ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..?

ABN , First Publish Date - 2021-04-13T08:54:29+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని జగన్‌ సర్కారు గొప్పలు చెప్పుకోవడం తప్ప.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ, డీఎస్సీ వంటి రిక్రూట్‌మెంట్ల ఊసే

ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..?

22 నెలలుగా కొత్త నోటిఫికేషన్ల్లు లేవు

ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు

ప్రభుత్వోద్యోగాల కోసం లక్షలాదిమంది నిరీక్షణ 

మీరుతున్న వయసు.. నిరుద్యోగుల్లో ఆందోళన 

వయోపరిమితి పెంపుపై సర్కారు తర్జనభర్జన 

ఇంకా రాని స్పష్టత.. 45 ఏళ్లకు పెంచే చాన్స్‌ 

47కు సడలించాలని నిరుద్యోగుల వినతి

లేకుంటే ఉద్యోగార్హత కోల్పోతామని ఆందోళన


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని జగన్‌ సర్కారు గొప్పలు చెప్పుకోవడం తప్ప.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ, డీఎస్సీ వంటి రిక్రూట్‌మెంట్ల ఊసే లేదు. కీలకమైన గ్రూప్‌-1,2,3,4 సర్వీసులతో పాటు జూనియర్‌, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి ఒక్క కొత్త నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తుందో కూడా తెలియని పరిస్థితి. నిరుద్యోగుల వయసు  ఎదురుచూపులతోనే మీరిపోతోంది. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. దీంతో వయసు దాటిపోతోందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్‌ విడుదల ఆలస్యమయ్యే కొద్దీ తాము అనర్హులవుతామని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గరిష్ఠ వయోపరిమితిని పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సడలింపు ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వయోపరిమితిని 45 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. వార్షిక రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ రూపకల్పనపై తాజాగా కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితి సడలింపుపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం.


ఏటా నోటిఫికేషన్లు ఇవ్వని కారణంగా వయోపరిమితి ముగుస్తుండటంతో తీవ్ర ఆందోళనలో ఉన్న నిరుద్యోగులు 47 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే ఉద్యోగార్హతను కోల్పోతామని వారు వాపోతున్నారు. నిరుద్యోగుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు సడలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 2020 సెప్టెంబర్‌ 30తో ముగిశాయి. ఆ తర్వాత వయోపరిమితి సడలింపు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉంది. సకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో గతంలో ఇచ్చిన సడలింపుతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాబోయే నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకుని గరిష్ఠ వయోపరిమితిని 47 సంవత్సరాల వరకు సడలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇందుకు కటా్‌ఫగా 2021 సంవత్సరాన్ని ఈ ఒక్కసారికి ప్రకటించాలని కోరుతున్నారు. ఇక డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాల వరకు ఉంది.


కానీ ఎప్పటి వరకు అమల్లో ఉంటుందన్న విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికైనా నిరుద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని కొత్త నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం మార్గంసుగమం చేయాలని పలువురు కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ, డీఎస్సీ వంటి రిక్రూట్‌మెంట్ల ఊసే లేదు. కీలకమైన గ్రూప్‌-1,2,3,4 సర్వీసులతో పాటు జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల  రిక్రూట్‌మెంట్లకు సంబంధించి ఒక్క కొత్త నోటిఫికేషన్‌ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. 2020 జనవరి 1వ తేదీ నాటికి కొత్త రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇయర్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్‌ ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే విధానం ఉంటుందని కూడా చెప్పారు.


ఏమైందో తెలియదు కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. వచ్చే జూన్‌ నాటికి రాష్ట్రంలో దాదాపు 26 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్‌ అతీగతీ లేదు. డీఎస్సీ-2018 నియామకాలు ఇంత వరకు పూర్తి చేయలేదు. ఇక కొత్త నోటిఫికేషన్‌ ఎప్పుడనేది అధికార యంత్రాంగానికే తెలియని పరిస్థితి. ఉపాధ్యాయ నియామకాలపై గతంలో ఇచ్చిన హామీలు గాలికి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో చివరిసారిగా గ్రూప్‌-3 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంఽధించి 2019లో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల వారీగా నియామకాలు చేపట్టి దాన్ని తమ ఖాతాలో వేసుకోవడం తప్ప వైసీపీ సర్కారు కొత్తగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులు  కోరుతున్నారు.


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగ వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. గ్రంథాలయ శాఖ, ఏపీఈఎస్సీ, డీఎస్సీ, పోలీస్‌ శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయని ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులు వయోపరిమితిని కోల్పోయారన్నారు. లైబ్రరీ శాఖలో గత 12 ఏళ్ల నుంచి  ఖాళీలను భర్తీ చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-13T08:54:29+05:30 IST