రబలిన దేశాల నుంచి విమాన సర్వీసులను నిషేధించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామని ముఖ్యమంత్రి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే శనివారం వైద్యనిపుణులతో సమీక్ష జరిపామని, మంగళవారం మరోసారి భేటీ కానున్నామని అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు కట్టుబడ్డామన్నారు. బెంగళూరులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికీ ఒమైక్రాన్‌ వైరస్‌ సోకలేదన్నారు. ప్రజలను దారి తప్పించేలా లాక్‌డౌన్‌ ఉంటుందనే ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను చైతన్యపరచాలిగానీ కొత్త భయాలను కలిగించరాదన్నారు. ఆఫ్రికన్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్‌ సోకడంతో క్వారంటైన్‌లో ఉంచామన్నారు. వీరిలో 63 ఏళ్ల వ్యక్తికి భిన్నమైన వైరస్‌ ప్రబలిందని, అది డెల్టా వైరస్‌ లాంటిది కాదన్నారు. శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. కేంద్ర ఆరోగ్య సంస్థ ఐసీఎంఆర్‌తో నిరంతరంగా చర్చలు జరుపుతున్నామన్నారు. మరో రెండు రోజుల్లో శాంపిల్స్‌కు సంబంధించి ఫలితాలు రానున్నాయన్నారు. విద్యాశాఖమంత్రి బీసీ నాగేశ్‌ తుమకూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో విడత కొవిడ్‌కు కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు బంద్‌ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ తీవ్రత పెరిగితే సాంకేతిక సలహా కమిటీ నిర్ణయం మేరకు అమలు చేస్తామన్నారు. ప్రస్తుతానికి విద్యాసంస్థలలో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చిన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ నియంత్రణా చర్యలు కట్టుదిట్టం చేశామన్నారు. రెండు నెలలపాటు విద్యాసంస్థలలో సాంస్కృతిక, ఇతరత్రా కార్యక్రమాలు పూర్తిగా నిషేధించామన్నారు. బెంగళూరు పరిధిలో విద్యాసంస్థలలో తరగతులు మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్టు బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త తెలిపారు. 


రాజధానిలో జోరుగా కరోనా వైద్యపరీక్షలు 

రాజధాని బెంగళూరులో కొవిడ్‌ టెస్టింగ్‌లు ఒక్కసారిగా పెంచారు. ఇటీవలి కాలంలో వ్యాక్సిన్‌లకు ప్రాధాన్యత ఇచ్చిన వైద్య ఆరోగ్యశాఖ కొత్త వైరస్‌ ప్రచారంతో టెస్టింగ్‌లను పెంచదలిచింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాలలో టెస్టింగ్‌లు కొనసాగించారు. జనకూడళ్లు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లతోపాటు ప్రతిచోటా టెస్టింగ్‌లు కొనసాగాయి. బసవనగుడిలో సాగిన శనక్కాయల పరుషలోనూ కొవిడ్‌ టెస్టింగ్‌లు నిర్వహించారు. 

Updated Date - 2021-11-30T17:53:41+05:30 IST