Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాసంగిలో వరి వద్దు

రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలి

జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు


జోగిపేట/పుల్‌కల్‌, డిసెంబరు 6: యాసంగి సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలే వేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు రైతులకు సూచించారు. చౌటకూర్‌ మండల కేంద్రం, జోగిపేట మండలం సంగుపేట గ్రామాల్లో సోమవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని స్పష్టం చేశారు. రైతుల ఆహారపు అవసరాలు, రైస్‌మిల్లర్లు, సీడ్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు సొంత రిస్కుతో వరి సాగు చేసుకోవచ్చన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని కలెక్టర్‌ వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని ప్రతీ రైతును వ్యవసాయ విస్తరణ అధికారులు కలిసి యాసంగిలో వరి పంటను వేయొద్దని అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. జిల్లాలో 80 శాతం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. మిగిలిన 20 శాతాన్ని కూడా సాధ్యమైనంత త్వరలోనే సేకరిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన 72 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఆయన ప్రయత్యామ్నాయ పంటలపై వ్యవసాయశాఖ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంగపేటలో రైతుబంధు సమితి నాయకులు కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వర్కల అశోక్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నర్సింహారావు, ఏడీఏ అరుణ, ఆత్మ కమిటీ బీటీఎం నరేందర్‌, ఎంఏవో విజయరత్న, చౌటకూరు తహసీల్దారు కిష్టయ్య, నాయబ్‌ తహసీల్దార్‌ మహేశ్‌కుమార్‌, డీటీసీఎస్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement