సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వ అక్కర్లేదు

ABN , First Publish Date - 2020-03-12T07:08:32+05:30 IST

ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ కాలపరిమితులు కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేటు.....

సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వ అక్కర్లేదు

  • ఎస్‌బీఐ నిర్ణయం.. 44. 51 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం
  • పొదుపు ఖాతా వడ్డీ రేటు 3 శాతానికి కుదింపు..
  • ఎఫ్‌డీ రేట్లు, ఎంసీఎల్‌ఆర్‌ తగ్గింపు


ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ కాలపరిమితులు కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేటు, నిధుల వ్యయ ఆధారిత వడ్డీ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)ను తగ్గించింది. సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపైనా వడ్డీ రేటులో కోత విధించింది. సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయడమేకాకుండా, ఎస్‌ఎంఎస్‌లపై త్రైమాసిక చార్జీలను తొలగించింది. ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఆటో తదితర రుణాలు మరింత చవకగా లభించనున్నాయి. 


పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ అవసరాన్ని తొలగించడం వల్ల మధ్యతరగతి, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. వారి జీవనం మరింత సులభతరం అవుతుంది. 

- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 


ఎస్‌బీ ఖాతాల్లో కనీస నిల్వ కలిగి ఉండాలన్న నిబంధనను ఎస్‌బీఐ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం సమ్మిళిత బ్యాంకింగ్‌ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా పేదవారికి ప్రయోజనం కలుగుతుంది. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని ఎంతో బలోపేతం చేస్తుంది. 

- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ


 రుణాలపై వడ్డీ రేట్లు 

 నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను ఎస్‌బీఐ తగ్గించింది. ఈ తగ్గింపు వివిధ కాలపరిమితులను బట్టి 0.15 శాతం వరకు ఉంది. ఇది మార్చి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు బుధవారంనాడు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా పదోసారి ఎస్‌బీఐ తన ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం విశేషం. ఏడాది కాలానికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ను 7.85 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గించారు. ఓవర్‌నైట్‌, నెల రోజుల ఎంసీఎల్‌ఆర్‌ను 0.15 శాతం చొప్పున తగ్గించడంతో ఇది 7.45 శాతానికి చేరుకుంది. రెండేళ్లు, మూడేళ్ల కాలానికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ను 0.10 శాతం తగ్గించారు. దీంతో ఈ వడ్డీ రేట్లు వరుసగా 7.95 శాతం, 8.05 శాతానికి చేరాయి. 


సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటు తగ్గింపు

ఎస్‌బీఐ అన్ని సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాల (ఎస్‌బీ)పై వడ్డీ రేటును హేతుబద్దీకరించింది. ఈ మేరకు వార్షిక వడ్డీ రేటును సమాన స్థాయిలో 3 శాతానికి తగ్గించింది. దీని వల్ల 44.51 కోట్ల మంది ఖాతాదారుల వడ్డీ ఆదాయంపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం రూ.లక్ష వరకు డిపాజిట్లు కలిగిన ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది. రూ.లక్ష దాటిన డిపాజిట్లపై వడ్డీ రేటు 3 శాతంగా అమలవుతోంది. 


తప్పిన జరిమానాల భారం

ఖాతాదారులు తమ పొదుపు ఖాతాల్లో ఉంచవలసిన నెలవారీ సగటు నిల్వ (ఏఎంబీ) నిబంధనను ఎస్‌బీఐ ఎత్తివేసింది. దీని వల్ల 44.51 కోట్ల మంది సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పటివరకు మెట్రో నగరాల్లో ఎస్‌బీఐ కస్టమర్లు తమ ఖాతాలో కనీస నిల్వ రూ.3,000, సెమీ అర్బన్‌ కస్టమర్లు రూ.2,000, గ్రామీణ కస్టమర్లు రూ.1,000 కలిగి ఉండాలి. నెలవారీగా సగటు నిల్వ లేని పక్షంలో కస్టమర్లకు రూ.5 నుంచి రూ.15 వరకు బ్యాంకు జరిమానా విధిస్తూ వచ్చింది. దీనిపై పన్నును కూడా వసూలు చేసింది. అంతేకాకుండా త్రైమాసిక ఎస్‌ఎంఎస్‌ చార్జీలను కూడా ఎత్తివేసింది. దీని వల్ల మొత్తం ఖాతాదారులపై పెద్ద మోత్తంలో భారం తగ్గనుంది. ‘కస్టమర్‌ ఫస్ట్‌’ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.  ఎస్‌బీఐ 2017 ఏప్రిల్‌ నుంచి కనీస నిల్వ చార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ కనీస నిల్వ పెనాల్టీగా కస్టమర్ల నుంచి రూ.2,400 కోట్లకు పైగా వసూలు చేసింది. 


ఇతర బ్యాంకులూ ఇదే బాటలో..

ఎస్‌బీఐ వివిధ రకాల విభాగాల్లో వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించడంతోపాటు కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయవచ్చని అంటున్నారు. 


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

వివిధ కాలపరిమితులు కలిగిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్ల (రూ.2 కోట్లకన్నా తక్కువ) వడ్డీ రేటును 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు వడ్డీ రేటును ఎస్‌బీఐ తగ్గించింది. నెల రోజుల్లోనే వడ్డీ రేట్లు రెండోసారి తగ్గాయి. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. ఏడాది అంతకు మించిన మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించారు. దీంతో ఏడాది నుంచి రెండేళ్లకన్నా తక్కువ కాలం ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతం నుంచి 5.90 శాతానికి తగ్గింది. ఇదేకాలానికి సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గింది. 


బల్క్‌ డిపాజిట్లపైనా..

180 రోజులు అంతకు మించి కాల పరిమితి కలిగిన బల్క్‌ టర్మ్‌ డిపాజిట్ల (రూ.2 కోట్లు, అంతకు మించి)పై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించారు. బల్క్‌ కేటగిరీలో ఏడాది, అంతకు మించిన డిపాజిట్లపై ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు 4.75 శాతం నుంచి 4.60 శాతానికి తగ్గింది. గత ఫిబ్రవరిలో బ్యాంక్‌ రిటైల్‌ విభాగంలో వడ్డీ రేట్లను 0.10-0.50 శాతం, బల్క్‌ విభాగంలో 0.25-0.50 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. ఎఫ్‌డీ రేట్లను తగ్గించడం వల్ల ఖాతాదారుల వడ్డీ ఆదాయం  తగ్గుతుంది. 


కనీస నిల్వ పెనాల్టీలతో రూ.10,000 కోట్లు వసూలు

సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస నిల్వను ఉంచనందుకుగాను ఖాతాదారులు గత మూడేళ్లలో జరిమానాల రూపంలో బ్యాంకులకు దాదాపు రూ.10,000 కోట్లు చెల్లించారు. ఇందులో ప్రభుత్వరంగంలోని 18 బ్యాంకులు రూ.6,155 కోట్లు, నాలుగు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు రూ.3,567 కోట్లు వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో వెల్లడించారు. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ అకౌంట్స్‌ (బీఎ్‌సబీడీ), ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజనా (పీఎంజేడీవై) ఖాతాల్లో నిల్వ లేనందుకు మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేయడం లేదు. ఇతర ఖాతాలకు మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నాయి.

Updated Date - 2020-03-12T07:08:32+05:30 IST