ఇందిరానగర్‌లో పందుల బెడద

ABN , First Publish Date - 2021-05-08T04:58:04+05:30 IST

మండలంలోని మామిళ్లపల్లె పంచాయతీకి చెందిన ఇందిరానగర్‌, కడప నగరం 16వ డివిజన్‌లో భాగంగా ఉంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మానసపుత్రికగా రిమ్స్‌ ఆస్పత్రి సమీపంలో ఇందిరానగర్‌ వెలసింది.

ఇందిరానగర్‌లో పందుల బెడద
ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న పందులు

బెంబేలెత్తుతోన్న ప్రజలు 

అటువైపు చూడని  అధికారులు

సీకేదిన్నె, మే 7: మండలంలోని మామిళ్లపల్లె పంచాయతీకి చెందిన ఇందిరానగర్‌, కడప నగరం 16వ డివిజన్‌లో భాగంగా ఉంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మానసపుత్రికగా రిమ్స్‌ ఆస్పత్రి సమీపంలో ఇందిరానగర్‌ వెలసింది. ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి అనేక సమస్యలతో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. మరీ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు పందులు స్వైరవిహారం చేస్తున్నా యి. నివాసం ఉండే ఇళ్ల చుట్టూ తిరుగుతూ రోగాల పాలు చేస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 

ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఏ వీధిలో చూసినా పందులే. ఇళ్ల మధ్య ఉన్న మరికి నీటిలో పొర్లుతూ అనారోగ్యాలకు ఆవాస కేంద్రంగా మారుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇళ్ల వద్ద ఆడుకునే పిల్లలపై దాడి చేస్తున్నాయని, అనేక మంది పిల్లలు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన సంఘటనలూ ఉన్నాయని పేర్కొంటు న్నారు. పిల్లలతో పాటు వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారని, పట్టించుకునే వారు లేరంటూ మండిపడ్డారు. పేరుకే కార్పొరేషన్‌ .. ఎక్కడ చూసినా మురికి, చెత్తదిబ్బలు, పందుల సంచారం. ఇదేనా కార్పొరే షన్‌ అంటే అని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పందులను దూరంగా తరిమివేయాలని పలువురు కోరుతున్నారు. 


పలుమార్లు విన్నవించాం

పందుల సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి వినతిపత్రం అందించాం. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో అనేక మంది పిల్లలు పందుల దాడిలో గాయపడి ఆస్పత్రి పాలవుతున్నారు. పైగా పందులు మురికి కాలువల్లో పొర్లుతూ వీధుల వెంట తిరుగడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది.                

- ప్రసాద్‌, ఇందిరానగర్‌


సమస్యను త్వరలో పరిష్కరిస్తాం

పందుల సమస్యను తొలగించేందుకు కలెక్టర్‌కు, ఎస్పీకి విన్నవించాం. త్వరలో పందుల సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. ఇదివరకే పందుల యజమానులకు నోటీసులు కూడా ఇచ్చాం. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఏదేమైనా సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. 

- శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌ 



Updated Date - 2021-05-08T04:58:04+05:30 IST