ఏప్రిల్‌ 15 వరకు ఆటల్లేవ్‌!

ABN , First Publish Date - 2020-03-20T08:46:51+05:30 IST

శంలో వచ్చేనెల 15 వరకు టోర్నమెంట్లు, సెలెక్షన్‌ ట్రయల్స్‌ను నిర్వహించకూడదని ఆయా క్రీడా సమాఖ్యలను...

ఏప్రిల్‌ 15 వరకు ఆటల్లేవ్‌!

  • క్రీడా శాఖ ఆదేశం
  • ఆ తర్వాతే ఐపీఎల్‌ భవితవ్యం కూడా


న్యూఢిల్లీ: దేశంలో వచ్చేనెల 15 వరకు టోర్నమెంట్లు, సెలెక్షన్‌ ట్రయల్స్‌ను నిర్వహించకూడదని ఆయా క్రీడా సమాఖ్యలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈమేరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్ఎఫ్), బీసీసీఐలకు లేఖ రాసింది. దీంతో శుక్రవారం పటియాలలో జరగాల్సిన భారత గ్రాండ్‌ ప్రీ అథ్లెటిక్స్‌ పోటీలు వాయిదా పడ్డాయి. అలాగే ఒలింపిక్‌ శిక్షణ శిబిరంలో ఉన్నవారిని ఎవరూ కలుసుకోవడానికి వీల్లేదని పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ‘క్వారంటైన్‌ ప్రొటోకాల్‌ పాటించకుండా బయటి నుంచి వచ్చే కోచ్‌లు, సహాయక సిబ్బంది తదితరులు ట్రైనీ అథ్లెట్లను కలుసుకోరాదు. వారిని సురక్షితంగా ఉంచే విషయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. జనాలు పెద్ద ఎత్తున గుమిగూడడం నిషిద్ధం. అయితే ఒలింపిక్‌కు అర్హత సాధించినవారు లేదా బెర్త్‌ అవకాశానికి దగ్గరగా ఉన్నవారి విషయంలో దీన్ని మినహాయించాం. ఎందుకంటే వారు శిక్షణను కోల్పోతే టోక్యో గేమ్స్‌ సన్నాహకాలకు గట్టి దెబ్బ తగులుతుంది’ అని క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. 


ఆ అథ్లెట్లు క్వారంటైన్‌లకే..

కరోనా ప్రభావిత దేశాల నుంచి భారత్‌కు వచ్చిన అథ్లెట్లను నేరుగా క్వారంటైన్లకు తరలిస్తామని క్రీడా మంత్రి రిజిజు స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీల నుంచి వచ్చిన వారు కేంద్ర మార్గదర్శకాలను పాటించాల్సిందేనన్నారు. విదేశాలనుంచి ఎవరు వచ్చినా కేంద్ర ఆదేశాలను పాటిస్తున్నారని, అథ్లెట్లు ఇందుకు మినహాయింపు కాదని తేల్చారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న చెస్‌ దిగ్గజం ఆనంద్‌ అక్కడే స్వీయ నిర్బంధంలో ఉండగా.. యూర్‌పలో తమ శిక్షణను ఆపేసి భారత్‌కు వచ్చిన వినేశ్‌ ఫొగట్‌, నీరజ్‌ చోప్రా కూడా కరోనా రిపోర్టులో నెగెటివ్‌ వచ్చినా క్వారంటైన్‌లో ఉన్నారు. 


ఐపీఎల్‌ గురించి తేలేది 15 తర్వాతే..

ఐపీఎల్‌ భవితవ్యం కూడా వచ్చే నెల 15నే తేలుతుందని మంత్రి రిజిజు తెలిపారు. ‘15తర్వాతే కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. క్రికెట్‌ ఒలింపిక్‌ క్రీడ కాదు. దీన్ని బీసీసీఐ చూసుకుంటుంది. అయితే, క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం వేలాదిమంది వస్తుంటారు. కాబట్టి వారి ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం’ అని రిజిజు అన్నారు.

Updated Date - 2020-03-20T08:46:51+05:30 IST