Abn logo
Jun 18 2021 @ 01:32AM

ప్రకృతి బిడ్డలకు ప్రత్యేక రక్షణ అవసరం లేదు

కరోనా సోకని పల్లె: పులికోనవంక 


అడవి ఒడిలో దాగిన ఆ బిడ్డలను కరోనా తాకలేకపోయింది. ప్రపంచమంతా హోరెత్తుతున్న జాగ్రత్తలేవీ వాళ్లు ప్రత్యేకంగా పాటించకపోయినా వైరస్‌ వాళ్ల దరి చేరనే లేదు.  చౌడేపల్లె మండలం ఆమినిగుంట పంచాయతీ సింగిరిగుంట సమీపంలోని పులికోనవంక యానాదుల జీవన శైలే వారిని కాపాడుతోంది.


చౌడేపలె :  ఆకుపచ్చని అడవి అల్లుకున్న రెండు గుట్టల నడుమ ఉంటుంది పులికోనవంక. ఉత్తరాన బడపాటిగుట్ట, దక్షిణ దిక్కున బైరేనిగుట్ట..మధ్యలో వానలొస్తే ఉరకలెత్తి పారే వంక. ఆ వంక గట్టున యానాదులు ఏర్పరచుకున్న నివాసమే పులికోనవంక. 30 కుటుంబాలకు చెందిన వంద మంది యానాదులున్న ఈ పల్లె ఇప్పటిదాకా కరోనాకు తలవంచలేదు. అటవీ ఉత్పత్తుల సేకరణ ఇక్కడి యానాదుల ప్రధాన వ్యాపకం. చుట్టుపక్కల అడవులు, కొండలూ తిరుగుతూ ఔషధ విలువలు కలిగిన  వేర్లు, గడ్డలు, తేనె, నెమలి ఊడగ గింజలు వంటివి సేకరిస్తారు. వాటిని అమ్ముకుని ఆ డబ్బులతో కావలసిన సరకులు తెచ్చుకుంటారు. అప్పుడప్పుడడూ చుట్టుపక్క పంటపొలాల్లో కూలిపనులకు కూడా వెళుతుంటారు. మండల కేంద్రమైన చౌడేపల్లెలో ప్రతి మంగళవారం ఏర్పాటయ్యే సంతకు మాత్రమే పులికోనవంక యానాదులు ఊరు దాటి వెళతారు. ఆ రోజు వారపు సంతలో ఉప్ప, పప్పు, కూరగాయలు, బియ్యం వంటివి కొనుగోలు చేసి తిరిగి ఊరు చేరుకుంటారు. ఇతర ప్రాంతాలవారూ పులికోనవంకకు పెద్దగా రారు. వీరూ ఇతర ఊళ్లకు వెళ్లరు. ఆ అవసరం పెద్దగా ఉండదు. అప్పుడప్పుడూ వైద్య సిబ్బంది, వలంటీర్లు మాత్రం వచ్చి వెళుతుంటారు. 

ఇక అడవుల్లో దొరికే రకరకాల గడ్డలు, కాయలు, పళ్ళు వంటివి ఆహారంగా తీసుకుంటారు.  రాగి సంగటి ప్రధాన ఆహారం. ఆకు కూరలు, అడవి దినుసులు అధికంగా తింటారు. సుగంధ వేరు కషాయం తరచుగా తాగుతారు. కొందరికి పాడి ఆవులు, మేకలు కూడా వున్నందున పాల వినియోగం కూడా వుంది.  పులికోనవంక యానాదులు మాస్కులు ధరించడం లేదు. ఆసుపత్రులకు వెళ్లి ఇంజక్షన్లు వేసుకునే అవసరం వీరికి ఇప్పటిదాకా రాలేదు. ఎవరూ వ్యాక్సిన్‌ కూడా వేసుకోలేదు. సాధారణ అనారోగ్యాలకు తమకు తెలిసిన నాటు వైద్యమే చేసుకోవడం అలవాటు. విపరీతంగా శ్రమించే అలవాటు, సహజ సిద్ధ ఆహారం, ప్రకృతిలోనే గడుపుతుండడం వంటివే వీరికి కరోనా వైరస్‌ సోకకపోవడానికి కారణాలుగా భావించాల్సి వస్తోంది.

చిట్టిబాబు

కూలి పనులకైనా దూరం వెళ్ళేది లేదు!

మేముండే పల్లి దాటి వేరే ఊళ్ళకు పొయ్యేదే వుండదు. అడువులు, కొండల్లోనే తిరిగేది. కూలి పనులకు పోవాలన్నా చుట్టుపట్లే. దూరం పొయ్యేది లేదు. మేముండే పల్లికి బయటి వాళ్ళు ఎవరూ రారు. 

- చిట్టిబాబు


మునిరత్నమ్మ

సుగంధ కషాయం తాగుతాం

 అడివిలో దొరికే సుగంధం వేర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఇంటి వాడుకకు పెట్టుకుని మిగిలిన వేర్లు అమ్మేస్తాం. ఆ వేర్లతో రోజూ తెల్లారిపూట కషాయం చేసుకుని తాగుతాం. అది ఒంటికి మేలు చేస్తుందని మా పెద్దోళ్ళు చెబుతారు. అందుకే మాకు జ్వరాలు వంటివి పెద్దగా రావు.

-మునిరత్నమ్మ