Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొనుగోళ్లేవీ?

వర్షంతో తడుస్తున్న ధాన్యం

కాపాడుకోలేక రైతుల ఇక్కట్లు

కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతికి అందుబాటులో లేని లారీలు

అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా చిరు జల్లులు, మోస్తరు వర్షం కురుస్తుండటంతో ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దవుతోంది. ఐకేపీ కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో రైతులే వాటిని అద్దెకు తెచ్చి ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా ఇక్కట్లుపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రోజుల తరబడి రైతులు పడిగాపులుకాస్తున్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 626 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అందులో నల్లగొండ జిల్లాలో 220, సూర్యాపేట జిల్లాలో 223 కేంద్రాలను ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో 261 కేంద్రాలకు 145 కేంద్రా లు ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా మొత్తం 13.50లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కనీసం లక్ష మెట్రిక్‌ టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో కూడా ఆలస్యమవుతోంది. రవాణాకు సరిపడా లారీ లు లేక ధాన్యమంతా కేంద్రాల్లోనే ఉంటోంది. దీంతో కొనుగోళ్లు మందకొడి గా సాగుతున్నాయి. మిర్యాలగూడ ప్రాంత మిల్లర్లు సన్నాలకు ధర తగ్గించ గా, వర్ష భయంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో అడిగిన ధరకు ధాన్యం విక్రయించి నష్టపోతున్నారు.


ఆందోళనలో రైతులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్టోబరు మూడో వారం నుంచి ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్‌ కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి రైతులు పడిగాపులుకాస్తున్నారు. ఇప్పటికే చిరుజల్లులతో ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడుతుండగా, అక్కడక్కడ రాశుల కిందకు వరద చేరుతోంది. ఎప్పుడు భారీ వర్షం వచ్చి ధాన్యం మొత్తం తుడుచుకుపోతుందోనని రైతులు ఆందోళనలో ఉన్నారు. కనీసం టార్పాలిన్లు కూడా లేకపోవడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ 17శాతం ఉంటేనే కొనుగోళ్లు చేస్తామని ఐకేపీ నిర్వాహకులు చెబుతుండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఈ తేమశాతం రావడం లేదు. దీంతో కొనుగోళ్లలో జా ప్యం ఏర్పడుతోంది. వానాకాలం సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 6.963లక్షల మెట్రిక్‌ టన్నులు, సూర్యాపేటలో 4లక్షల మెట్రిక్‌ టన్నులు, యాదాద్రి జిల్లాలో 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేయాల్సి ఉంది. వానాకాలం కోతలు మొదలై నెల దాటగా, ఈ నెల 22వ తేదీ నుంచి యాసంగి సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కల్లాలు, ఐకేపీల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది రైతులు విధిలేక ప్రైవేటు వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.1400 నుంచి రూ.1450 ధరకు విక్రయిస్తున్నారు.


 ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ అధికారులు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఎంసీ, ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడంలేదు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఓపీఎంఎ్‌సలో పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిబంధనతో కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల పేరిట భూమి, పంటల వివరాలు నమోదు కాలేదు. భూమి కౌలుకు ఇచ్చిన రైతుల పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ చేద్దామంటే కొందరు అందుబాటులో లేరు. కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించేలా ఓపీఎంఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని అధికారులు చెబుతుండగా, ఈ విధానం సమస్యగా మారిందని కౌలు రైతులు పేర్కొంటున్నారు.


వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి

త్రిపురారంలో రైతులు రాస్తారోకో 

త్రిపురారం, నవంబరు 20: సన్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించి వెంటనే ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల, గ్రామశాఖ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, అనుముల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు బీపీటీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, రాస్తారోకోతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోవడంతో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివా్‌సరెడ్డి, కసిరెడ్డి నరేష్‌, పిబి.శ్రీనివాస్‌, చిలుముల శ్రీను, రవి, వీరయ్య, హుస్సేన్‌, శంకర్‌, రాజారామ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement