ఐరోపా ఇరాన్‌కు సాయం చేస్తే మాకేం అభ్యంతరం లేదు: ట్రంప్

ABN , First Publish Date - 2020-04-10T00:16:47+05:30 IST

కరోనాతో పోరాడుతున్న ఇరాన్‌కు ఐరోపా దేశాలు వైద్యానికి అవసరమైన పరికరాలు, మందులు ఇద్దామనుకుంటే అమెరికాకు ఎటువంటి అభ్యంతరం ఉండదని అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఐరోపా ఇరాన్‌కు సాయం చేస్తే మాకేం అభ్యంతరం లేదు: ట్రంప్

వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న ఇరాన్‌కు ఐరోపా దేశాలు వైద్యానికి అవసరమైన పరికరాలు, మందులు రూపంలో సాయం చేద్దామనుకుంటే అమెరికాకు ఎలాంటి అభ్యంతరం ఉండదని అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘వాళ్లు ఇరాన్‌కు వైద్య పరికారాలు, ఇతర సామాగ్రిని పంపిస్తున్నారు. దీనిపై నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని ట్రంప్ శ్వేత శౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న ఇరాన్ యావత్ మధ్యప్రాచ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ట్రంప్ తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా కఠిన ఆంక్షలు విధించారు. ఇవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించాయి. ఇంతలో కరోనా విలయతాండవం కూడా మొదలవడంతో ఇరాన్ ప్రభుత్వ వర్గాలకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరమైన ఆంక్షలు తొలగించాలంటూ ఇటీవలే ఇరాన్ ఆర్థిక మంత్రి అమెరికాను కోరారు. ఇక తాజా లెక్కల ప్రకారం ఇరాన్‌లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 60 వేలు దాటిపోయింది. అక్కడ 3800కు పైగా కరోనా మరణాలు సంభవించాయి.

Updated Date - 2020-04-10T00:16:47+05:30 IST