ఇకపై కరోనా మరణాలు ఉండొద్దు

ABN , First Publish Date - 2021-05-14T05:32:26+05:30 IST

ఇకపై కరోనా మరణాలు ఉండొద్దు

ఇకపై కరోనా మరణాలు ఉండొద్దు
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

  • షాద్‌నగర్‌లో 30 ఆక్సిజన్‌ పడకలు, 3 ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు 
  • రెండురోజుల్లో కొత్తగా ఐదుగురు వైద్యుల నియామకం 
  • కరోనాపై మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఉన్నతస్థాయి సమీక్ష 

షాద్‌నగర్‌: ఇకపై కరోనా మరణాలు ఉండొద్దని, కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రభుత్వ వైద్యులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కరోనా మరణాలు ఉండకుండా చూడాలని కోరారు. కరోనా పేషెంట్లకు సదుపాయాలు కల్పించే క్రమంలో షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో మూడు ఐసోలేషన్‌ కేంద్రాలతో పాటు రెండు రోజుల్లో కొత్తగా ఐదుగురు వైద్యులను నియమిస్తామని చెప్పారు. రెమిడిసివిర్‌ మందులు, ఆక్సిజన్‌ పరికరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పాల్గొన్నారు. 

కొవిడ్‌ రోగుల వద్దకే వైద్యులు 

పది మంది కొవిడ్‌ బాధితులుంటే ఆ గ్రామాన్ని ప్రభుత్వ వైద్యులు సందర్శించి వైద్యం అందించాలని సూచించారు. షాద్‌నగర్‌ పట్టణానికి దూరంగా కరోనా బాధితులను ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించే బాధ్యత ప్రభుత్వ వైద్యులదేనని స్పష్టం చేశారు. కాగా కొవిడ్‌ బాధితుల పరిస్థితి విషమిస్తే వారిని ప్రభుత్వ, లేదా ప్రైవేటు అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచే ప్రసక్తే లేదని శ్రీనివా్‌సగౌడ్‌ స్పష్టం చేశారు.  టెస్టుల సంఖ్య పెంచితే జనం గుంపులుగా వస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైద్యులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. 

కొవిడ్‌ టెస్టులపై ఎమ్మెల్యే అసంతృప్తి 

కొవిడ్‌ టెస్టులు, వైద్యం సహాయంపై షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్‌ పరీక్షల సంఖ్య పెంచాలని మంత్రిని కోరారు. అలాగే కిట్ల కొరత ఉందని, బాధితులకు సరైన వైద్యం అందడం లేదని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇక్కడ అంతా బాగుందని అసహనం వ్యక్తం చేస్తూ కరోనా టెస్ట్‌ల గురించి మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని మంత్రి ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే ఆయనకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోన్‌ చేసి మంత్రికి మొబైల్‌ ఇచ్చారు. సదరు వ్యక్తి టెస్ట్‌లు, వైద్యం గురించి మంత్రికి ఫిర్యాదు చేయడంతో మంత్రి మిన్నకుండిపోయారు. 

పొంతన లేని సమాధానాలు 

మంత్రి అడిగిన ప్రశ్నలకు వైద్యశాఖ అధికారులు పొంతన లేని సమాధానం ఇస్తుండటంతో మంత్రి ఒకింత అసహనానికి గురయ్యారు. అంబులెన్స్‌లు ఎన్ని ఉన్నాయి? అందుబాటులో ఆక్సిజన్‌ సిలిండర్లు ఎన్ని ఉన్నాయి? ప్రభత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ ఉన్నాయి? వెంటిలేటర్ల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు వైద్య అధికారులు మంత్రికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ విషయాలన్నిటీ తెలుసుకుని తనకు సమాచారం అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వోను మంత్రి ఆదేశించారు. 

వైద్యాధికారిపై కలెక్టర్‌ ఆగ్రహం

కాగా ఆసుపత్రి  విషయమై సూపరింటెండెంట్‌ సమావేశంలో పాల్గొనకపోయడంతో కలెక్టర్‌ పలు ప్రశ్నలు అడుగుతుండగా షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో టి. దామోదర్‌ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వెంటనే షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

Updated Date - 2021-05-14T05:32:26+05:30 IST