సామాజిక దూరంపై.. బాధ్యత ఏదీ...?

ABN , First Publish Date - 2020-03-30T08:54:22+05:30 IST

రాజమహేంద్రవరం జాంపేట మాంసాహార మార్కెట్‌కు ఆదివారం జనం సామూహికంగా వెళ్లి చికెన్‌, రొయ్యలు, చేపలు వంటివి పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఒకరికొకరు రాసుకుంటూ కనీసం దూరం

సామాజిక దూరంపై.. బాధ్యత ఏదీ...?

రాజమహేంద్రవరం సిటీ/ఏలేశ్వరం/ముమ్మిడివరం/, మార్చి 29: 

రాజమహేంద్రవరం జాంపేట మాంసాహార మార్కెట్‌కు ఆదివారం జనం సామూహికంగా వెళ్లి చికెన్‌, రొయ్యలు, చేపలు వంటివి పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఒకరికొకరు రాసుకుంటూ కనీసం దూరం పాటించకుండా వ్యవహరించారు. వారిలో కరోనాపట్ల ఎలాంటి భయం కనిపించలేదు. రాజమహేంద్రవరంలో ఈ పరిణామం ఎటు దారితీస్తుందోనని మిగిలిన ప్రజలు, అధికారులు భయపడిపోతున్నారు. ఏలేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న మున్సిపల్‌ చేపల మార్కెట్‌కు చేపల కొనుగోలుకోసం వందలాదిమంది మాంసాహారప్రియులు తరలివచ్చారు.


ఏలేరు ఎడమ కాలువ, చెరువు గట్లపై కిలోమీటర్ల మేర నిలబడి విక్రయ కేంద్రాలపై ఎగబడ్డారు. ఇక్కడ రెండు భారీ నీటి ప్రవాహ గట్లపై తోపులాటలు జరిగితే గట్టుజారి ప్రమాదం సంభవించే కూడా అవకాశాలున్నాయి. ముమ్మిడివరం మార్కెట్‌లో ప్రజలు గుంపులుగా ఎగబడి చేపలు కొనుగోలు చేశారు. కాకినాడ నగరంలోని మాంసం దుకాణాలు, రమణయ్యపేట మార్కెట్‌, కుంభాభిషేకం వద్ద చేపల మార్కెట్‌ వద్ద కూడా అవే పరిస్థితులు కనిపించాయి. 


ఇలాఉంటే కరానా.!

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా సామాజిక దూరం పాటించని జనం
  • మాంసాహార, కూరగాయల దుకాణాలు, రేషన్‌షాపులవద్ద మూకుమ్మడిగా కొనుగోళ్లు
  • జనం రద్దీతో కొవిడ్‌-19 విస్తరించే అవకాశం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు
  • రాజమహేంద్రవరం జాంపేట, ఏలేశ్వరం, ముమ్మిడివరం మార్కెట్‌ల్లో పదిమంది కలిసి గుమిగూడకండి. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించండి. బయటకు వెళ్తే మాస్కు ధరించండి.
  • ఉదయం 11గంటల లోపు పనులు ముగించుకోండి.. అత్యవసరమైతేనే బయటకు రండి.. ఇలా ఎన్ని మాటలు చెప్పినా కొందరి చెవికి ఎక్కడంలేదు. తమకు అవేవీ పట్టనట్టు.. కరోనా వైరస్‌ మనకి రాదులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
  • కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెసులుబాటు ముసుగులో కొందరు బయట తిరుగుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం దుకాణాలవద్ద, రేషన్‌ ఇస్తుండడంతో ఆయా డిపోలవద్ద పెద్ద ఎత్తున ప్రజలు ఒకేచోట ఉండడం కనిపించింది. 

Updated Date - 2020-03-30T08:54:22+05:30 IST