Abn logo
Jan 17 2021 @ 02:41AM

‘కొత్త’ లేదు..అంతా మామూలే!

ఓ సబ్‌రిజిస్ర్టార్‌ ఆదాయం రూ.7కోట్లు.. కొత్తవాడని పంపితే రూ.కోట్లకు పడగలు

మరో 11చోట్లా ఫ్రెషర్స్‌కు కావాలని చాన్స్‌.. అవినీతి కట్టడికి చేసిన ప్రయోగం అది

ఆదాయం ఎక్కువ ఉన్నచోట పగ్గాలు.. పంపిన ఏడాదిన్నరలోనే భారీ చేతివాటం 

ఒకరిద్దరు తప్ప అంతా అవినీతి రొచ్చులోకి.. రిజిస్ర్టేషన్ల శాఖలో అవినీతి కథలెన్నెన్నో


(అమరావతి-ఆంధ్రజ్యోతి): విజయవాడలో పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పోస్టింగ్‌ ఇస్తే కోటి రూపాయలు ఇస్తామని ఏడాది క్రితం నాటి మంత్రికి స్వయంగా ఆఫర్‌ వచ్చింది. ఆ ఆఫర్‌ను తిరస్కరించి ఆ కార్యాలయంలో కొత్తవారిని కావాలని నియమించారు. మరో 11 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకూ ‘న్యూ’ టాలెంట్‌నే ఎంపిక చేశారు. వారిని పంపేటప్పుడు ఆశించింది ఏమిటి.. వాస్తవంలో ఎదురయిందేమిటనేది పరిశీలిస్తే...రిజిస్ర్టేషన్‌ శాఖ వర్గాలే గుండెలు బాదుకుంటున్నాయి. కోస్తా జిల్లాల్లో ఒక సబ్‌ రిజిస్ర్టార్‌ ఏకంగా రూ.7కోట్ల అవినీతి సొమ్ము సంపాదించారు. ఇంకో ఆయన అవినీతి సంపాదన లెక్కలకు అంతే లేదు. ఆయన రూ.10కోట్ల వరకు వెనకేసుకున్నారని సమాచారం. వీరంతా కొత్తవారే. అప్పటివరకు ఉన్న అవినీతి ప్రవాహానికి భిన్నంగా...ఒక స్వచ్ఛ ప్రవాహం ఏర్పాడుతుందని చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమైంది.


ఆదాయమూ, అవినీతీ ఎక్కువే...

రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఇచ్చే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో కొన్నింటిని గుర్తించారు. అంతేకాదు, ఇక్కడ అవినీతి కూడా అత్యధికం అని తేల్చిచెప్పారు. అలాంటి వాటిల్లో కృష్ణాజిల్లాలో మూడు, విశాఖపట్నం జిల్లాలో మూడు తొలి ఆరుస్థానాల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్నిచోట్లా అప్పుడే శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన కొత్త బ్యాచ్‌ సబ్‌ రిజిస్ర్టార్లను నియమించారు. అంతేకాదు...ఈ అవినీతి కేంద్రాల్లో సబ్‌ రిజిస్ర్టార్ల పోస్టింగ్‌ అధికారాన్ని డీఐజీల నుంచి తీసేసి...స్వయంగా ప్రభుత్వమే నియమించింది. ఈ ఆరింటినే కాకుండా మరో ఆరు ప్రధాన సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను కూడా గుర్తించి అక్కడ కూడా కొత్తవారినే నియమించారు. అందులో మంగళగిరి, కొరిటపాడు, రాజమహేంద్రవరం అర్బన్‌, అనంతపురం అర్బన్‌ లాంటివి ఉన్నాయి. 


లావాదేవీలు ఎక్కువగా జరగడం, అక్కడ భూముల విలువలు ఎక్కువగా ఉండడం వల్ల 12 రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో అత్యధిక ఆదాయం వస్తోంది. అవి ఏమిటనేది ప్రభుత్వం గుర్తించింది. 


కొత్తగా అప్పుడే ఉద్యోగం సంపాదించి..శిక్షణ పూర్తిచేసుకున్న బ్యాచ్‌లో మొత్తం 24మంది ఉన్నారు. వారిలో 12మందిని మెరిట్‌ ప్రకారం తీసుకుని ఆయా పోస్టింగ్‌లను ఇచ్చారు. రిజిస్ర్టేషన్‌దారులపై భారం పడకుండా, వారినుంచి లంచం తీసుకోకుండా పారదర్శకంగా వ్యవహారం జరిగేందుకు కొత్తవారి నియామకం ఉపయోగపడుతుందని ఆశించారు. 


ఈ అంచనాలు గల్లంతయ్యాయి. ప్రభుత్వానికి రెవెన్యూ వస్తేనే సరా?...మా సంగతేంటని సదరు కొత్త సబ్‌ రిజిస్ట్రార్లు.. రిజిస్ర్టేషన్‌దారుల నుంచి పర్సంటేజీలు పెట్టి మరీ తీసుకున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా అవినీతి ప్రవాహంలోనే కలిసిపోయారని రిజిస్ర్టేషన్‌ శాఖ వర్గాలే  చెప్తున్నాయి. ఎవరైనా నిజాయితీగా ఉందామనుకొన్నా ఉన్నతాధికారులు వారినీ ఈ మురికి కూపంలోకి లాగేసినట్టు సమాచారం. 


కోస్తాలోని ఒక సబ్‌ రిజిస్ర్టార్‌ ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.7కోట్ల అవినీతి సొమ్ము వెనకేశారని చర్చ జరుగుతోంది. దానిపై శాఖలోని ఒకరిద్దరిని అడిగితే...ఆ మొత్తం ఇంకా ఎక్కువే ఉంటుందనే సమాధానం వస్తోంది. 


ఒకాయన రోజుకు లక్ష లేకుండా ఇంటికెళ్లరని ప్రతీతి. కొందరు డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారానే ఈ అవినీతి తతంగమంతా నడుస్తోంది. రిజిస్ర్టేషన్ల విలువలో అరశాతం నుంచి ఒక శాతం వరకు ఇవ్వాలని చెప్తారు. మాట్లాడుకున్నదాన్ని బట్టి మళ్లీ డాక్యుమెంట్‌ రైటరే అవినీతి సొమ్ము ఎంతనేది నిర్ణయిస్తాడు. అప్పో సప్పో చేసుకుని ఒక ఇల్లు, అపార్ట్‌మెంట్‌, స్థలం కొనుక్కున్నవారు మళ్లీ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల దగ్గర ఈ అవినీతి సొమ్ము సమర్పణ అనేసరికి అల్లాడిపోతున్నారు. తాము కొనుగోలు చేసిన ఆస్తి సరైనదే అయినప్పుడు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ర్టేషన్‌ ఫీజులు చెల్లిస్తున్నప్పుడు మధ్యలో ఈ బాదుడేంటి అని వాపోతున్నారు.


వరుసదాడులు...సస్పెన్షన్లు

ఇటీవలికాలంలో రిజిస్ర్టేషన్ల శాఖలో అవినీతికి పాల్పడుతున్నవారు, తప్పులు చేస్తున్నవారిపై పలు చర్యలు తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. 


మంగళగిరి సబ్‌ రిజిస్ర్టార్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఒక బృందాన్ని నియమించగా, వారిచ్చిన నివేదిక ప్రకారం అతనిపై చర్యలు తీసుకున్నారని సమాచారం. 


గుడివాడ సబ్‌ రిజిస్ర్టార్‌పైనా త్వరలో చర్యలకు రంగం సిద్దమైనట్లు సమాచారం.


అనంతపురం జిల్లాలోని చెన్నేకొత్తపల్లి సబ్‌రిజిస్ర్టార్‌ను కూడా అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ చేశారు. 


ఎమ్మెల్యేలకు పర్సంటేజీలు..

రాష్ట్రంలోని నాలుగైదు చోట్ల ఈ సబ్‌రిజిస్ర్టార్ల కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకుంటున్నారని సమాచారం. కొన్నిచోట్ల నేరుగా రిజిస్ర్టేషన్‌ విలువలో తమకు ఇంత శాతం ఇవ్వాల్సిందే అని చెప్తున్నారట!


పర్సంటేజీల రూపంలో కాకుండా...సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం అంటూ మరికొన్నిచోట్ల వసూళ్లు సాగుతున్నాయని తెలిసింది. 

రాయలసీమలోని ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అసలు సబ్‌ రిజిస్ర్టారే ఉండరు. కేవలం సీనియర్‌ అసిస్టెంట్‌ను పెట్టి రిజిస్ర్టేషన్లు చేయిస్తారు. ఆ సీనియర్‌ అసిస్టెంట్‌ ఏ రిజిస్ర్టేషన్‌ చేయాలన్నా స్థానిక ఎమ్మెల్యే ఆమోదం, అతని పర్సంటేజి అతనికి అందాల్సిందే.అవి రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని ప్రభుత్వానికి సంపాదించిపెట్టే సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు. అంతేకాదు...అక్కడున్న సబ్‌ రిజిస్ర్టార్లకు అవినీతి కాసులు కురిపించే కేంద్రాలు కూడా!. ప్రతిరోజు రూ.50వేలు నుంచి లక్షన్నర వరకు అవినీతి ఆదాయం సంపాదించి పెట్టేవే. ఈ వ్యవహారం తెలిసే ఆయా కేంద్రాల్లో పోస్టింగుల కోసం సబ్‌ రిజిస్ర్టార్లు తహతహలాడుతుంటారు. అయితే సుమారు ఏడాదిన్నర క్రితం ఒక ప్రయోగం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి టాప్‌ 12 రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలను ఎంపిక చేసి, అక్కడ కొత్తగా అప్పుడే నియామకమైన ఉద్యోగులను నియమించారు. ఆ తరువాత ఏమయిందో మీరే చదవండి...


టాప్‌ 6 కార్యాలయాలివే..

1..జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ విశాఖపట్నం-1, 2.సబ్‌ రిజిస్ర్టార్‌, మఽధురవాడ(విశాఖపట్నం)3. సబ్‌ రిజిస్ర్టార్‌ భీమునిపట్నం(విశాఖపట్నం) 4.జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1(గాంధీనగర్‌, విజయవాడ) 5. జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌-1(గుణదల) 6. సబ్‌ రిజిస్ర్టార్‌ పటమట (విజయవాడ).


Advertisement
Advertisement
Advertisement