Abn logo
Sep 23 2021 @ 01:07AM

అనుమతులు ఉండవు... వసతులు లేవు

- ఇష్టారీతిగా ప్రైవేటు పాఠశాలల వసతి గృహాలు

- కొవిడ్‌ నిబంధనలు గాలికి

- పట్టించుకోని విద్యాశాఖాధికారులు

జగిత్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇష్టారీతిగా ప్రైవేటు పాఠశాలల వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా పలు ప్రైవేటు యాజమాన్యాలు పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌ కారణంగా ఇప్పటివరకు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు తెరుచుకోనప్పటికీ ప్రైవేటు పాఠశాలల వసతి గృహాలు మాత్రం తెరుచు కుంటున్నాయి. ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. మూడు, నాలుగు రోజులుగా పదుల సంఖ్యలో ప్రైవేటు వసతి గృహాలను నిర్వాహకులు తెరిచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే ఏ ఒక్క వసతి గృహానికి అనుమతులు లేవు. సాధారణ సమయాల్లో సైతం అనుమతులు లేకుండా ప్రైవేటు వసతి గృహాలను నిర్వహించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా వసతి గృహాలను తెరుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.  

జిల్లాలో పాఠశాలల వివరాలు ఇలా...

జగిత్యాల జిల్లాలో 303 ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 26 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.  ప్రైవేటు పాఠశాలల్లో 69,494 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల్లో సగానికి పైగా రెసిడెన్షియల్‌ విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటున్నట్లు అంచనా ఉంది.  

జిల్లాలో కనీసం ఒక్క ప్రైవేటు విద్యార్థి వసతి గృహానికైనా ప్రభుత్వ అనుమతి లేదని తెలుస్తోంది. విద్యాశాఖతో పాటు మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, అగ్నిమాపక తదితర శాఖల అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వసతి గృహాలను తెరుస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

వసతులు ఇలా :

వసతి గృహాల్లో ప్రతి 25 మందికి ఒక వార్డెన్‌, ట్యూటర్లు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ప్రతి 8 నుంచి 10 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు అవసరమైన కిచెన్‌, డైనింగ్‌ హాలు ఏర్పాటు చేయాలి. భద్రత కలిగిన గదుల నిర్మాణం తదితర వసతులు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి ఆరోగ్య కార్యకర్త, ఏఎన్‌ఎం పర్యవేక్షణ ఉండాలి. నిర్ణీత వేళల్లో అర్హులైన వైద్యులచే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. అంటు వ్యాదులు ప్రబల కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

అధికారులు చర్యలు తీసుకోవాలి

- తులసి ఆగమయ్య, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు వసతి గృహాలను నిర్వహిస్తుండడం  సరికాదు. అధికారులు సోదాలు నిర్వహించి అవసర మైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలను సైతం ప్రారంభించాలి. ప్రైవేటు యాజమాన్యాలు వసతి గృహాలను తెరుస్తుండడం, ప్రభుత్వ వసతి గృహాలు తెరుచుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు వసతిగృల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.  

నిబంధనలు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు

- జగన్మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, జగిత్యాల

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను వ్యతిరేకిస్తే చర్యలు తీసుకుంటాము. జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రైవేటు విద్యార్థి వసతి గృహం నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా వసతి గృహాలను నిర్వహిస్తే కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి సీజ్‌ చేస్తాము. ఇప్పటివరకు ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలను తెరువలేదు.