Monkeypox: ఆందోళన అక్కరలేదు: Dr Gilada

ABN , First Publish Date - 2022-05-22T00:58:38+05:30 IST

యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ప్రస్తుతం మంకీపాక్స్ (Monkeypox) వైరస్ పంజా విసురుతోంది. అయితే కేసుల..

Monkeypox: ఆందోళన అక్కరలేదు: Dr Gilada

న్యూఢిల్లీ: యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ప్రస్తుతం మంకీపాక్స్ (Monkeypox) వైరస్ పంజా విసురుతోంది. అయితే కేసుల పెరుగుదలపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ప్రఖ్యాత హెచ్ఐవీ (HIV) నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా (Dr.Ishwar Gilada) అన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వైరస్ మహమ్మారి అవుతుందని ఎవరూ చెప్పలేరన్నారు. ఇండియాలో ఎయిడ్స్-కంట్రోల్ (AIDS-control in India)పై డాక్టర్ గిలాడా విస్తృత కృషి చేశారు.


ఇండియాలో ఇంతవరకూ ఎలాంటి మంకీపాక్స్ కేసులు నమోదు కానప్పటికీ బ్రిటన్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్‌, కెనడా, అమెరికాలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ గురించి డాక్టర్ గిలాడ మరింత వివరిస్తూ, హెచ్ఐవీ తరహాలోనే ఇది జూనోటిక్ వ్యాధి (zoonotic diseases) అని అన్నారు. ''ఇలాంటి వైరస్‌లు జంతువుల్లో వ్యాప్తి చెంది, మనుషులకు విస్తరించే అవకాశం ఉంటుంది. గత 40 ఏళ్లగా చూసిన అన్ని (monkeypox) ఇన్‌ఫెక్షన్లు వైరస్‌లే'' అని చెప్పారు. వైరస్ మ్యుటేటింగ్ అవుతున్నందున దీనికి సమర్ధవంతమైన యాంటీ-వైరల్ ప్రస్తుతానికి అందుబాటులో లేదని తెలిపారు.


మంకీపాక్స్ వైరస్ మనుషులకు అప్పుడప్పుడు కోతి, ఇతర జంతువులు కరిచినప్పుడు సోకుతుంది. మంకీపాక్స్‌ ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు కలగి వున్నవారికి ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశముంటుంది. మరణాల శాతం 1 నుంచి 10 శాతం వరకూ ఉండొచ్చు. పిల్లల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలుగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, శోష రస గ్రంధుల వాపుతో ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది. చలి, అలసట, వళ్లంతా దద్దుర్లు కనిపిస్తాయి. మొదట ముఖం మీద దద్దుర్లు ప్రారంభమై జననేంద్రియాలతో సహా శరీరంలోని ఇతర భాగాలన్నిటికీ వ్యాపిస్తాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని వారాల్లోనే కోలుకోవచ్చని,  దద్దుర్లు ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సలహా కోసం వైద్య నిపుణులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యపరంగా ఈ వ్యాధి తీవ్రత తక్కువేనంటున్నారు. గతంలో మశూచి రోగులలో కనిపించే లక్షణాలతో సమానంగా ఉంటాయని చెబుతున్నారు.

Updated Date - 2022-05-22T00:58:38+05:30 IST