ఇక పండగే !

ABN , First Publish Date - 2020-09-20T08:44:39+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత క్రీడా వినోదం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ సీజన్‌ శనివారం రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది.

ఇక పండగే !

 ఐపీఎల్‌ ప్రారంభంతో బెట్టింగ్‌ రాయుళ్లలో హుషారు

 రహస్య స్థావరాల్లోకి బుకీలు

 ఆన్‌లైన్‌లోనే కుర్రకారు బెట్టింగ్‌ 

 యాప్‌ల మాయాజాలంతో చిత్తవుతున్న యువత

 బెట్టింగ్‌ను పోలీసులు ఆపేరా ? 


అనంతపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత క్రీడా వినోదం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ సీజన్‌ శనివారం రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఇది క్రికెట్‌ ప్రేమికులకే కాక బుకీలు, బెట్టింగ్‌రాయుళ్లకు కూడా ఉత్సాహం కలిగించింది. తొలిరోజు నుంచే బెట్టింగ్‌కు తెరలేపారు. గతంలో లాడ్జిలు, రిసార్ట్‌లలో గదులను అద్దెకు తీసుకుని  బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగించేవారు.


పట్టణ ప్రాంతాల్లో ఏదో చివరి కాలనీల్లో జనసంచారం పెద్దగా లేని శివారు ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని బెట్టింగ్‌ నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పోలీసుల దాడులు అధికంగా  ఉంటాయని గ్రహించిన బుకీలు, బెట్టింగ్‌ నిర్వాహకులు ఆ ప్రాంతాలను వీడి రహస్య స్థావరాల్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం.


దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచులు జరుగనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన సరంజామ సర్దుకుని మకాంను గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు మార్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పోలీసుల దృష్టి పెద్దగా ఉండదనే క్రమంలోనే బుకీలు, బెట్టింగ్‌ నిర్వాహకులు వ్యవసాయ క్షేత్రాలను ఎంచుకున్నట్లు సమాచారం.  గతంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచుల్లో జిల్లాలో ప్రతిరోజూ రూ. ఐదారు కోట్లకుపైబడి బెట్టింగ్‌ జరిగినట్టు సమాచారం. తాజా ఐపీఎల్‌లో ఆ ప్రభావం మరింత అధికంగా కనిపించే అవకాశాలున్నాయనే అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్త మవుతోంది. 


హిందూపురం, ధర్మవరం, కదిరి, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు పట్టణాల్లోనే క్రికెట్‌ బెట్టింగ్‌లు అధికంగా జరుగుతుంటాయి. ఇందుకు గతంలో జరిగిన అరెస్టులే నిదర్శనం. బడా బుకీలుగా చెలామణిలో ఉన్న 13 మందిని జిల్లా పోలీసు యంత్రాంగం అరెస్టు చేసి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే.


ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు కేంద్రాలుగా బెట్టింగ్‌లు నిర్వహించే బడా బుకీలతో జిల్లాకు చెందిన బుకీలు, బెట్టింగ్‌ నిర్వాహకులకు సంబంధాలు ఉన్నాయన్నది గతంలోనే పోలీసు విచారణలో వెలుగుచూసింది. బుకీలు, బెట్టింగ్‌ నిర్వాహకులు పట్టుబడినప్పుడల్లా పోలీసు, రాజకీయ నాయకులతో వారికి గల సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. ఆ క్రమంలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బందిపైనా వేటు పడింది. ఈ నేపథ్యంలో... పోలీసు నిఘా నుంచి బయటపడేందుకుగానూ... బుకీలు, బెట్టింగ్‌ నిర్వాహకులు వారి వారి స్వస్థలాలను వీడి రహస్య స్థావరాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.


 

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ ఊబిలోకి కుర్రకారు..

క్రికెట్‌కు యువతలో ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకున్న బుకీలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకుంటున్నారు.  ఈ క్రమంలోనే  బెట్‌365, బెట్‌వీ, స్పోర్ట్స్‌ బెట్టింగ్‌, బెట్‌ ప్లేయర్‌, డ్రీమ్‌ఏ11, మైటీమ్‌, ఇండస్‌ గేమ్స్‌, మైటీమ్‌11, 1ఎక్స్‌బెట్‌ వంటి యాప్‌లను క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతి ఒక్క యువకుడి చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉండటం, పోలీసుల నుంచి ఎలాంటి బెడద లేకపోవడంతోనే కుర్రకారు ఈయాప్‌ల ద్వారా బెట్టింగ్‌ ఊబిలోకి దిగుతోంది.


గూగూల్‌ పే, మై మనీ, బీమ్‌, ఫోన్‌పేల ద్వారా బెట్టింగ్‌ సొమ్ము చెల్లించే సౌలభ్యం ఉండటంతో క్రికెట్‌ బెట్టింగ్‌ మత్తులో యువత చిత్తవుతోంది.  మైటీమ్‌11, డ్రీమ్‌ఏ11, మైటీమ్‌ యాప్‌ల ద్వారా నిర్వాహకులు సరికొత్త మాయాజాలానికి తెరతీశారు. ఆ యాప్‌లలో ఎంట్రీకి రూ. 35 నుంచి రూ. 50 వరకూ ఫీజు చూపిస్తూ బెట్టింగ్‌ మాయలోకి దింపుతున్నారు. ప్రైజ్‌మనీ రూ.కోట్లలో చూపుతుండటంతో ఎక్కువ మంది యువత చేరుతూ జేబులు ఖాళీ చేసుకుని అప్పుల పాలవుతున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో దడ మొదలవుతోంది.


బెట్టింగ్‌కు అలవాటు పడి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటారన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. బెట్‌365, బెట్‌వీ, స్పోర్ట్స్‌ బెట్టింగ్‌, బెట్‌ ప్లేయర్‌, 1ఎక్స్‌బెట్‌ యాప్‌ల ద్వారా ఐపీఎల్‌లో జరిగే ప్రతి మ్యాచులో టాస్‌ నుంచి బంతి బంతికి... ఓవర్‌ ఓవర్‌కు, వికెట్‌ టు వికెట్‌, ఫలానా జట్టు గెలుస్తుందని ఇలా ప్రతి అంశంపై బెట్టింగ్‌ కాసే వెసులుబాటు ఆ యాప్‌ల ద్వారా లభిస్తోంది. ఈ వికృత క్రీడ ద్వారా సామాన్యులు నష్టపోతుండగా బెట్టింగ్‌ నిర్వాహకులు, బుకీలు  కమీషన్లతో లాభాలు అర్జిస్తూ కుబేరులవుతున్నారు. 


 పోలీసుల చర్యలు నిలువరించేనా...?

జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో బెట్టింగ్‌ అధికంగా జరుగుతోంది...? ఏ ఏ పట్టణాల్లో బుకీలు, నిర్వాహకుల విడిది ప్రాంతాలున్నాయి...? గతంలో బెట్టింగ్‌ నిర్వహిస్తూ... ఎవరెవరు పట్టుబడ్డారు..? ప్రస్తుతం వారు బెట్టింగ్‌ నుంచి దూరంగా ఉన్నారా...? లేదా..? అనేది జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎరుకే. గతంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచుల సందర్భంగా జిల్లాలో విచ్చలవిడిగా బెట్టింగ్‌ జరిగింది. మ్యాచులు జరిగినన్నాళ్లు.... ఏదో ఒక ప్రాంతంలో బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్‌ మ్యాచుల్లో బెట్టింగ్‌ను నిలువరించే దిశగా పోలీసు చర్యలు ఏ విధంగా ఉంటాయోనన్నది వేచి చూడాల్సిందే. ఈ ఏడాది ఆఖరు వరకూ టి-20 క్రికెట్‌ మ్యాచులు జరుగనున్నాయి. నవంబరు మొదటివారంలో ఐపీఎల్‌ ముగుస్తుంది. ఆ తరువాత పీపీఎల్‌(పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌) డిసెంబరు మొదటి వారంలో ముగియనుంది. ఆ తరువాత బీబీఎల్‌ (బిగ్‌బాష్‌ లీగ్‌) మ్యాచులు ఉన్నాయి. అంటే ఈ ఏడాది ఆఖరు వరకూ క్రికెట్‌ ఫీవరే. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లు జోరుగా సాగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఈ క్రమంలో పోలీసు నిఘా పెంచి బెట్టింగ్‌ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.  

Updated Date - 2020-09-20T08:44:39+05:30 IST