ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎన్నటికీ మరపురావు : మోదీ

ABN , First Publish Date - 2021-06-25T19:10:37+05:30 IST

ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎమర్జెన్సీ

ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎన్నటికీ మరపురావు : మోదీ

న్యూఢిల్లీ : ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎన్నటికీ మరపురావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 1975లో విధించిన అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగిందన్నారు. ఈ కాలంలో భారత దేశపు ప్రజాస్వామిక లక్షణాలను కాంగ్రెస్ తన కాళ్ళక్రింద పడేసి తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


‘‘ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎన్నటికీ మరపురావు. 1975-77 మధ్య కాలంలో వ్యవస్థల విధ్వంసం సంస్థాగతంగా జరిగింది. భారత దేశ ప్రజాస్వామిక స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, మన రాజ్యాంగంలో పేర్కొన్న విలువలకు తగినట్లుగా నడచుకునేందుకు సాధ్యమైనదంతా చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని మోదీ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. మన ప్రజాస్వామిక విలువలను, లక్షణాలను కాంగ్రెస్ తన కాళ్ళక్రింద పడేసి తొక్కిందన్నారు. ఎమర్జెన్సీని నిరసించి, భారత దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన మహనీయులందరినీ మనం స్మరించుకుందామని పిలుపునిచ్చారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను నొక్కేందుకు ఎమర్జెన్సీని విధించారని దుయ్యబట్టారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలమంతా చీకటి రోజులని పేర్కొన్నారు. 


1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు అత్యవసర పరిస్థితి అమలైంది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని అధికరణ 352 ప్రకారం దీనిని విధించారు. 


Updated Date - 2021-06-25T19:10:37+05:30 IST