ఐసీయూ ఉన్నా.. అందని సేవలు

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

అత్యవసర రోగులకు వైద్య సేవలు అందించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినా.. అత్యవసర వైద్య సేవలు పడకేసిన వైనం ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

ఐసీయూ ఉన్నా.. అందని సేవలు
ఉట్నూర్‌లోని సివిల్‌ ఆస్పత్రి

ఉట్నూర్‌, మే 9: అత్యవసర రోగులకు వైద్య సేవలు అందించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినా.. అత్యవసర వైద్య సేవలు పడకేసిన వైనం ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఉట్నూర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేసిన రోగులకు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఫలితంగా ఉట్నూర్‌ ఆస్పత్రి నుంచి రిమ్స్‌కు, నిమ్స్‌కు తరలిస్తున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. 2018 జనవరి 21న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఐసీయూని ప్రారంభించారు. త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రులు ప్రకటించినా నేటికి అందుబాటులోకి రాలేదు. ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌ మండలాలతో పాటు కుమ్రం భీం జిల్లాలోని జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల నుంచి వైద్యం కోసం ఉట్నూర్‌ ఆస్పత్రికి రోగులు తరలి వస్తుంటారు. ఏజెన్సీలోని రెండు జిల్లాల పరిదిలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా ముందుగా ఉట్నూర్‌ ఆస్పత్రికి తెచ్చి ప్రథమ చికిత్సలు అందించిన అనంతరం జిల్లా కేంద్రంతో పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని యావత్‌మాల్‌, హైదరాబాద్‌ లాంటి నగరాలకు రోగులను అత్యవసర వైద్యం కోసం తరలిస్తుంటారు. ఉట్నూర్‌ ఆస్పత్రిలో రూ. కోటి  రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన అత్యవసర విభాగంలో ఆదునిక యంత్రాలు, వ్యాధి నిర్ధారణ పరీక్ష పరికరాలను సమకుర్చారు. హృదయ సంబంధిత వ్యాధి గ్రస్తుల కోసం అత్యవసర వేళల్లో అవసరమైన కృత్రిమశ్వాస అందించే వెంటిలేటర్‌, గుండెను తట్టిలేపే పరికరం, ఈసీజీ,  రోగివద్దకే వెళ్లి ఎక్స్‌రేలను తీసే యంత్రాలను సమకూర్చారు. అదే కాకుండా రోగుల కోసం నాణ్యమైన గదులతో పాటు పడకలను ఉంచారు. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఐసీయూకి కావాల్సిన డాక్టర్లు, వైద్య సిబ్బంది లేక పోవడంతో ఐసీయూ సేవలు రోగులకు అందకుండ పోతున్నాయి. ఇప్పటికైనా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఉట్నూర్‌ ఆస్పత్రిలోని ఐసీయూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST