Apr 10 2021 @ 20:42PM

‘వకీల్‌ సాబ్‌’.. ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా?

కరోనా లాక్‌డౌన్ సమయంలో.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసిన కొందరు పెద్దలు.. వారి నుంచి కొన్ని హామీలను పొందారు. సినిమా ఇండస్ట్రీ గురించి.. ఒకవైపు కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నా.. చర్చలు జరిపారు. థియేటర్లకు అనుమతులు ఇవ్వాలని, సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలని.. ఇలా సీఎంల ముందు తమ గోడు విన్నవించుకున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సానుకూలంగానే స్పందించారు. తెలంగాణ వరకు అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్‌గా విడుదలైన 'వకీల్‌ సాబ్‌' సినిమాపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం ఏ ఒక్క సినీ పెద్ద ఇంత వరకు స్పందించకపోవడం విశేషం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ విషయంపై పెదవి విప్పలేదు. అలాగే మిగతా హీరోలు కానీ, దర్శకులు, నిర్మాతలు.. అసలెవరూ ఇంతవరకు నోరు మెదపలేదు. ఎక్కడ తమ సినిమాలకు ఆటంకం కలిగిస్తారో అని ఏపీ ప్రభుత్వానికి వారు భయపడుతున్నారా? అనే విధంగా కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. 

ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ సినిమా అని వదిలేస్తే.. రేపు ఇతర హీరోల సినిమాలకు కూడా ఇటువంటి పరిస్థితినే ఏపీ ప్రభుత్వం సృష్టిస్తే.. అప్పుడేం చేస్తారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో లేని ఇబ్బందులు.. కేవలం ఏపీలోనే ఎందుకు? ఏదైనా రాజకీయ కక్ష ఉంటే.. రాజకీయంగానే తేల్చుకోవాలి కానీ.. సినిమాలపై బెదిరింపులు ఎందుకు? ఇలా చేస్తే ఏపీకి సినీ పరిశ్రమ ఎప్పటికి రావాలి? అయినా ఏపీలో ఎన్నో సమస్యలుంటే.. వాటన్నింటిని పక్కన పెట్టి.. 'వకీల్‌ సాబ్‌' సినిమా విషయంలోనే ఉన్నపళంగా ప్రభుత్వం కోర్టు కెళ్లడం చూస్తుంటే.. విడ్డూరం అనిపించకమానదు.

డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యాజమానులు ఏవో నాలుగు తాయిలాలు ప్రకటించగానే.. ఆహా.. ఓహో అంటూ జగన్‌పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్‌.. తన తమ్ముడి సినిమాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపుపై మాత్రం ఇంత వరకు స్పందించకపోవడం వెనుక అర్థమేంటి? అంటూ మెగాభిమానులు కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇతర హీరోల చిత్రాలు పైరసీకి గురైనప్పుడు పవర్‌ స్టార్‌ ముందుండి పోరాటం చేయలేదా?. మరి ఆ హీరోలకు ఇప్పుడేమైంది. రాజకీయాలు పక్కనెట్టి.. సినిమా పరంగా అయినా.. వారు ఒక మాట అడగవచ్చు కదా..!. అంటూ అభిమానులు గట్టిగానే సోషల్‌ మీడియాలో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరి వారి ఆవేదన గమనించైనా.. సినీ పెద్దలు ఈ విషయంపై స్పందిస్తారేమో చూద్దాం.