కరోనా బాధితులకు నో పర్మిషన్‌

ABN , First Publish Date - 2021-05-11T05:20:18+05:30 IST

తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్‌గేటు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు ఏపీ నుంచి వెళ్లే అంబులెన్స్‌లను సోమవారం అడ్డుకున్నారు. ప్రాణాపాయం ఉందని చెప్పినా వారు ససేమిరా అన్నారు.

కరోనా బాధితులకు నో పర్మిషన్‌
పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద అంబులెన్స్‌ను నిలిపివేసిన తెలంగాణ పోలీసులు

  1. ఏపీ అంబులెన్స్‌లను అడ్డుకున్న టీఎస్‌ పోలీసులు
  2. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద నిలిపివేసిన వైనం


కర్నూలు, మే 10:
తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్‌గేటు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు ఏపీ నుంచి వెళ్లే అంబులెన్స్‌లను సోమవారం అడ్డుకున్నారు. ప్రాణాపాయం ఉందని చెప్పినా వారు ససేమిరా అన్నారు. అనుమతించవద్దంటూ తమకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయని తేల్చిచెప్పారు. దీంతో కడప, అనంతపురం, చిత్తూరు.. పలు జిల్లాల నుంచి వెళ్లిన అంబులెన్సులు సరిహద్దు వద్ద చిక్కుకుని పోయాయి. గంట పాటు వాటిని టీఎస్‌ పోలీసులు ఆపేశారు. కర్నూలు పోలీసులు తెలంగాణ పోలీసులతో చర్చించినా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత హైదరాబాదులో ఉన్న ఆసుపత్రుల నుంచి పర్మిషన్‌ లెటరు ఉంటేనే పంపిస్తామని టీఎస్‌ పోలీసులు తెలిపారు. అనంతరం కొవిడ్‌ మినహా ఇతర రోగులు వెళ్లవచ్చని ఆదేశాలు రావడంతో వారిని అనుమతించారు. హైదరాబాదు ఆసుపత్రుల్లో కరోనా బాధితు లకు సరిపడ బెడ్లు లేవని, స్థానికంగా ఉన్నవారికే చాలడం లేదని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ నుంచి కొవిడ్‌ పాజిటివ్‌తో వచ్చిన బాధితులను టోల్‌ప్లాజా వద్ద ఆపేసి.. ఏ ఆసుపత్రికి వెళ్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. సదరు ఆసుపత్రి యజమాన్యంతో సంప్రదించి వారి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చాక అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో పలువురు కరోనా బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కరోనా బాధితులకు హైదరాబాదు ఆసుపత్రి యజమాన్యాలు నో చెప్పడంతో పోలీసులు వారిని వెనక్కి పంపించేశారు.



Updated Date - 2021-05-11T05:20:18+05:30 IST