కట్టడి లేదు.. పట్టించుకోరు!

ABN , First Publish Date - 2020-08-03T19:48:39+05:30 IST

మెదక్ జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. రోజురోజుకూ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి మొదట్లో యుద్ధప్రాతిపాదికన పనిచేసిన అధికారులు, సిబ్బంది ఇప్పుడు

కట్టడి లేదు.. పట్టించుకోరు!

తూప్రాన్‌(ఆంధ్రజ్యోతి):  మెదక్ జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. రోజురోజుకూ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి మొదట్లో యుద్ధప్రాతిపాదికన పనిచేసిన అధికారులు, సిబ్బంది ఇప్పుడు చేతులెత్తేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఒక్క కేసు నమోదైనా అధికారులు ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని కట్టడి చేశారు. మున్సిపల్‌, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కరోనా నివారణకు రసాయాలను పిచికారీ చేసేవారు. పాజిటివ్‌ నిర్ధారణ జరిగిన వ్యక్తిని ఐసోలేషన్‌ చేయడం, బాధితుడి ప్రాథమిక, సెకండరీ కాంటాక్టుల వివరాలను సేకరించి హోం క్వారంటైన్‌ చేసేవారు. క్రమంగా అధికారులు పట్టు సడలించారు. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన బాధితులను కూడా పట్టించుకోవడంలేదు. కరోనా కేసు నమోదైనా పక్కింట్లోవారికి కూడా తెలియడం లేదు. కట్టడి ప్రాంతాల ఏర్పాటు, రసాయనాలు పిచికారీ చేయడం, కాంటాక్టుల వివరాలను సేకరించడం గాలికి వదిలేశారు. దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. కాంటాక్టులు యథేచ్ఛగా బయట తిరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్నది. తూప్రాన్‌ పట్టణంలో జూన్‌ 8న తొలి పాజిటివ్‌ కేసు నమోదయ్యింది. 


అప్పటి నుంచి జూలై 15 వరకు 37 రోజుల్లో 18 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క్రమంగా కేసులు పెరుగుతున్నా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ఠ చర్యలు చేపట్టారు. బాధితుల ఇంటి పరిసరాలు కట్టడి చేసి శానిటేషన్‌ చేపట్టారు. వైద్య సిబ్బంది చుట్టుపక్కల ఇళ్లలో హెల్త్‌ సర్వే నిర్వహించడం, కాంటాక్టుల జాబితా తయారు చేసి క్వారంటైన్‌ చేయడం తదితర చర్యలు తీసుకునేవారు. కానీ గడచిన 15 రోజుల్లో పరిస్థితి అదుపు తప్పింది. 15 రోజుల్లో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఇప్పటికే ఇద్దరు వ్యాపారులు కొవిడ్‌-19తో మృతిచెందగా, మండలంలోని ఘనపూర్‌లో ఓ ఆయుర్వేద వైద్యుడు, ఆయ దగ్గరి బంధువు మృత్యువాతపడ్డారు. అయినా ఎలాంటి చర్యలేమీ చేపట్టడంలేదు. కట్టడి, నివారణ చర్యలు తీసుకునే దిక్కులేకుండా పోయింది. కాంటాక్టులను ట్రేస్‌ చేయడం కూడా లేదు. వైద్యులు కూడా ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడం కూడా చేయడంలేదు. కేవలం ఇంటలీజెన్స్‌ అధికారులు మాత్రం కేసుల సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

Updated Date - 2020-08-03T19:48:39+05:30 IST